Asia cup AFG Win by 94 Runs Vs HKg Latest News: ఆసియా కప్ లో ఆఫ్గానిస్థాన్ శుభారంభం చేసింది. మంగళవారం టోర్నీ ఓపెనర్ గా హాంకాంగ్ తో జరిగిన మ్యాచ్ లో 94 పరుగులతో విజయం సాధించింది. అబుదాభిలోని షేక్ జయేద్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆఫ్గాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 188 పరుగులు చేసింది. ఓపెనర్ సాదిఖుల్లా అటల్ స్టన్నింగ్ అజేయ ఫిఫ్టీ (52 బంతుల్లో 73 నాటౌట్, 6 ఫోర్లు, 3 సిక్సర్లు)తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలర్లలో ఆయుష్ శుక్లా, కించిత్ షాకు రెండేసి వికెట్లు దక్కాయి.
అనంతరం భారీ ఛేజింగ్ లో బరిలోకి దిగిన హాంకాంగ్.. ఓవర్లన్నీ ఆడి 9 వికెట్లకు 94 పరుగులు మాత్రమే చేసి, 94 పరుగులతో పరాజయం పాలైంది. బాబర్ హయాత్ (39) టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఫజల్ హక్ ఫరూఖీ, గుల్బదిన్ నయిబ్ రెండేసి వికెట్లతో హాంకాంగ్ పతనాన్ని శాసించారు. దీంతో గ్రూప్-బిలో తొలి విజయాన్ని ఆఫ్గాన్ దక్కించుకున్నట్లయ్యింది. టోర్నీలో తర్వాతి మ్యాచ్ బుధవారం ఆతిథ్య యూఏఈ, ఇండియా మధ్య జరుగుతుంది.
అటల్, ఒమర్జాయ్ జోరు..టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆఫ్గాన్ కు శుభారంభం దక్కలేదు. ఆరంభంలోనే విధ్వంసక రహ్మానుల్లా గుర్బాజ్ (8), ఇబ్రహీం జద్రాన్ (1) వికెట్లను కోల్పోయింది. ఈ దశలో వెటరన్ మహ్మద్ నబీ (33) తో కలిసి అటల్ ఇన్నింగ్స్ ను నిర్మించాడు. వీరిద్దరూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు కొడుతూ, వేగంగా పరుగులు జత చేశారు. మూడో వికెట్ కు 51 పరుగులు జతయ్యాక నబీ ఔటయ్యాడు. నయిబ్ (5) విఫలమైనా, అజ్మతుల్లా ఒమర్జాయ్ (21 బంతుల్లో 53, 2 ఫోర్లు, 5 సిక్సర్లు) తో కలిసి అటల్ ఆఫ్గాన్ కు భారీ స్కోరు అందించాడు. స్లాగ్ ఓవర్లలో వీరిద్దరూ సిక్సర్లతో రెచ్చిపోవడంతో ఆఫ్గాన్ అనుకున్నదానికంటే భారీ స్కోరు సాధించింది.
చేతులెత్తసిన హాంకాంగ్..భారీ టార్గెట్ ను చూసి బెంబేలెత్తిపోయిన హాంకాంగ్ చేతులెత్తేసింది. పేరుకు హాంకాంగ్ టీమ్ అయినప్పటికీ, మెజారిటీ ఇండియా, పాక్ సంతతి ప్లేయర్లే ఈ జట్టు తరపున ఆడుతున్నారు. అయితే ఆఫ్గాన్ కట్టుదిట్టమైన బౌలింగ్ కు వీరివద్ద సమాధానం లేకుండా పోయింది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ, మ్యాచ్ ను ఎప్పుడో ఆఫ్గాన్ కు అప్పగించింది.బాబర్ కాస్త పోరాటం చేయడంతో వంద పరుగుల మార్కు దగ్గరగా వెళ్లింది. ఈ ఫలితంతో ఆఫ్గాన్ కు ఈ టోర్నీలో తొలి విజయాన్ని సాధించింది. బౌలింగ్ లో ఒక వికెట్ తీసి, అర్ధ సెంచరీ చేసిన ఒమర్జాయ్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.