Ashes Series 2023: ఇటీవలే ఇంగ్లాండ్  - ఆస్ట్రేలియా మధ్య ముగిసిన యాషెస్ సిరీస్‌లో మందకొడిగా బౌలింగ్ చేసినందుకు గాను  అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ).. ఇరు జట్లకూ భారీ షాకిచ్చింది. స్లో ఓవర్ రేట్‌కు గాను  మ్యాచ్ ఫీజులో కోతతో పాటు పాయింట్లలో కూడా కోత విధించింది.  ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 - 25  సైకిల్‌లో అత్యంత కీలకమైన పాయింట్లు కోల్పోవడంతో ఇరు జట్లకూ భారీ షాక్ తగిలినట్టైంది.  


స్లో ఓవర్ రేట్‌కు గాను  బెన్ స్టోక్స్ నాయకత్వంలోని ఇంగ్లాండ్‌కు  19 పాయింట్లు కోతపడ్డాయి. పాట్ కమిన్స్ సారథ్యంలోని ఆస్ట్రేలియాకూ 10 పాయింట్లు కోత విధిస్తూ ఐసీసీ తాజాగా ఓ ప్రకటన వెలువరించింది. సవరించిన నిబంధనల ప్రకారం  తక్కువైన ప్రతి ఓవర్‌కూ ఒక పాయింట్, ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో  ఐదు శాతాన్ని జరిమానా విధించినట్టు  ఐసీసీ వెల్లడించింది. 


ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా   ఇంగ్లాండ్ నాలుగు టెస్టులలో   స్లో గా బౌలింగ్ చేసింది. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో రెండు ఓవర్లు,  లార్డ్స్ టెస్టులో 9 ఓవర్లు, మాంచెస్టర్‌ వేదికగా ముగిసిన నాలుగో టెస్టులో మూడు ఓవర్లు, ది  ఓవల్‌లో  జరిగిన ఐదో టెస్టులో ఐదు ఓవర్లు   మందకొడిగా బౌలింగ్ చేసింది. దీని ప్రకారం ఇంగ్లాండ్‌కు తొలి టెస్టులో 2, రెండో టెస్టులో 9, నాలుగో టెస్టులో  మూడు, ఐదో టెస్టులో 5 పాయింట్లు కోత పడింది. నిర్దేశించిన సమయం కంటే  ఎక్కువ సమయం  బౌలింగ్ చేసినందుకు గాను ఇంగ్లాండ్‌కు డబ్ల్యూటీసీ  పాయింట్లలో 19 పాయింట్లు కోతపడ్డాయి.  


గత నెల డర్బన్ (దక్షిణాఫ్రికా) వేదికగా ముగిసిన  వార్షిక సమావేశంలో ఐసీసీ.. స్లో ఓవర్ రేట్‌పై కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని నిర్ణయించిన విషయం తెలిసిందే.  నిర్ణీత సమయంలో  ఓవర్ల కోటాను పూర్తి చేయకుంటే  డబ్ల్యూటీసీ  పాయింట్లలో కోత ఉంటుందని గతంలోనే వెల్లడించింది. తాజాగా దానిని యాషెస్‌లో అమలుపరిచింది. టెస్టులలో ఒక రోజు 90 ఓవర్లు వేయాల్సి ఉంది.


 






ఇక ఆస్ట్రేలియా విషయానికొస్తే..  మాంచెస్టర్ వేదికగా జరిగిన  నాలుగో టెస్టులో కంగారూలు ఏకంగా పది ఓవర్లను  నిర్ణీత సమయంలో పూర్తి చేయలేదు. దీంతో  ఆ జట్టు 10 పాయింట్లను కోల్పోవాల్సి వచ్చింది.  


డబ్ల్యూటీసీ నిబంధనల ప్రకారం ఒక జట్టు టెస్టును గెలుచుకుంటే  12 పాయింట్లు దక్కుతాయి. డ్రా చేసుకుంటే నాలుగు పాయింట్లు వస్తాయి. ఓడితే మాత్రం ఒక్క పాయింట్ కూడా రాదు. ఇక తాజాగా ఐసీసీ విడుదల చేసిన  డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో  పాకిస్తాన్ 24 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. 16 పాయింట్లు సాధించిన భారత్ రెండో స్థానంలో ఉంది.  ఆస్ట్రేలియా, వెస్టిండీస్, ఇంగ్లాండ్‌లు తదుపరి స్థానాల్లో నిలిచాయి. 


















ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial