Ashwin Test Record:  టీమిండియా సీనియర్ స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. టెస్టుల్లో 450 వికెట్లను సాధించాడు. తద్వారా తద్వారా భారత క్రికెటర్లలో అనిల్ కుంబ్లే తర్వాత ఈ మార్కు చేరుకున్న రెండో ఆటగాడిగా నిలిచాడు.


బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్- ఆస్ట్రేలియా తొలి టెస్టులో ఆసీస్ బ్యాటర్ అలెక్స్ క్యారీని ఔట్ చేయడం ద్వారా అశ్విన్ టెస్టుల్లో 450వ వికెట్ ను సాధించాడు. 167 ఇన్నింగ్సుల్లో అశ్విన్ ఈ మైలురాయిని అందుకున్నాడు. భారత లెజెంట్ అనిల్ కుంబ్లే 165 ఇన్నింగ్సుల్లో ఈ మార్కును చేరుకున్నాడు. ఇప్పుడు 450 వ వికెట్ సాధించడం ద్వారా అశ్విన్ కుంబ్లే తర్వాతి స్థానాన్ని చేరుకున్నాడు. 


తిప్పేసిన జడేజా, అశ్విన్


నాగ్‌పుర్‌ టెస్టులో టీమ్‌ఇండియా దుమ్మురేపింది! పర్యాటక ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించింది. తొలి ఇన్నింగ్సులో ప్రత్యర్థిని 177 పరుగులకే ఆలౌట్‌ చేసింది. ఇందుకోసం కేవలం 63.5 ఓవర్లే తీసుకుంది. భారత స్పిన్‌ ద్వయం రవీంద్ర జడేజా (5/47), రవిచంద్రన్‌ అశ్విన్‌ (3/42) దెబ్బకు కంగారూలు వణికిపోయారు. టర్నయ్యే బంతుల్ని ఆడలేక బ్యాట్లెత్తేశారు. మార్నస్‌ లబుషేన్‌ (49; 12౩ బంతుల్లో 8x4), స్టీవ్‌స్మిత్‌ (37; 107 బంతుల్లో 7x4) టాప్‌ స్కోరర్లు. మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ లో తలా ఒక వికెట్ సాధించారు. 


ఆదిలోనే షాక్


టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే భీకర ఫాంలో ఉన్న ఉస్మాన్ ఖవాజా (3 బంతుల్లో 1) ను సిరాజ్ ఎల్బీడబ్ల్యూగా వెనక్కు పంపాడు. ఆ తర్వాతి ఓవర్లోనే మహమ్మద్ షమీ డేవిడ్ వార్నర్ (5 బంతుల్లో 1) ను బౌల్డ్ చేశాడు. దీంతో 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే సూపర్ ఫాంలో ఉన్న మార్నస్ లబూషేన్, స్టీవెన్ స్మిత్ లు ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును నడిపించారు. వీరిద్దరూ లంచ్ సమయానికి మూడో వికెట్ కు అజేయంగా 74 పరుగులు జోడించారు. 


జడ్డూ.. రాక్‌స్టార్‌!


భోజన విరామం తర్వాతే అసలు కథ మొదలైంది. జట్టు స్కోరు 84 వద్ద జడ్డూ బౌలింగ్‌లో లబుషేన్‌ స్టంపౌట్‌ అయ్యాడు. అరంగేట్రం ఆటగాడు, ఆంధ్రా కీపర్‌ కేఎస్‌ భరత్‌ అతడిని ఔట్‌ చేశాడు. అదే స్కోరు వద్ద స్మిత్‌నూ జడ్డూనే ఔట్‌ చేశాడు. మ్యాట్‌ రెన్షా (0)ను డకౌట్‌ అయ్యాడు. కష్టాల్లో పడ్డ ఆసీస్‌ను పీటర్ హ్యాండ్స్‌కాంబ్‌ (31; 84 బంతుల్లో 4x4), అలెక్స్‌ కేరీ (36; 33 బంతుల్లో 7x4) ఆదుకొన్నారు. ఆరో వికెట్‌కు 68 బంతుల్లో 53 పరుగుల భాగస్వామ్యం అందించారు. కీలకంగా మారిన ఈ జోడీని కేరీని ఔట్‌ చేయడం ద్వారా యాష్ విడదీశాడు. అప్పటికి స్కోరు 162. మరో పది పరుగులకే హ్యాండ్స్‌కాంబ్‌ను జడ్డూ పెవిలియన్‌ చేర్చాడు. ఆ తర్వాత కంగారూలు ఔటవ్వడానికి ఎంతో సమయం పట్టలేదు.