ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఆంధ్రా ప్రీమియర్ లీగ్ బుధవారం ప్రారంభం అయింది. మొదటి మ్యాచ్‌లో గోదావరి టైటాన్స్, కోస్టల్ రైడర్స్‌పై రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం అంతరాయం కలిగించడంతో వీజేడీ (వి.జయదేవన్) పద్ధతిలో విజేతను నిర్ణయించారు.


మొదట బ్యాటింగ్ చేసిన గోదావరి టైటాన్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. కేవీ శశికాంత్ (55: 47 బంతుల్లో, ఆరు ఫోర్లు) అర్థ సెంచరీ సాధించాడు. 21 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టైటాన్స్‌ను శశికాంత్, నితీష్ కుమార్ రెడ్డి (25: 32 బంతుల్లో, ఒక ఫోర్) ఆదుకున్నారు. వీరు ఐదో వికెట్‌కు 44 పరుగులు జోడించారు. అయితే అవసరం అయినంత వేగంగా ఆడలేకపోయారు. దీంతో గోదావరి టైటాన్స్ తక్కువ స్కోరుకే పరిమితం అయింది. కోస్టల్ రైడర్స్ బౌలర్లలో చీపురుపల్లి స్టీఫెన్, హరిశంకర్ రెడ్డి, మాదా దీపక్ రెండేసి వికెట్లు తీసుకున్నారు.


అనంతరం కోస్టల్ రైడర్స్ ఏడు ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం రావడంతో వీజేడీ పద్ధతిలో విజేతను నిర్ణయించారు. ఏడు ఓవర్లకు చేయాల్సిన పరుగుల కంటే కోస్టల్ రైడర్స్ రెండు పరుగులు తక్కువ చేశారు. దీంతో విజయం గోదావరి టైటాన్స్‌ను వరించింది.


ఈ టోర్నమెంట్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. కోస్టల్ రైడర్స్, బెజవాడ టైగర్స్, ఉత్తరాంధ్ర లయన్స్, వైజాగ్ వారియర్స్, గోదావరి టైటాన్స్, రాయలసీమ కింగ్స్ జట్లు ఈ టోర్నీలో తలపడనున్నాయి.