Arjun Tendulkar-Saaniya Chandhok Wedding: భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఇంట్లో పెళ్లివేడుకలు జరిగాయి. సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహం ఘనంగా జరిగింది. అర్జున్, సానియా చందోక్‌ను వివాహం చేసుకున్నాడు. మార్చి 3న మహాలక్ష్మి రేస్ కోర్స్‌లో ఒక ప్రైవేట్ మెహందీ వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు పలువురు క్రికెటర్లు హాజరయ్యారు.
ఈరోజు ముంబైలో అర్జున్, సానియాల వివాహాం ఇరుకుటుంబాల పెద్దలు, బంధువులు, పలువురు ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనితో సహా పలువురు క్రికెటర్లు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖ అతిథులు కూడా ఈ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
అర్జున్ టెండూల్కర్ వివాహానికి హాజరైన అతిథులు
అర్జున్ వివాహ వేడుకల్లో ఐసీసీ ఛైర్మన్ జైషా, టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుత సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా కనిపించారు. వీరితో పాటు మాజీ భారత ఆటగాడు, మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ తన భార్య విజేత పెంధార్కర్‍తో కలిసి వేడుకకు హాజరయ్యాడు. మాజీ క్రికెటర్లు అజింక్య రహానే, అనిల్ కుంబ్లే, సురేష్ రైనా, వెంకటేష్ ప్రసాద్, ఆకాష్ చోప్రా, టీఎంసీ ఎంపీ యూసుఫ్ పఠాన్ వంటి దిగ్గజాలు ఈ వేడుకలో పాల్గొన్నారు.
రాజకీయ ప్రముఖులకు కూడా ఆహ్వానం
కుమారుడి వివాహానికి సచిన్ టెండూల్కర్ పలువురు రాజకీయ ప్రముఖులను కూడా ఆహ్వానించారు. వీరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, లోక్‌సభలో ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వంటి వారు ఉన్నారు. రాజకీయ, క్రీడా, సినీ, వ్యాపార, ఇతర రంగాలకు చెందిన ప్రముఖుల రాకతో పెళ్లి వేడుకలో సందడి నెలకొంది.
అర్జున్ టెండూల్కర్ భార్య ఎవరు?
అర్జున్ టెండూల్కర్ వివాహం చేసుకున్న అమ్మాయి పేరు సానియా చందోక్. ఆమె అర్జున్‌కు స్నేహితురాలు, చాలా కాలం నుంచి వీరు ప్రేమించుకునంటున్నారుని తెలుస్తోంది. ఆమె ముంబై పారిశ్రామికవేత్త రవి ఘాయ్ మనవరాలు. సానియా చందోక్ ఒక 'పెట్ కేర్' బ్రాండ్‌ను నిర్వహిస్తోంది. అక్కడ జంతువుల స్కిన్ కేర్, గ్రూమింగ్ వంటి సేవలు అందుబాటులో ఉంటాయి.
ఈసారి లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడనున్న అర్జున్
ఐపీఎల్ 2026లో అర్జున్ టెండూల్కర్ లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తరపున ఆడనున్నాడు. అంతకుముందు అర్జున్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ జట్టు తరఫున ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్ వేలంలో లక్నో జట్టు అర్జున్ ను తీసుకుంది. లక్నో జట్టు అర్జున్‌కు ఎన్ని అవకాశాలు ఇస్తుంది, అతడి ప్రదర్శన ఎలా ఉంటుందోనని సచిన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
