రంజీ ట్రోఫీ(Ranji Trophy 2024)లో క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌(Sachin Tendulkar) తనయుడు అర్జున్ టెండూల్కర్(Arjun endulkar)  రాణిస్తున్నాడు. పేస్ ఆల్‌రౌండ‌ర్ అయిన అర్జున్ రంజీ ట్రోఫీలో రాణిస్తూ భవిష్యత్తుపై ఆశలు కల్పిస్తున్నాడు. గోవా త‌రుపున ఆడుతున్న అర్జున్ టెండూల్కర్‌.. చండీఘ‌ర్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో 60 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 70 ప‌రుగులు చేసి రాణించాడు. దీంతో గోవా భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన గోవా మొద‌టి ఇన్నింగ్స్‌లో 160 ఓవ‌ర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 618 ప‌రుగుల వ‌ద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. సుయాశ్ ప్రభు దేశాయ్ (197) తృటిలో డబల్‌ సెంచరీని చేజార్చుకున్నాడు. దీప్‌రాజ్ గోయంక‌ర్ (115 నాటౌట్‌) సెంచ‌రీ బాదాడు. అర్జున్ టెండూల్కర్‌తో పాటు కృష్ణ మూర్తి సిద్ధార్ధ్ (77) అర్ధశ‌త‌కం చేశాడు. ఛండీఘ‌ర్ బౌల‌ర్ల‌లో జ‌గిత్ సింగ్ రెండు వికెట్లు తీశాడు. రాజ్ బ‌వా, అర్పిత్ ప‌ న్ను, అర్స్‌ల‌న్ ఖాన్‌, కునాల్ మ‌హ‌జ‌న్ త‌లా ఓ వికెట్ సాధించారు.

 

భువీ మ్యాజిక్‌

బెంగాల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి రోజు  ఐదు వికెట్లు తీసిన భువీ.. రెండో రోజు మరో ముగ్గురిని ఔట్ చేసి తన ఫస్ట్ క్లాస్ క్రికెట్‌ కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. తొలి మ్యాచ్‌లోనే ఏకంగా ఎనిమిది వికెట్లు కూల్చి సత్తా చాటాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 8/41 (22 ఓవర్లు)తో కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు.

 

దీంతో బెంగాల్‌ తొలి ఇన్నింగ్స్‌లో 188 పరుగులకు ఆలౌటైంది.  తొలి రోజు ఆట ముగిసే సరికే భువీ ఖాతాలో ఐదు వికెట్లు చేరాయి. భువీ 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేయడం ఇది 13వసారి. ఈ క్రమంలో 95/5 ఓవర్‌నైట్‌ స్కోరుతో శనివారం ఆట మొదలుపెట్టిన బెంగాల్‌ 188 పరుగులకు ఆలౌట్‌ అయింది.  తొలిరోజు సౌరవ్‌ పాల్‌, సుదీప్‌ కుమార్‌, అనుస్తుప్‌ మజుందార్‌, కెప్టెన్‌ మనోజ్‌ తివారి, అభిషేక్‌ పోరెల్‌లను అవుట్‌ చేసిన భువీ... రెండో రోజు ఆటలో శ్రేయాన్ష్‌ ఘోష్‌,  ప్రదీప్త ప్రమాణిక్‌, సూరజ్‌ సింధు జైస్వాల్‌లను అవుట్‌ చేశాడు. దీంతో భువీ ఖాతాలోని వికెట్ల సంఖ్య ఎనిమిది చేరింది.

 

అగ్ని చోప్రా అదుర్స్‌

విధు వినోద్‌ చోప్రా కుమారుడు అగ్ని చోప్రా రంజీ ట్రోఫీలో అరంగేట్ర మ్యాచ్‌లోనే అద్భుత శతకం సాధించి తన సత్తా చాటాడు. మిజోరం తరఫున ఆడుతున్న ఈ 25 కుర్రాడు సిక్కింతో జరిగిన తొలి మ్యాచ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో179 బంతుల్లో 19 ఫోర్లు, 7 సిక్స్‌లతో 166 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ 74బంతుల్లో 92 పరుగులు చేసి అబ్బుర పరిచాడు. కానీ ఈ మ్యాచ్‌లో మిజోరం నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ప్రస్తుతం నాగాలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ అగ్ని చోప్రా అదరగొడుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 150 బంతుల్లో 21 ఫోర్లు, 3 సిక్స్‌లతో 164 పరుగులు చేసి  మరోసారి భారీ శతకం సాధించాడు. దీంతో మిజోరం 356 పరుగులకు ఆలౌటైంది.