India Women vs UAE Women T20I Highlights | దంబుల్లా: ఆసియాకప్ టీ20 టోర్నీలో భారత్ మహిళలు అదరగొట్టారు. గ్రూప్ స్టేజీలో వరుసగా రెండో విజయం అందుకున్నారు. యూఏఈతో ఆదివారం జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 78 పరుగుల తేడాతో యూఏఈపై ఘన విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత మహిళలు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 201 పరుగులు చేయగా, ఛేజింగ్ లో యూఏఈ 7 వికెట్లు కోల్పో 123 రన్స్‌కే పరిమితమైంది.
టాస్ ఓడిన భారత్, టీ20 చరిత్రలో రికార్డ్ స్కోరు
యూఏఈతో టీ20 మ్యాచ్‌లో భారత మహిళల టీమ్ టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ కు దిగింది. 23 పరుగుల వద్ద ఓపెనర్ స్మృతీ మందాన ఔటైంది. దూకుడుగా ఆడే క్రమంలో (13) స్మృతి వికెట్ సమర్పించుకుంది. మరో ఓపెనర్ షెఫాలీ వర్మ (37, 18 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. హేమలత త్వరగా ఓటైనా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (66; 47 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సంచరీతో అదరగొట్టింది. కానీ రనౌట్ రూపంలో పెవిలియన్ బాట పట్టింది. జెమిమా (14) రన్స్ చేయగా.. వికెట్ కీపర్ రీచా గోష్ బ్యాట్‌తో సత్తా చాటి మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టును నడిపించింది. రిచా ఘోష్ (64 నాటౌట్, 29 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్) భారీ షాట్లకు విరుచుకుపడటంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. భారత మహిళల జట్టుకు టీ20ల్లో ఇదే అత్యధిక స్కోరు. యూఏఈ బౌలర్లలో కవిషా ఎగోడగే 2 వికెట్లు తీయగా, సమైర, హీనా చెరో వికెట్ దక్కించుకున్నారు.
బ్యాటింగ్‌లోనూ యూఏఈ తడబాటు
202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ మహిళల బ్యాటింగ్ ఏ దశలోనూ టార్గెట్ దిశగా సాగలేదు. 11 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. తీర్థ సతీష్ 4 రన్స్ కు, వన్ డౌన్ బ్యాటర్ రినిత రజిత్ 7 పరుగులకే పెవిలియన్ చేరారు. మరో ఓపెనర్ ఈషా ఓజా (38 రన్స్, 36 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) తో రాణించింది. బౌలింగ్ లో రాణించిన కవిషా ఎగోడాగే బ్యాటింగ్ లోనూ మెరిపించింది. కవిషా (40 నాటౌట్, 32 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్)తో స్కోరు బోర్డు నడిపించే ప్రయత్నం చేసినా.. ఇతటర బ్యాటర్ల నుంచి సహకారం అందలేదు. భారత మహిళలు ఏ దశలోనూ యూఏఈ బ్యాటర్లకు పరుగులు చేసే అవకాశం ఇవ్వలేదు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ఆడినా యూఏఈ మహిళలు 7 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేయడంతో 78 రన్స్ తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ 2 వికెట్లు పడగొట్టింది. రేణుకా సింగ్, తనుజా, పుజా వస్త్రాకర్, రాధా యాదవ్ తలో వికెట్ తీశారు. ఆసియా కప్ లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ హర్మన్ ప్రీత్ సేన విజయాలు అందుకుంది.
Also Read: Ajit Agarkar: కెప్టెన్‌గా సూర్య భాయ్, కథ నడిపింది అంతా అగార్కరేనా ?