Anushka Shetty Celebrations : మైదానంలో విరాట్‌ కోహ్లీని చూసి బెంగళూరు చిన్నస్వామి స్టేడియం ఊగిపోయింది. అయితే విరాట్‌ ఫోర్‌ కొట్టినప్పుడో... సెంచరీ చేసినప్పుడో... అద్భుత షాట్‌తో అలరించినప్పుడో ఇవన్నీ సాధారణమే. కానీ చిన్నస్వామి స్టేడియంలో జరిగింది ఇదేమీ కాదు. ఎప్పుడూ బ్యాట్‍తో మెరుపులు మెరిపించి సెంచరీలు చేసే కింగ్ కోహ్లి.. ఈసారి బంతితో మాయ చేశాడు. నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్‌ను ఔట్ చేసిన విరాట్ కోహ్లి.. వన్డేలలో ఐదో వికెట్ పడగొట్టాడు. దీపావళి పండుగ వేళ అభిమానులను గుర్తుండిపోయేలా విరాట్‌ బౌలింగ్‌ చేసి తీసిన వికెట్‌తో చిన్నస్వామి స్టేడియం హోరెత్తిపోయింది. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో బౌలింగ్‌ చేసిన విరాట్‌ వన్డేల్లో తొమ్మిదేళ్ల తర్వతా వికెట్ పడగొట్టాడు. డచ్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ ఔట్ చేసిన కోహ్లి వన్డేల్లో ఐదో వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ వికెట్‌ తీసిన తర్వాత అనుష్కశర్మ ఇచ్చిన రియాక్షన్ సామాజిక మాధ్యమాలను దున్నేస్తోంది.


అది బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం. ఇండియా, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. అప్పుడే ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. 25వ ఓవర్లో బాల్‌ను అందుకున్న కోహ్లీ బౌలింగ్ ఎండ్‌ వైపు నడిచాడు. అప్పడు స్టేడియంలో ప్రారంభమైన హోరు... విరాట్‌ ఓవర్‌ ముగిసే వరకు కొనసాగింది. 25వ ఓవర్‌ మూడో బంతికి ఈ ప్రపంచకప్‌లో మంచి ఫామ్‌లో ఉన్న నెదర్లాండ్స్‌ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్‌ను విరాట్‌ బుట్టలో వేసుకున్నాడు. విరాట్‌ పూర్తిగా లెగ్‌ సైడ్‌ వేసిన బంతిని డచ్‌ కెప్టెన్‌ గ్లాన్స్‌ చేయాలని చూశాడు. అది బ్యాట్‌ను తాకుతూ వెళ్లి కీపర్‌ రాహుల్‌ చేతిలో పడింది. వేగంగా స్పందించిన రాహుల్‌ అద్భుతంగా క్యాచ్‌ తీసుకున్నాడు. ఆ తర్వాత విరాట్‌ ఆనందం.. అనుష్క శర్మ






అమితానందం ప్రేక్షకులను కట్టిపడేశాయి. తొమ్మిదేళ్ల తర్వాత వికెట్‌ రావడంతో అనుష్క.. విరాట్‌ను చప్పట్లు కొడుతూ అభినందిస్తూ గట్టిగా నవ్వేశారు. విరాట్ గ్రౌండ్లో సెలబ్రేషన్స్, అనుష్క శర్మ స్టాండ్స్‌లో సంబరాలు.. ఫ్యాన్స్‌లో కేక పుట్టించాయి.  నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు ముందు వరకూ వన్డేలలో 644 బాల్స్ బౌలింగ్ చేసిన కింగ్ కోహ్లి 677 పరుగులు సమర్పించుకున్నాడు. వన్డేలలోఇంతకుముందు అలిస్టర్ కుక్, క్రెగ్ కీస్వెట్టర్, బ్రెండన్ మెక్‌కలమ్, క్వింటన్ డికాక్‌లను ఔట్ చేసిన కోహ్లి.. ఇప్పుడు డచ్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్‌ను పెవిలియన్ చేర్చాడు. ఈ ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లి బౌలింగ్ చేయడం ఇది రెండోసారి. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయం కారణంగా హార్దిక్ పాండ్యా క్రీజును వదలాల్సి వస్తే.. పాండ్యా కోటా మూడు బాల్స్ కోహ్లి పూర్తిచేశాడు.


ఇదే మ్యాచ్‌లో  48వ ఓవర్ బౌలింగ్ చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ.. నెదర్లాండ్స్ ఆఖరి వికెట్ తీసి టీమిండియాను సంబరాల్లో ముుంచెత్తాడు. రోహిత్ శర్మ బౌలింగ్‌లో తేజ నిడమానూరు అవుటయ్యాడు. తేజ వికెట్‌తో 3,980 రోజుల తర్వాత రోహిత్ శర్మ ఖాతాలో వికెట్ చేరింది. 2012లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఆఖరి సారిగా వికెట్ పడగొట్టాడు. వన్డేలలో ఇప్పటి వరకూ.. రోహిత్ శర్మ తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. మరోవైపు 20 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌లో వికెట్ తీసిన తొలి ఇండియన్ కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు.  మరోవైపు ఈ మ్యాచ్‌లో టీమిండియా తరుఫున 9 మంది బౌలింగ్ చేశారు. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, శ్రేయేస్ అయ్యర్ మినహా మిగతా అందరూ బౌలింగ్ వేశారు.