T20 WC, AFG vs NZ: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో మరో మ్యాచ్ వర్షార్పణం అయింది! అఫ్గానిస్థాన్, న్యూజిలాండ్ మ్యాచ్ కనీసం బంతి, టాస్ పడకుండానే రద్దైంది. మ్యాచ్ నిర్వహించేందుకు నిర్వాహకులు ఎంత ప్రయత్నించినా వరుణుడు ఊరుకోలేదు. సమయం గడిచే కొద్దీ ఎక్కువ తీవ్రతతో వర్షం కురిపించాడు. ఫలితంగా మ్యాచ్‌ను రద్దు చేసి చెరో పాయింట్ ఇవ్వాల్సి వచ్చింది.
కివీస్‌కు లాభం!
గ్రూప్ 1లో భాగంగా బుధవారం అఫ్గాన్, కివీస్ తలపడాల్సి ఉంది. మెల్‌బోర్న్ మైదానం ఇందుకు వేదిక. బలమైన జట్లున్న గ్రూప్ కావడంతో ఈ మ్యాచ్ రెండు జట్లకు ఎంతో కీలకం. అయితే ఉదయం నుంచి ఇక్కడ వర్షం కురుస్తూనే ఉంది. మ్యాచ్ సమయానికైనా తగ్గలేదు. అప్పుడప్పుడు జల్లులు తగ్గినా కవర్లు తీసేందుకు కుదర్లేదు. పైగా సమయం గడిచే కొద్దీ మరింత తీవ్రంగా వర్షం కురిసింది. ఓవర్లు తగ్గించైనా మ్యాచ్ నిర్వహించాలని నిర్వాహకులు ప్రయత్నించారు. కవర్లు తొలగించేందుకైనా వరుణుడు సహకరించలేదు. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 9 గంటలు అవ్వడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. దాదాపుగా 11,369 మంది అభిమానులు అక్కడే ఉండిపోయారు.
వర్షంతో ఇబ్బందే!
ఈ ప్రపంచకప్‌లో వర్షం కారణంగా నిలిచిపోయిన రెండో మ్యాచ్ ఇది. అంతకు ముందు గ్రూప్ 2లో దక్షిణాఫ్రికా, జింబాబ్వే మ్యాచ్‌కు ఇలాగే జరిగింది. ఓవర్లు కుదించిన ఈ పోరులో జింబాబ్వే నిర్దేశించిన టార్గెట్‌ను సఫారీలు దాదాపుగా ఛేదించారు. మరో 5 నిమిషాల్లో గెలిచేస్తారనగా వర్షం కురిసింది. దాంతో చెరో పాయింటు పంచారు. బుధవారం ఇంగ్లాండ్, ఐర్లాండ్ మ్యాచ్‌దీ ఇదే పరిస్థితి. టార్గెట్ ఛేదిస్తుండగా వర్షం రావడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఇంగ్లాండ్ ఓడిపోయినట్టు ప్రకటించారు. భారత్, న్యూజిలాండ్ వార్మప్ మ్యాచ్ వర్షార్పణం అవ్వడం తెలిసిందే. పాక్‌తో మ్యాచుకూ వర్షం ముప్పు ఉన్నా ఆ రోజు వరుణుడు మినహాయింపు ఇచ్చాడు.
ఆసక్తికరంగా పాయింట్ల పట్టిక
ప్రస్తుతం గ్రూప్ 1 పాయింట్ల పట్టిక ఆసక్తికరంగా మారిపోయింది. న్యూజిలాండ్ తిరుగులేని స్థితిలో నిలిచింది. ఆసీస్‌పై గెలవడం, ఈ మ్యాచ్ పాయింట్ పంచుకోవడం 3 పాయింట్లు, 4.450 రన్‌రేట్‌తో ఉంది. శ్రీలంక, ఇంగ్లాండ్, ఐర్లాండ్, ఆస్ట్రేలియా ఒక్కో మ్యాచ్ గెలిచి వరుసగా 2, 3, 4, 5 స్థానాల్లో ఉన్నాయి. ఇందులో ఐర్లాండ్‌కు -1.169, ఆస్ట్రేలియా -1.555 రన్‌రేట్‌తో ఉన్నాయి. అఫ్గానిస్థాన్‌కు ఇంకా విజయం దక్కలేదు. రద్దైన మ్యాచుతో ఒక పాయింట్ సాధించింది. గ్రూప్2లో బంగ్లా, భారత్ ఒక్కో మ్యాచ్ గెలిచి వరుసగా 1, 2 స్థానాల్లో ఉన్నాయి. దక్షిణాఫ్రికా, జింబాబ్వే చెరో పాయింట్ పంచుకొని 3, 4 ప్లేసుల్లో నిలిచాయి. పాక్, నెదర్లాండ్స్ ఒక్కో ఓటమితో ఆఖర్లో ఉన్నాయి.