Kuldeep ODI Record: కమ్‌బ్యాక్‌లో అత్యద్భుత ప్రదర్శనలతో రెచ్చిపోతున్న టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఆసియా కప్‌తో పాటు ప్రపంచకప్ జట్టులోనూ చోటు దక్కించుకున్న కుల్‌దీప్.. పాకిస్తాన్, శ్రీలంకలతో జరిగిన మ్యాచ్‌లలో మెరుగైన ప్రదర్శనలు చేశాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో పిచ్ స్పిన్‌కు పెద్దగా అనుకూలించకపోయినా ఐదువికెట్లతో సత్తా చాటిన అతడు.. తాజాగా లంకతోనూ నాలుగు వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా కుల్‌దీప్ పలు కీలక రికార్డులను బ్రేక్ చేశాడు. అందులో ఒకటి ఆలిండియా సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ పేరు మీదే ఉన్నది కావడం గమనార్హం.
లంకతో మ్యాచ్‌లో పతిరాన వికెట్ తీయడం ద్వారా కుల్‌దీప్ వన్డేలలో 150 వికెట్ల ఘనతను సాధించాడు. తద్వారా అతడు భారత్ తరఫున వన్డేలలో అత్యంత వేగంగా ఈ ఘనతను అందుకున్న రెండో బౌలర్‌గా నిలిచాడు. మొదటి స్థానంలో మహ్మద్ షమీ ఉన్నాడు. భారత్ తరఫున స్పిన్నర్ల పరంగా చూసుకుంటే ఈ ఘనత అందుకున్న తొలి బౌలర్ కుల్దీపే కావడం గమానర్హం. టెస్టులలో 600 వికెట్లు తీసిన అనిల్ కుంబ్లే వంటి దిగ్గజానికి కూడా ఈ ఘనత సాధ్యం కాలేదు. ఆ రికార్డుల జాబితాను ఇక్కడ చూద్దాం.
భారత్ తరఫున వన్డేలలో వేగంగా 150 వికెట్లు సాధించిన బౌలర్లు.. (టాప్-5)
- మహ్మద్ షమీ : 80 మ్యాచ్‌లలో 150 వికెట్లు
- కుల్‌దీప్ యాదవ్ : 88
- అజిత్ అగార్కర్ : 97
- జహీర్ ఖాన్ : 103
- అనిల్ కుంబ్లే : 106
అంతర్జాతీయ స్థాయిలో ఈ ఘనత అందుకున్న స్పిన్నర్లు..
- సక్లయిన్ ముస్తాక్ : 78 మ్యాచ్‌లలో 150 వికెట్లు
- రషీద్ ఖాన్ : 80
- అజంతా మెండిస్ : 84
- కుల్‌దీప్ యాదవ్ - 88
- ఇమ్రాన్ తాహిర్ - 89
జడేజాకూ ఓ రికార్డు..
కుల్‌దీప్‌తో పాటు రవీంద్ర జడేజా కూడా ఈ మ్యాచ్‌లో ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. లంకతో మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన జడ్డూ.. ఆసియా కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఇర్ఫాన్ పఠాన్‌ను అధిగమించాడు.
ఆసియా కప్ (వన్డేలు)లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు :
- రవీంద్ర జడేజా : 23 వికెట్లు
- ఇర్ఫాన్ పఠాన్ : 22
- సచిన్ టెండూల్కర్ : 17
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial