Afghanistan women cricketers write to ICC requesting refugee team in Australia:  టీ 20 ప్రపంచకప్‌(T20 World Cup)లో అఫ్గానిస్థాన్‌(Afghanistan) జట్టు అద్భుతాలు సృష్టించింది. దిగ్గజ జట్లకు షాక్‌ ఇచ్చి.. సెమీస్‌ వరకూ చేరింది. దేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నా.. సమస్యలతో తమ దేశ ప్రజలు అల్లాడుతున్నా అఫ్గాన్‌ ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శనతో క్రికెట్‌ ప్రపంచం మన్ననలు అందుకున్నారు. ఆస్ట్రేలియా వంటి ప్రపంచ ఛాంపియన్‌ జట్టును ఓడించి సెమీస్‌ చేరిన కాబూలీలు... సెమీస్‌లో దక్షిణాఫ్రికా చేతిలో పరాజయం పాలయ్యారు. అయినా వారి ప్రదర్శన ఎందరికో స్ఫూర్తినిచ్చింది. తాజాగా అఫ్గాన్‌ మహిళల క్రికెట్‌ జట్టు(Afghanistan women cricketers) కూడా దీని నుంచి స్ఫూర్తి పొందింది. ఐసీసీకి అప్గాన్ మహిళ క్రికెట్‌ జట్టు రాసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది.

 
ఆ లేఖలో ఏముందంటే..?
ఇటీవల ముగిసిన టీ 20 ప్రపంచ కప్ 2024లో సెమీ ఫైనల్‌కు చేరుకోవడం ద్వారా అఫ్గానిస్థాన్‌ పురుషుల క్రికెట్ జట్టుపై ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. 2021లో అఫ్గాన్‌లో తాలిబన్లు అధికారం చేపట్టడంతో క్రీడల్లో మహిళల భాగస్వామ్యంపై తీవ్రమైన ఆంక్షలు విధించింది. తాలిబన్ల పాలనలో మహిళలు పూర్తిగా క్రీడలకు దూరమయ్యారు. చాలామంది జాతీయ మహిళ క్రీడాకారులు.. విదేశాల్లో స్థిరపడ్డారు. ఈ  నేపథ్యంలో అఫ్గానిస్థాన్‌ మహిళా క్రికెట్ జట్టు ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్క్లేకు లేఖ రాసింది. ఐసీసీ పురుషుల టి 20 ప్రపంచ కప్‌లో అఫ్గాన్‌ సాధించిన విజయాలపై తాము ఎంతో గర్వపడుతున్నామని ఆ లేఖలో అఫ్గాన్‌ పేర్కొంది. సెమీఫైనల్‌కు చేరుకున్న రషీద్ ఖాన్, అతని జట్టుకు అఫ్గాన్‌ మహిళల జట్టు అభినందనలు తెలిపారు. ఐసీసీ పురుషుల టి20 ప్రపంచకప్‌లో అఫ్గాన్ సాధించిన విజయాల పట్ల తాము ఎంతో గర్వంగా ఉన్నామని.. రషీద్ ఖాన్, అతని జట్టుకు అభినందనలు తెలిపారు. తాలిబన్ల పాలనలో మహిళలను క్రీడలకు దూరంగా ఉంచే కఠినమైన ప్రభుత్వ నిబంధనల వల్ల తమ దేశానికి ప్రాతినిధ్యం వహించలేకపోతున్నామని విదేశాల్లో ఉంటున్న అఫ్గాన్ మహిళా క్రికెటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాలో శరణార్థుల జట్టును ఏర్పాటు చేసుకునేందుకు తమకు మద్దతు ఇవ్వాలని ఐసీసీ ఛైర్మన్‌కు అఫ్గాన్‌ మహిళా క్రికెటర్లు విజ్ఞప్తి చేశారు. మహిళలుగా మేము పురుష క్రికెటర్ల మాదిరిగా తమ దేశానికి ప్రాతినిధ్యం వహించలేకపోవడం చాలా బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 
 
విదేశాల్లో ఉంటున్నందున...
తాము ఇప్పుడు విదేశాల్లో నివసిస్తున్నందున ఆఫ్ఘనిస్తాన్ మహిళా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించలేకపోతున్నామని...తమ జట్టును ఏర్పాటు చేసుకునేందుకు సాయం చేయాలని ఐసీసీని కోరుతున్నామని అఫ్గాన్‌ మహిళ క్రికెటర్లు కోరుతున్నారు. తాము క్రికెట్‌ను తిరిగి ప్రారంభించేందుకు ఆఫ్ఘన్ శరణార్థుల జట్టును ఏర్పాటు చేసుకునేందుకు సహాయసహకారాలు అందించాలని ఐసీసీకి రాసిన లేఖలో వారు పేర్కొన్నారు. దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నామని లేఖలో పేర్కొన్నారు. క్రికెట్ ఆడాలని... అఫ్గాన్‌ మహిళలందరికీ ప్రాతినిధ్యం వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అఫ్గాన్ శరణార్థుల జట్టు ఏర్పడితే సరిహద్దులు లేని క్రికెట్‌ను ఆడటానికి అవకాశం లభిస్తుందని వారు అన్నారు. ఆఫ్ఘన్ మహిళలందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడానికి ఇది ఉపయోగపడుతుందని వారు లేఖలో పేర్కొన్నారు.