MS Dhoni Trending: ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో  రనౌట్ వివాదం తర్వాత  టీమిండియా మాజీ సారథి  మహేంద్ర సింగ్ ధోని  ట్విటర్ లో ట్రెండింగ్ లోకి వచ్చాడు. అసలు బెయిర్ స్టో ఔట్ కు ధోనికి సంబంధమేంటి..?  ఎక్కడో లార్డ్స్ లో టెస్టు జరిగితే మహీకి ఏంటి సంబంధం..? క్రీడా స్ఫూర్తి గురించి  చర్చలు చేస్తున్న ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా  క్రికెట్ జట్ల మాజీలు,  అభిమానులు ధోని నుంచి నేర్చుకోవాల్సినంత ధోని ట్రెండింగ్ వీడియోలో ఏముంది..? 


ఇది కదా క్రీడా స్ఫూర్తి అంటే.. 


బెయిర్ స్టో  రనౌట్ తర్వాత  ధోని ట్రెండింగ్ లోకి రావడానికి కారణముంది.  12 ఏండ్ల క్రితం భారత జట్టు ఇదే ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లింది. 2011లో  ఇండియా - ఇంగ్లాండ్ మధ్య  నాటింగ్హమ్ వేదికగా  మ్యాచ్ జరిగింది.  టీమిండియా కెప్టెన్ ధోని.. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో  ఇంగ్లాండ్ మాజీ స్టార్ బ్యాటర్ ఇయాన్ బెల్ సెంచరీ చేశాడు. అతడు 137 పరుగుల వద్ద ఉండగా..   ఇషాంత్ శర్మ వేసిన ఓ ఓవర్లో బంతిని బౌండరీ దిశగా పంపించాడు. అభినవ్ ముకుంద్  బంతిని ఆపే క్రమంలో  బౌండరీ లైన్ ముందుకు డైవ్ చేశాడు. 


 






అయితే అప్పటికే బంతి బౌండరీ లైన్ ను తాకి ఉండొచ్చన్న అభిప్రాయంతో  బెల్.. క్రీజును వదిలి  మరో ఎండ్ లో ఉన్న ఇయాన్ మోర్గాన్ తో ఛాట్ చేసేందుకు వెళ్లాడు. ముకుంద్ కూడా బంతి బౌండరీ రోప్ టచ్ అయిందనుకుని భ్రమించి  తాపీగా లేచి బాల్ ను ధోని వైపుగా విసిరాడు. అప్పటికే  క్రీజు దాటిన బెల్ ను గమనించిన ధోని వికెట్లను పడగొట్టి అప్పీల్ కూడా చేశాడు.  థర్డ్ అంపైర్   టీవీ రిప్లేలో బంతి బౌండరీ రోప్  కు ఇంచు దూరంలో ఆగిపోయిందని తేలింది. దీంతో బెల్ ను రనౌట్ గా ప్రకటిస్తూ నిర్ణయం వెలువడింది. అప్పటికే లంచ్ టైమ్ కావడంతో  ఇరు జట్ల ఆటగాళ్లు  టీ బ్రేక్ కోసమని  వెళ్లారు. బెల్ కూడా నిరాశగా వెనుదిరగాడు. కానీ బ్రేక్ తర్వాత ధోని తన అప్పీల్ ను వెనక్కి తీసుకున్నాడు.


స్పిరిట్ ఆఫ్ ది డికేట్ అవార్డు.. 


ఇయాన్ బెల్ ను రీకాల్ చేసిన ఘటనతో ధోని క్రీడాస్ఫూర్తికి ప్రశంసలు వెల్లువెత్తాయి.  ఐసీసీ కూడా  ఆ ఏడాది ఐసీసీ స్పిరిట్ ఆఫ్  క్రికెట్ అవార్డు కూడా గెలుచుకున్నాడు.  ధోనిపై అభిమానుల్లో ఈ ఘటన తర్వాత మరింత గౌరవం పెరిగింది. అవార్డులు, ప్రశంసలు దక్కినా ఈ మ్యాచ్ లో భారత జట్టు దారుణంగా ఓడింది. 319 పరుగుల తేడాతో భారత్ భారీ ఓటమిని మూటగట్టుకుంది.   ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 221 పరుగులే చేయగా  భారత్.. 288 రన్స్ చేసింది. ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్.. ఆ మ్యాచ్ లో సెంచరీ (117) చేశాడు.  కానీ రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్..  544 పరుగుల భారీ స్కోరు చేసింది.  477 పరుగుల భారీ లక్ష్యంతో  బరిలోకి దిగిన భారత్.. 158 పరుగులకే ఆలౌట్ అయింది.  సచిన్ టెండూల్కర్ (56) టాప్ స్కోరర్ గా నిలిచాడు.



Join Us on Telegram: https://t.me/abpdesamofficial