Ashes Series 2023: ‘బజ్‌బాల్’ అబాసుపాలైంది. దూకుడు మంత్రం ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో ఇంగ్లాండ్‌ను నిండాముంచింది. తొందరపాటు నిర్ణయానికి బెన్ స్టోక్స్ సేన భారీ మూల్యం చెల్లించుకుంది. ‘ఏ జట్టు అయినా మాకు ఎదురేలేదు’ అన్న తలబిరుసుతో ఆడిన ఆ జట్టుకు కంగారూలు కౌంటర్ ఇచ్చారు. సర్వ రోగాలకు నివారిణిగా జిందా తిలస్మాత్‌నే వాడతాం అన్న చందంగా ‘ఏ జట్టు అయినా వ్యూహం మార్చం.. దూకుడుగానే ఉంటాం’ అన్నట్టుగా వ్యవహరిస్తే షాకులు తప్పవని ఏడాదికాలానికి బోధపడింది.
ఓటమికి పునాధి అక్కడే..
ఇంగ్లాండ్ ఓటమికి పునాధి పడింది తొలి రోజే అని చెప్పడంలో సందేహమే లేదు. తొలి రోజు దూకుడుగా ఆడిన ఇంగ్లాండ్.. 78 ఓవర్లు మాత్రమే ఆడి 393 పరుగులు చేసింది. అప్పటికీ సెంచరీ చేసిన జో రూట్ (118 నాటౌట్) క్రీజులోనే ఉన్నా మరో రెండు వికెట్లు చేతిలో ఉన్నా స్టోక్స్ మాత్రం ఇన్నింగ్స్ డిక్లేర్ ఇచ్చాడు. ఆరోజు అందరూ దీనిని ‘బోల్డ్ డిసీషన్’ అన్నారు. కానీ రెండో రోజుకే ఇంగ్లాండ్‌కు తామెంత తప్పు చేశామో తెలిసొచ్చింది. తొలి రోజు ఆసీస్‌ను రెండు వికెట్లు తీసి ఒత్తిడిలోకి నెట్టి రెండో రోజు కూడా ఓ ఆట ఆడుకుందామనేది స్టోక్స్ వ్యూహం. కానీ అది బెడిసికొట్టింది. ఉస్మాన్ ఖవాజా (141) అద్భుతమైన సెంచరీకి తోడు అలెక్స్ కేరీ (66), ట్రావిస్ హెడ్ (50), కమిన్స్ (38) లు రాణించి ఇంగ్లాండ్ ఆశలపై నీళ్లు చల్లారు. మూడో రోజు లంచ్ వరకూ ఆసీస్ బ్యాటింగ్ సాగింది.
రెండో ఇన్నింగ్స్‌లో కూడా..
తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను తమకంటే తక్కువ స్కోరు (386) కే ఆలౌట్ చేసినా ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో ఆట తీరు మార్చుకోలేదు. త్వరగా ఆడి భారీ స్కోరు చేసి కంగారూల ఎదుట భారీ లక్ష్యాన్ని నిలిపాలన్నది స్టోక్స్ సేన ప్లాన్. ఇది కూడా విఫలమైంది. ఫాస్ట్‌గా ఆడే క్రమంలో ఇంగ్లాండ్ బ్యాటర్లు 35, 40 పరుగులు చేశారుగానీ ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ సాధించలేకపోయారు. వన్డే తరహాలో ఆడి త్వరగా పెవిలియన్‌కు చేరారు. జో రూట్ (46) టాప్ స్కోరర్. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 273 పరుగులకే ఆలౌట్ అయింది. ఒక మెరుగైన భాగస్వామ్యం నమోదై ఉంటే ఆసీస్ ముందు లక్ష్యం పెరిగేది. కానీ దూకుడుగా ఆడే క్రమంలో ఇంగ్లాండ్ బ్యాటర్లు దెబ్బతిన్నారు.
విజయానికి దగ్గరగా వచ్చి..
ఆసీస్ ముందు 280 పరుగుల లక్ష్యాన్ని నిలిపన ఇంగ్లాండ్.. విజయం కోసం బాగానే శ్రమించింది. వాస్తవానికి ఎడ్జ్‌బాస్టన్ పిచ్.. బ్యాటింగ్‌కు స్వర్గధామం. టెస్టులలో ఇది 4,5 వ రోజుకు పూర్తి బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉంటుంది. కానీ ఐదో రోజు ఉదయం సెషన్ లో వర్షం కురవడం ఇంగ్లాండ్‌కు కలిసొచ్చింది. ఆసీస్ తరఫున తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ హీరో ఉస్మాన్ ఖవాజా (65) నిలబడ్డా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. 227-8 గా ఉన్న కంగారూల తోకను కట్ చేయడానికి ఇంగ్లాండ్ బౌలర్లు చెమటోడ్చాల్సి వచ్చింది. పాట్ కమిన్స్ (73 బంతుల్లో 44, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), నాథన్ లియాన్ (28 బంతుల్లో16 నాటౌట్, 2 ఫోర్లు) లు వికెట్ల ముందు పాతుకుపోయారు. ఈ ఇద్దరూ ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కుని ఆసీస్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు.
ఇంగ్లాండ్‌కు టెస్టులలో హెడ్‌కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ కలిసి ఈ టెస్టుకు ముందు 13 టెస్టులలో ఏకంగా పది గెలిచి రికార్డులు తిరగరాశారు. ఎడ్జ్‌బాస్టన్ లో కూడా ఆసీస్ కు చుక్కలు తప్పవని అంతా అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. తొందరపాటు నిర్ణయం వల్ల బజ్‌బాల్ అబాసుపాలైంది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial