KL Rahul On Virat Kohli Form: తమపై బయటి వ్యక్తుల మాటలు ఏమాత్రం ప్రభావం చూపవని భారత వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. బయటివారు చేసే వ్యాఖ్యలను తాము పట్టించుకోమని చెప్పాడు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ వంటి ఆటగాడిని అలాంటి వ్యాఖ్యలు ఏం చేయలేవని అభిప్రాయపడ్డాడు. 


విరాట్ ఇటీవలి ఫామ్ పై అనేకమంది చర్చించడంపై రాహుల్ పై విధంగా స్పందించాడు. తను చేసే పరుగులు కొంచెం తగ్గిన విషయం తెలిసిందేనని.. అయితే దానిపై అతను కష్టపడుతున్నాడని రాహుల్ అన్నాడు. తాను గాయంతో జట్టుకు దూరమైనప్పుడు తన ఆట గమనించానని.. కోహ్లీ ఫాంలో లేడన్నట్లు తనుకు అనిపించలేదన్నాడు. విరాట్ నెలకొల్పిన ప్రమాణాలు అత్యుత్తమంగా ఉన్నాయని.. బహుశా ఇప్పుడు అవి అందుకోకపోవడం వల్లే ఫాంలో లేడని అందరూ అనుకుంటున్నారని చెప్పాడు. అయితే కోహ్లీ ఇప్పుడు దేశం కోసం మ్యాచ్ లు గెలవాలనే కసితో ఉన్నాడని రాహుల్ అన్నాడు. 



ఇప్పటికే పలువురు టీమిండియా ఆటగాళ్లు కోహ్లీకి మద్దతుగా నిలిచారు. ఫామ్ తాత్కాలికం, క్లాస్ శాశ్వతమని పేర్కొన్నారు. విరాట్ లాంటి ఆటగాడు త్వరలోనే ఫాం అందుకుంటాడని ఆశాభావం వ్యక్తంచేశారు. 


ఇదిలా ఉంటే.. నేటి నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్ లో భాగంగా.. ఆగస్టు 28న భారత్, పాక్ తలపడనున్నాయి. దీనికోసం టీమిండియా ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. నెట్స్ లో తీవ్రంగా చెమటోడుస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ నెట్టింట్లో పంచుకుంది. బీసీసీఐ విడుదల చేసిన వీడియాలో రిషభ్ పంత్, రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వారిద్దరూ దూకుడుగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. పదేపదే ముందుకొచ్చి బాల్ ను కొడుతున్న దృశ్యాలు అందులో చూడవచ్చు. వీరితో పాటు హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ ల బ్యాటింగ్ ను చూడవచ్చు. ఇంకా బౌలర్లు భువనేశ్వర్ కుమార్, చాహల్, అవేశ్ ఖాన్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ చేస్తున్న వీడియాలను బీసీసీఐ ట్విట్టర్లో పంచుకుంది. 


ఆసియా కప్ లో తన తొలి మ్యాచ్ లో గెలిచి టోర్నమెంట్ లో శుభారంభం చేయాలని భారత్ చూస్తోంది. అలాగే   2021 టీ20 ప్రపంచకప్ మ్యాచ్ లో పాక్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది. దీనికోసమే నెట్స్ లో మన ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది.