R Sai Kishore: 


టీమ్‌ఇండియా యువ క్రికెటర్‌ ఆర్‌.సాయి కిశోర్‌ భావోద్వేగానికి గురయ్యాడు. జాతీయ గీతం వస్తున్నప్పుడు కన్నీరు పెట్టుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాలన్న కల ఇన్నాళ్లకు నెరవేరడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. అతడు కన్నీరు పెట్టుకున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.


దేశవాళీ క్రికెట్లో సాయి కిశోర్‌ అద్భుతాలు చేశాడు. బంతిని గింగిరాలు తిప్పిస్తూ వికెట్లు పడగొట్టాడు. అవసరమైతే బ్యాటుతోనూ రాణించాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులోనూ సత్తా చాటాడు. చివరి రెండు సీజన్లలో గుజరాత్‌ టైటాన్స్‌కు అతడు ఎక్స్‌ ఫ్యాక్టర్‌గా మారాడు. సీనియర్‌ క్రికెటర్లంతా ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ కోసం రావడంతో అతడికి అవకాశం దక్కింది.




హాంగ్జౌలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈసారి టీ20 క్రికెట్‌ పోటీలు జరుగుతున్నాయి. ఇందుకోసం యువ భారత జట్టును బీసీసీఐ పంపించింది. వీవీఎస్‌ లక్ష్మణ్‌ నేతృత్వంలో వీరు ఆడుతున్నారు. ఇందులో భాగంగానే తమిళనాడుకు చెందిన సాయి కిశోర్‌ నేడు అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. నేపాల్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో టీమ్‌ఇండియాకు ఆడాడు. మ్యాచ్‌ ఆరంభంలో జాతీయ గీతం వినిపించడంతో అతడు భావోద్వేగానికి గురయ్యాడు.


సాయి కిశోర్‌ కన్నీళ్లు పెట్టుకోవడం ఎంతోమందిని కదిలించింది. ముఖ్యంగా తమిళనాడుకు చెందిన సీనియర్‌ క్రికెటర్‌, వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్ అతడిపై ప్రశంసలు కురిపించాడు. అతడు అరంగేట్రం చేయాలని తానెప్పటి నుంచో కోరుకున్నానని తెలిపాడు.


'నేపాల్‌తో మ్యాచులో సాయికిశోర్‌ నేడు టీ20 క్రికెట్లో అరంగేట్రం చేశాడు. భారత జాతీయ గీతం వస్తున్నప్పుడు అతడు భావోద్వేగానికి గురయ్యాడు. కఠినంగా శ్రమిస్తే కలలు నెరవేరుతాయని మీరు నమ్మితే ఒక లవ్‌ గుర్తు డ్రాప్‌ చేయండి' అని సోనీ లివ్‌ ట్వీట్‌ చేసింది.


'కష్టపడ్డ వారికి దేవుడు కచ్చితంగా ఫలితాలు ఇస్తాడు. దేశవాళీ క్రికెట్లో సాయికిశోర్‌ నమ్మశక్యం కాని విధంగా శ్రమించాడు. తెలుపు బంతి క్రికెట్లో అతడో సూపర్‌ స్టార్‌. అతడు అరంగేట్రం చేయడం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. ఉదయం లేవగానే టీమ్‌ఇండియా తుది  జట్టులో అతడి పేరు చూడగానే నేను భావోద్వేగానికి గురయ్యాను. కొందరు బాగుండాలని, రాణించాలని మనప్పుడూ కోరుకుంటాం. అలాంటి నా జాబితాలో అతనెప్పుడూ ముందుంటాడు. బ్యాటింగ్‌ను మెరుగుపర్చుకున్న తీరే అతడి గురించి చెబుతుంది. ఒకప్పుడు అతడి బ్యాటింగ్‌లో ఎలాంటి అద్భుతాలు ఉండేవి కావు. అలాంటి స్థితి నుంచి అన్ని ఫార్మాట్లలో ఆధారపడదగ్గ ఆటగాడిగా ఎదిగాడు. నేనెప్పుడూ అతడి గురించి మాట్లాడుతూనే ఉంటా. అతడు టీమ్‌ఇండియా క్రికెట్‌ అయినందుకు సంతోషంగా ఉంది' అని దినేశ్‌ కార్తీక్‌ ట్వీట్‌ చేశాడు.


ఏషియా గేమ్స్ లో స్వర్ణ పతకమే లక్ష్యంగా భారత పురుషుల క్రికెట్ జట్టు తొలి అడుగు ఘనంగా వేసింది. నేపాల్ తో జరిగిన క్వార్టర్ ఫైనల్ లో 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. సెమీఫైనల్ లోకి అడుగుపెట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్, 202 పరుగులు చేసింది. యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ రికార్డు సెంచరీ సాధించాడు. 49 బాల్స్ లోనే ఆ మార్క్ అందుకున్నాడు. టీమిండియా తరఫున సెంచరీ చేసిన అత్యంత పిన్నవయస్కుడిగా రికార్డు సృష్టించాడు. టాప్ ఆర్డర్ లో జైస్వాల్ తప్ప మిగతా ఎవరూ ఆకట్టుకోలేకపోయారు. పవర్ ప్లే తర్వాత వికెట్ కాస్త స్లో అవటంతో షాట్లు ఆడటానికి బ్యాటర్లు ఇబ్బందిపడ్డారు.


కానీ చివర్లో యువ సంచలనం రింకూ సింగ్ తో పాటు శివం దూబే భారీ షాట్లు ఆడారు. రింకూ అయితే 15 బాల్స్ లోనే 37 స్కోర్ చేశాడు. చేజింగ్ కు దిగిన నేపాల్, నిర్ణీత 20 ఓవర్లలో 179 స్కోర్ చేసింది. ఇన్నింగ్స్ లో పలువురు బ్యాటర్లు ఆడిన షాట్లు ఆకట్టుకున్నాయి. కాస్త ప్లానింగ్ తో ఆడి ఉంటే టార్గెట్ కు మరింత దగ్గరగా వచ్చేవాళ్లే. భారత స్పిన్నర్లు రవి బిష్ణోయ్ మరియు సాయి కిషోర్ బౌలింగ్ లో నేపాల్ ఇబ్బందిపడింది కానీ పేసర్లను చాలా బాగా హ్యాండిల్ చేసింది. అవేష్ ఖాన్ మరియు రవి బిష్ణోయ్ మూడేసి వికెట్లు తీశారు. మరో క్వార్టర్ ఫైనల్ లో వచ్చే ఫలితం ఆధారంగా అక్టోబర్ 6వ తేదీన భారత్ ఆడబోయే సెమీఫైనల్ లో ప్రత్యర్థి ఎవరో తెలుస్తుంది.