Ashes 2023 : యాషెస్ టెస్టు సిరీస్‌లో భాగంగా    మాంచెస్టర్ (ఓల్డ్ ట్రాఫర్డ్)  వేదికగా ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో  ఆతిథ్య ఇంగ్లీష్ జట్టు  దూసుకుపోతోంది.  తమదైన ‘బజ్‌బాల్’ ఆటతో ఈ టెస్టును శాసించేదిశగా  సాగుతోంది. ఇంగ్లాండ్ ఓపెనర్ జాక్ క్రాలీ (182 బంతుల్లో 183,  21 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడుకు తోడు  జో రూట్ (95 బంతుల్లో 84, 8 ఫోర్లు, 1 సిక్సర్), మోయిన్ అలీ  (82 బంతుల్లో 54, 7 ఫోర్లు)లు రాణించడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్.. 4 వికెట్ల నష్టానికి  384 పరుగులు చేసింది.  


క్రాలీ.. కనికరమే లేకుండా..!


రెండో రోజు  ఓవర్ నైట్ స్కోరు  299 పరుగుల వద్ద  రెండో రోజు ఆట ఆరంభించిన   ఆస్ట్రేలియాకు  జేమ్స్ ఆండర్సన్ షాకిచ్చాడు. కమిన్స్‌ను ఔట్ చేశాడు. కొద్దిసేపటికే జోష్ హెజిల్‌వుడ్ (4) కూడా నిష్క్రమించడంతో ఆసీస్ ఇన్నింగ్స్ 317 పరుగుల వద్ద ముగిసింది.  ఫస్ట్ సెషన్‌లోనే బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లాండ్.. బెన్ డకెట్ (1) వికెట్ కోల్పోయినా  వెరవలేదు. ఆస్ట్రేలియా బ్యాటర్లు పరుగులు చేయడానికి ఇబ్బందులు పడ్డ చోట ఇంగ్లాండ్ అలవోకగా  రన్స్ సాధించింది.   మోయిన్ అలీ‌తో కలిసి ఓపెనర్ జాక్ క్రాలీ.. ఆసీస్ బౌలర్లను ఆటాడుకున్నాడు.  67 బంతుల్లో అర్థ సెంచరీ  పూర్తిచేసుకున్న  అతడు.. తర్వాత 50 పరుగులు  సాధించడానికి 26 బంతులనే తీసుకున్నాడు. తన టెస్టు కెరీర్‌లో క్రాలీకి ఇది నాలుగో సెంచరీ. యాషెస్‌లో వేగవంతమైన నాలుగో సెంచరీ కావడం విశేషం. 


సెంచరీ తర్వాత క్రాలీ మరింత రెచ్చిపోయాడు. వన్డే తరహా ఆట ఆడుతూ ఇంగ్లాండ్ స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. అలీ ఔట్ అయినా  జో రూట్ సాయంతో  రెచ్చిపోయాడు. అలీతో  రెండో వికెట్‌కు 121 పరుగులు జోడించిన క్రాలీ..   రూట్‌తో కలిసి మూడో వికెట్‌కు  ఏకంగా 206 పరుగులు జతచేశాడు.    రూట్ - క్రాలీ  ఎక్కడా తగ్గకపోవడంతో ఒకదశలో ఇంగ్లాండ్ స్కోరుబోర్డు.. ఓవర్‌కు ఐదు పరుగులతో దూసుకెళ్లింది.


 






డబుల్ సెంచరీ మిస్ 


కంగారు బౌలర్లను కంగారెత్తిస్తూ  ఆడిన క్రాలీ.. ఎట్టకేలకు  కామెరూన్ గ్రీన్ వేసిన  57వ ఓవర్లో ఔటయ్యాడు. ఆ ఓవర్లో   ఐదో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 11 పరుగుల దూరంలో డబుల్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. క్రాలే నిష్క్రమించిన కొద్దిసేపటికి   రూట్‌ను హెజిల్‌వుడ్ బౌల్డ్ చేశాడు.   అయితే చివర్లో హ్యారీ బ్రూక్ (14 నాటౌట్),  కెప్టెన్ బెన్ స్టోక్స్ (24 నాటౌట్) క్రీజులో ఉన్నారు.  ఈ ఇద్దరితో పాటు జానీ బెయిర్ స్టో, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్‌లు క్రీజులో ఉండటంతో ఇంగ్లాండ్ భారీ  స్కోరుపై కన్నేసింది. ఇప్పటికే తొలి ఇన్నింగ్స్‌లో 67 పరుగుల ఆధిక్యం దక్కించుకున్న ఇంగ్లాండ్.. నేడు  మరింత దూకుడుగా ఆడే అవకాశం ఉంది. 


కాగా క్రమంగా ఈ టెస్టులో  ఆస్ట్రేలియా పట్టు కోల్పోతుంది. తొలి ఇన్నింగ్స్‌లో  ఇంగ్లాండ్‌ను త్వరగా  ఆలౌట్ చేసి రెండో ఇన్నింగ్స్‌లో తమ బ్యాటర్లు ఆదుకుంటే తప్ప  ఈ టెస్టులో కూడా కంగారూలకు కష్టాలు తప్పేలా లేవు. 


















ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial