Asia cup India Win by 9 Wickets Vs UAE :  ఆసియా క‌ప్ ను త‌న‌దైన స్టైల్లో ఇండియా ప్రారంభించింది. డిఫెండింగ్ చాంపియ‌న్ హోదాలో బ‌రిలోకి దిగిన భార‌త్.. బుధ‌వారం దుబాయ్ లో జ‌రిగిన మ్యాచ్ లో ప‌సికూన, ఆతిథ్య యూఏఈపై 9 వికెట్ల‌తో ఘ‌న విజ‌యం సాధించింది. అంత‌కుముందు టాస్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన యూఏఈ భార‌త బౌల‌ర్ల ధాటికి బెంబేలెత్తిపోయింది. కేవ‌లం 13.1 ఓవ‌ర్లలోనే 57 ప‌రుగుల‌కు కుప్ప‌కూలింది. ఓపెనర్ అలీష‌న్ ష‌రాఫు (17 బంతుల్లో 22, 3 ఫోర్లు, 1 సిక్స‌ర్) టాప్ స్క‌రర్ గా నిలిచాడు. చైనామ‌న్ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ ((4/7) బంతితో మాయ చేసి అద్భుతం చేశాడు. అనంత‌రం ఛేజింగ్ ను కేవ‌లం 4.3 ఓవ‌ర్ల‌లో 1 వికెట్ నష్టానికి 60 ప‌రుగులు చేసి కంప్లీట్ చేసిన భార‌త్, 9 వికెట్ల తేడాతో ఘ‌న‌విజ‌యం సాధించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (16 బంతుల్లో 30, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అభిషేక్ వికెట్ ను జునైద్ సిద్దిఖీ తీశాడు. ఈ ఫ‌లితంలో టోర్నీలో ఇండియా బోణీ కొట్ట‌డంతోపాటు గ్రూప్-ఏలో తొలి విజ‌యాన్ని సాధించింది. త‌ర్వాత మ్యాచ్ లో భాగంగా ఈనెల చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్తాన్ తో ఆదివారం (14న‌) త‌ల‌ప‌డ‌నుంది. 

చ‌కాచ‌కా ఛేజింగ్..చిన్న టార్గెట్ తో బ‌రిలోకి దిగిన భార‌త్ కు ఓపెన‌ర్లు అభిషేక్ శ‌ర్మ , శుభ‌మాన్ గిల్ (20 నాటౌట్) తుఫాన్ అరంభం అందించారు. ఎదుర్కొన్న తొలి బంతినే సిక్స‌ర్ గా మ‌లిచిన అభిషేక్ త‌న ఉద్దేశాన్ని చాటాడు. ఈ మ్యాచ్ ద్వారా పొట్టి ఫార్మాట్ లో ఓపెన‌ర్ గా ప్ర‌మోష‌న్ పొందిన గిల్ కూడా చెల‌రేగాడు. వీరిద్ద‌రూ విధ్వంస సృష్టించ‌డంతో యూఏఈ బౌల‌ర్ల‌కు ఏం చేయాలో అర్థం కాలేదు. తొలి ఓవ‌ర్లోనే మరో బౌండ‌రీని అభిషేక్ బాద‌డంలో ప‌ది ప‌రుగులు వ‌చ్చాయి. త‌ర్వాత ఓవ‌ర్లో గిల్  కూడా ఒక‌ ఫోర్, సిక్స‌ర్ కొట్టి జోరును ప్ర‌ద‌ర్శించాడు. అలా వీరిద్ద‌రూ ప‌రుగులు వేట సాగించ‌డంతో ప‌రుగులు చ‌కాచ‌కా వ‌చ్చాయి. మూడో ఓవ‌ర్ల‌లో అభిషేక్ మ‌రోసారి ఒక ఫోర్, సిక్స‌ర్ కొట్ట‌డంలో టార్గెట్ క‌రుగుతూ వ‌చ్చింది. ఆ తర్వాత స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో అభిషేక్ ఔటవడంతో తొలి వికెట్ కు నమోదైన 48 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది... ఆ తర్వాత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (7 నాటౌట్) తో కలిసి గిల్ మిగతా లాంఛనాన్ని పూర్తి చేశాడు. 

ట‌పాట‌పా..నిజానికి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన యూఏఈకి శుభారంభ‌మే ద‌క్కింది. కెప్టెన్ క‌మ్ ఓపెన‌ర్ ముహ‌మ్మ‌ద్ వ‌సీమ్ (19) తో క‌లిసి ఆలీష‌న్ తొలి వికెట్ కు 26 ప‌రుగులు జోడించి, మంచి స్టార్ట్ ను అందించాడు. అయితే అలీ ష‌న్ ఔట‌య్యాక యూఏఈ కుదుపున‌కు లోనైంది. ఓ ఎండ్ లో వ‌సీమ్ నిల‌బ‌డినా, వ‌చ్చిన ప్లేయ‌ర్ల వ‌చ్చిన‌ట్లు వెనుదిరిగారు. ముఖ్యంగా ఒకొనొక ద‌శ‌లో 46/2 తో మంచి స్థితిలో నిలిచిన యూఏఈ ఆ త‌ర్వాత అనూహ్యంగా కుప్ప‌కూలింది. కేవ‌లం 11 ప‌రుగుల తేడాతో మిగ‌తా 8 వికెట్లను చేజార్చుకుంది. ముఖ్యంగా కుల్దీప్ స్పిన్ మంత్రానికి ఆతిథ్య జ‌ట్టు వ‌ద్ద స‌మాధానం లేకుండాపోయింది. మ‌రో ఎండ్ లో శివ‌మ్ దూబే కూడా మూడు వికెట్ల‌తో రాణించాడు. స్టార్ పేస‌ర్ జ‌స్ ప్రీత్ బుమ్రా, అక్ష‌ర్ ప‌టేల్, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తికి తలో వికెట్ ద‌క్కింది. ఈ ఫార్మాట్ లో భార‌త్ పై ఒక ప్ర‌త్య‌ర్థి న‌మోదు చేసిన అత్య‌ల్ప స్కోరు ఇదే కావ‌డం విశేషం.