Nita Ambani Gets Emotional By Seeing Rohit, Surya And Hardhik: టీ 20 ప్రపంచకప్(T20 World Cup) గెలిచి విశ్వ విజేతలుగా నిలిచిన భారత ఆటగాళ్లకు అపూర్వ స్వాగతాలు లభిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు... క్రికెటర్లను సన్మానించగా... తాజాగా అంబానీ ఇంట్లో జరిగిన వివాహ వేడుకలోనూ టీమిండియా క్రికెటర్లు ప్రత్యేక గౌరవం దక్కింది. పొట్టి ప్రపంచ కప్ ఛాంపియన్లు ఆకర్షణగా నిలిచారు. అనంత్ అంబానీ వివాహ వేడుకలో రోహిత్ శర్మ(Rohit Sharma), హార్దిక్ పాండ్యా(Hardic Pandya), సూర్యకుమార్ యాదవ్ ప్రశంసల జల్లులో తడిసి ముద్దయ్యారు. భారత జట్టును విశ్వ విజేతగా నిలపడంపై నీతా అంబానీ భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.
భారత్‌ను ఛాంపియన్‌గా నిలవడంలో ముంబైకర్లు కీలక పాత్ర పోషించారంటూ నీతా అంబానీ అన్నారు. టీమిండియా విశ్వ విజేతలుగా నిలవడంలో సారధి రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించారు. అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ సంగీత్‌లో రోహిత్ శర్మ, హార్దిక్, సూర్యకుమార్‌లను ఘనంగా సత్కరించారు.
సంగీత్ వేడుకలో కంటతడి
ముంబై ఇండియన్స్ యజమాని.. రిలయన్స్ ఇండస్ట్రీస్ సహ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ... తన కుమారుడు అనంత్ అంబానీ సంగీత్ వేడుకలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. పొట్టి ప్రపంచకప్ గెలిచిన సభ్యులు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా సహా టీమిండియా సాధించిన ఘనతకు నీతా అంబానీ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక్కడ మనమందరం కుటుంబసభ్యులమని... కానీ తనకు మరో కుటుంబం ఉందని స్టేజిపై నీతా అంబానీ మాట్లాడారు. ఆ మరో కుటుంబం ఇవాళ దేశాన్ని గర్వపడేలా చేసిందని... ప్రతి ఒక్కరి హృదయం గర్వంతో ఉప్పొంగేలా చేసిందని.. వారి వల్లే ప్రారంభమైన ఈ వేడుకల ఇప్పట్లో ఆగవని నీతా అన్నారు. ఈ విజయం తనకు గొప్ప అనుభూతినో పంచిందో చెప్పలేనని నీతా అంబానీ అన్నారు.
ఇవాళ ముంబై ఇండియన్స్ కుటుంబం మాతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొనడం తనకు అమితానాందాన్ని ఇస్తోందని నీతా అంబానీ అన్నారు. 2011 తర్వాత తొలిసారిగా ప్రపంచకప్ ట్రోఫీని భారత్‌కు తీసుకొచ్చినందుకు ముకేశ్ అంబానీ కూడా అభినందించారు. సంగీత్ వేడుకకు హాజరైన వారు లేచి నిలబడి, ప్రపంచ కప్ గెలిచిన హీరోలకు గౌరవాన్ని ఇచ్చారు. ఈ సంగీత్ వేడుకలో మాజీ కెప్టెన్ ధోని, భారత మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, కృనాల్ పాండ్యా కూడా పాల్గొన్నారు.
ముగ్గురు ముగ్గరే
టీ 20 ప్రపంచకప్‌లో రోహిత్ 257 పరుగులతో టోర్నమెంట్‌లో రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ చివరి ఓవర్‌లో అద్బుత క్యాచ్‌తో మ్యాచ్ గమనాన్నే మార్చేశాడు. చివరి ఓవర్‌లో హార్దిక్ పాండ్యా బౌలింగ్‌ను మరికొంతకాలం మనం మర్చిపోలేం.