Asia Cup 2023: ఆసియా కప్‌లో భాగంగా మంగళవారం  రాత్రి ముగిసిన  ఉత్కంఠ పోరులో  రెండు పరుగల తేడాతో ఓడిన అఫ్గానిస్తాన్ ఓటమిపై  ఆ జట్టు  హెడ్‌కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  ఈ మ్యాచ్‌లో  నెట్ రన్ రేట్, గెలుపు సమీకరణాలు తమకు చెప్పలేదని  అన్నాడు.  ఒకవేళ ఆ  సమీకరణాలు తెలిసిఉంటే కచ్చితంగా ఫలితం మరో విధంగా ఉండేదని   తెలిపాడు. 


సమీకరణాలు ఇవి..


నిన్నటి మ్యాచ్‌లో  శ్రీలంక నిర్దేశించిన 292 పరుగుల లక్ష్యాన్ని  ఛేదించే క్రమంలో అఫ్గానిస్తాన్ ధాటిగా ఆడి 37 ఓవర్లు ముగిసేసరికి  289-8తో నిలిచింది. ఈ మ్యాచ్‌లో లక్ష్యాన్ని  37.1 ఓవర్లలో ఛేదించాలి.  38వ ఓవర్లో  తొలి బంతికి  3 పరుగులు చేసి ఉంటే  అఫ్గాన్ జట్టు సూపర్ - 4కు చేరే దిశగా ముందంజవేసేది.   అయితే రన్ రేట్ సమీకరణాల దృష్ట్యా  38వ ఓవర్లో నాలుగో బంతి లోపు అఫ్గానిస్తాన్  295 పరుగులు చేస్తే ఆ జట్టు  సూపర్ - 4కు అర్హత సాధించేది.  కానీ ఈ విషయం   అప్పటికీ క్రీజులో ఉన్న  అఫ్గాన్ బ్యాటర్లతో పాటు  డగౌట్‌లో ఉన్న ఆ జట్టు ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బందికి కూడా తెలియదట.. అంపైర్లు, మ్యాచ్ నిర్వాహకులు  కూడా తమకు ఈ విషయాన్ని చెప్పలేదని  అఫ్గాన్ హెడ్ కోచ్ జొనాథన్ ట్రాట్ వాపోయాడు. 


మ్యాచ్ ముగిశాక ట్రాట్ మాట్లాడుతూ.. ‘మ్యాచ్‌కు ముందు  మాకు లంక నిర్దేశించిన లక్ష్యాన్ని 37.1 ఓవర్లలో ఛేదించాలని  చెప్పారు. కానీ మేం  295 పరుగులు చేయాలని, చేస్తే సూపర్-4కు అర్హత సాధించే అవకాశం ఉందని ఎవరూ చెప్పలేదు..’ అని అన్నాడు.  ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ ఓటమికి  ప్రత్యేకమైన కారణం ఏదైనా ఒక్కటి చెప్పగలరా..? అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘అలా ఒక్కటి చెప్పడం చాలా కష్టం.  కానీ మేం బంగ్లాదేశ్‌తో  ఆడిన మ్యాచ్‌లో మరింత మెరుగ్గా రాణించి ఉంటే  బాగుండేది.  ఆ మ్యాచ్‌లో మేం కొన్ని తప్పులు చేశాం. బంగ్లాను కాస్త తక్కువ స్కోరుకు పరిమితం చేసి ఉంటే సమీకరణాలు మరో విధంగా ఉండేవి..’అని చెప్పాడు. 


 






ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 291 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ (92) తృటిలో సెంచరీ కోల్పోయాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన అఫ్గాన్.. ధాటిగా ఆడింది. ఓపెనర్లు విఫలమైనా గుల్బాదిన్ (22) రెహ్మత్ షా (40), కెప్టెన్ హష్మతుల్లా షాహిది (59), మహ్మద్ నబీ (32 బంతుల్లో 65, 6 ఫోర్లు, 5 సిక్సర్లు) ధాటిగా ఆడారు. చివర్లో కరీమ్ జనత్ (13 బంతుల్లో 22), నజీబుల్లా జద్రాన్ (15 బంతుల్లో 23) కూడా దానిని కొనసాగించారు. 


37 ఓవర్లు ముగిసేసరికి 289-8గా ఉన్న అఫ్గాన్‌కు  రషీద్ ఖాన్ (27 నాటౌట్) క్రీజులో ఉండటంతో లక్ష్యాన్ని సాధించడం పెద్ద కష్టమేం కాదని భావించింది.   అయితే  38వ ఓవర్ వేసిన ధనంజయ.. తొలి బంతికి  ముజీబ్ ఉర్ రెహ్మాన్‌ను ఔట్ చేశాడు.  దీంతో అఫ్గాన్ గుండె పగిలింది.  ముందుగా చెప్పినదాని ప్రకారం 37.1  ఓవర్ల లోపే లక్ష్యం సాధించాలని అఫ్గాన్‌కు చెప్పడంతో ఆ జట్టు ఆటగాళ్లు కూడా ఇక మ్యాచో పోయిందని నిరాశలోకి వెళ్లారు. కానీ అదే సమయానికి ఆ జట్టు  3 బంతుల్లో ఆరు పరుగులు చేస్తే సూపర్- 4 కు క్వాలిఫై అయ్యేదే.   అప్పుడు క్రీజులోకి వచ్చిన ఫజల్ ఫరూఖీ  కూడా మ్యాచ్ పోయిందేమో అనుకుని రెండు బంతులను వృథా చేశాడు. నాలుగో బంతికి  ఎల్బీగా వెనుదిరిగాడు. డగౌట్‌కు వెళ్లేదాకా  అఫ్గాన్ బ్యాటర్లకు ఈ విషయమే తెలియకపోవడం, తర్వాత  చావు కబురు చల్లగా చెప్పినట్టు చెప్పడంతో అఫ్గాన్ అభిమానుల గుండె మరోసారి పగిలింది. 

































ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial