Ashes 2023: బెన్ స్టోక్స్ సారథ్యంలోని ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు.. లీడ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో ముగిసిన యాషెస్ సిరీస్ మూడో టెస్టును గెలుచుకుని సిరీస్‌ విజయావకాశాలను సజీవంగా ఉంచుకుంది.  ఈ మ్యాచ్‌కు ముందు లార్డ్స్‌లో ముగిసిన రెండో టెస్టులో ఇంగ్లాండ్ ఓడిన తర్వాత  ఆస్ట్రేలియా మీడియా.. బెన్ స్టోక్స్‌తో పాటు ఇంగ్లాండ్ క్రికెట్‌ను టార్గెట్ చేస్తూ రాసిన కథనాలకు గాను తాజాగా ఇంగ్లీష్ ఫ్యాన్స్..  కంగారూలకు, ఆ దేశ మీడియాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్  ఏడుస్తున్న ఫోటో మాస్కులను పెట్టుకుని  ఆస్ట్రేలియాను టీజ్ చేశారు. 


లీడ్స్‌లో ఆట నాలుగో రోజు ఇంగ్లాండ్ తడబడ్డా హ్యారీ బ్రూక్ (93 బంతుల్లో 75, 9 ఫోర్లు ) వీరోచిత ఇన్నింగ్స్‌కు తోడు ఆఖర్లో క్రిస్ వోక్స్  (47 బంతుల్లో 32 నాటౌట్, 4 ఫోర్లు), మార్క్ వుడ్ (8 బంతుల్లో 16 నాటౌట్, 1 ఫోర్, 1 సిక్స్) లు పొరాడి.. ఆతిథ్య జట్టుకు తొలి విజయం అందించిన విషయం తెలిసిందే.   మిచెల్ స్టార్క్ వేసిన 50వ ఓవర్‌లో క్రిస్ వోక్స్.. పాయింట్ దిశగా  బౌండరీ కొట్టిన తర్వాత ఇంగ్లాండ్ అభిమానులు పెద్దఎత్తున  నినాదాలు చేశారు.  






ఈ క్రమంలోనే  పలువురు ఇంగ్లాండ్ ఫ్యాన్స్..  ఆసీస్  మాజీ సారథి స్మిత్  2018లో  బాల్ టాంపరింగ్ వివాదం జరిగినప్పుడు మీడియా ముందు స్మిత్ కంటతడి పెట్టినప్పటి ఫోటోల ఫేస్ మాస్కులను ధరించి  టీజ్ చేశారు. స్టాండ్స్‌లో ఇంగ్లీష్ ఫ్యాన్స్.. ‘క్రైయింగ్ స్మిత్.. క్రైయింగ్ స్మిత్’ అని అరిచారు. ఇది  పక్కా  ఉద్దేశపూర్వకంగా చేసిందేనని ప్రత్యేకించి చెప్పాల్సిన పన్లేదు. 


 






లార్డ్స్ టెస్టులో ఇంగ్లాండ్ ఓడిన తర్వాత.. జానీ బెయిర్ స్టో వివాదాస్పద రనౌట్‌పై  ఆ జట్టు సారథి బెన్ స్టోక్స్‌తో పాటు మాజీ క్రికెటర్లు ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని  కామెంట్స్ చేశారు.  దీనిపై ‘ద వెస్ట్ ఆస్ట్రేలియన్’ అనే పత్రిక.. ఓ పసిబాలుడు నోటిలో పాలపీక  పట్టుకుని తన ముందు ఒకవైపుగా యాషెస్ ను  కిందపడేసి మరోవైపు  బాల్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించిన ఫోటోను ప్రచురించింది. ఆ పాల పీకను నోట్లో పెట్టుకున్న ముఖాన్ని  బెన్ స్టోక్స్‌గా మార్ఫింగ్ చేసింది. ఈ ఫోటోకు  ‘క్రై బేబీస్’ అని  ఓ వ్యంగ్యాస్త్రాన్ని సంధించింది. నిబంధనల ప్రకారమే ఆసీస్ ఆడినా ఇంగ్లాండ్ మాత్రం చీటింగ్‌ను కొత్త లెవల్ కు తీసుకొస్తున్నారని అందులో రాసుకొచ్చింది.   ఇది  కూడా వివాదాస్పదమైంది. తాజాగా ఇంగ్లాండ్ ఫ్యాన్స్ దానికి కౌంటర్‌గానే.. స్మిత్ ఏడుస్తున్న (క్రైయింగ్ స్మిత్) ఫేస్ మాస్కులను  పెట్టుకోవడం గమనార్హం.


 






ఇక లీడ్స్ టెస్టు విషయానికొస్తే.. 251 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా నాలుగో రోజు ఓవర్ నైట్ స్కోరు  27-0తో  బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లాండ్‌‌కు  ఆసీస్ వెటరన్ పేసర్ మిచెల్ స్టార్క్  షాకిచ్చాడు. స్టార్క్ ఐదు వికెట్లు తీసినా హ్యారీ బ్రూక్, వోక్స్‌లు వీరోచితంగా పోరాడి  ఇంగ్లాండ్‌కు  సూపర్ డూపర్ విక్టరీని అందించారు.


















Join Us on Telegram: https://t.me/abpdesamofficial