Andrew Flintoff Comments: ఇంగ్లాండ్ మాజీ స్టార్ ఆల్ రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ తాజాగా ఒక రహస్యాన్ని వెలువరించాడు. తను ఇంగ్లాండ్ తరపున 227 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడాడు. 12 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్ లో అన్ని రకాల ఫార్మాట్లలో ఇంగ్లాండ్ కు ప్రాతినిథ్యం వహించాడు. 2010లో తను క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్నాక, రెజ్లింగ్ టోర్నీ అయిన డబ్ల్యూడబ్ల్యూఈలో పాల్గొనే ఆఫర్ వచ్చిందని, మాంచెస్టర్ లో ది గ్రేట్ అండర్ టేకర్ తో తలపడే చాన్స్ వచ్చిందని పేర్కొన్నాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ డీల్ ను తను వదులుకున్నానని తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. ఇంగ్లాండ్ గ్రేట్ ఆల్ రౌండర్ సర్ ఇయాన్ బోథమ్ తర్వాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న ఇంగ్లాండ్ ఆల్ రౌండర్లలో ఫ్లింటాప్ ఒకరు. తాజాగా అతను వెలువరించిన రెజ్లింగ్ అంశం వైరలైంది. సోషల్ మీడియాలో దీనిపై జోరుగా చర్చ జరుగుతోంది. క్రికెట్ అభిమానులు ఈ అంశం గురించి చర్చిస్తూ, ఫ్లింటాప్ లేవనెత్తిన దానిపై కామెంట్లు చేస్తూ, లైకులు షేర్లు చేస్తూ హంగామా చేస్తున్నారు..
ఇంతకీ ఏం జరిగందంటే..?2010లో అంతర్జాతీయ క్రికెట్ కు విరామం ప్రకటించాక తనకు ఏం చేయాలో పాలుపోలేదని, ఆ సమయంలో ఎలాంటి డెసిషన్ తీసుకోవలో బోధ పడలేదని ఫ్లింటాప్ తెలిపాడు. ఆ సమయంలో స్కై స్పోర్ట్స్ కు సంబంధించిన ఒక క్రికెట్ లీగ్ లో తాను క్రికెట్ ఆడుతున్నట్లు తెలిపాడు. ఒకొనక సమయంలో తను చాలా ఫిట్ నెస్ కోల్పోయి, మంచి శరీరాకృతిని మిస్సయ్యానని తెలిపాడు. ఈ క్రమంలో చిన్నప్పటి నుంచి ఫిట్ గా ఉండే రెజ్లర్లను డబ్ల్యూడబ్ల్యూఈలో చూసి, అందులో చేరాలనే కోరికను స్కై స్పోర్ట్స్ వాళ్లకు తెలిపినట్లు పేర్కొన్నాడు. ఈ విషయం ఆనోటా ఈనోటా డబ్ల్యూడబ్ల్యూఈ వరకు చేరి కథ మరో మలుపు తీసుకుందని వెల్లడించారు.
అండర్ టేకర్ తో మ్యాచ్..తన ప్రపోజల్ వినగానే డబ్ల్యూడబ్ల్యూఈకి చెందిన ఇన్చార్జీ విన్స్ మెక్ మోహన్ లైన్ లోకి వచ్చి, తనతో సంప్రదింపులు జరిపాడని ఫ్లింటాప్ గుర్తు చేసుకున్నాడు. లీగ్ లో తనను చేర్చుకుంటామని, అలాగే ది అండర్ టేకర్ తో మ్యాచ్ అడే అవకాశం కూడా కల్పిస్తామని చెప్పినట్లు వెల్లడించాడు. ఇందుకోసం మూడేళ్ల కాంట్రాక్టు ఉంటుందని, 18 నెలల ట్రైనింగ్ తర్వాత రాయల్ రంబుల్, రెజ్లిమేనియాలో అవకాశం కల్పిస్తామని తెలిపినట్లు పేర్కొన్నాడు. ఇందుకోసం చాలా డబ్బు ఆఫర్ చేశారని, అమెరికా రమ్మన్నారని తెలిపాడు. అయితే తన పిల్లలు క్రికెట్ పై ఫోకస్ పెట్టడంతో తను అమెరికా వెళ్లేందుకు ఇష్టపడలేదని, అందుకే ఆ ఆఫర్ ను వదిలేశానని ఫ్లింటాఫ్ పేర్కొన్నాడు. ఏదేమైనా ఈ డీల్ ఓకే అయి ఉంటే, డబ్ల్యూడబ్ల్యూఈ మరింత ఆసక్తికరంగా ఉండేదని పలువురు అభిమానులు పేర్కొంటున్నారు.