ICC World Cup 2023: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను ఓడించి ఆస్ట్రేలియా టోర్నమెంట్‌లో వరుసగా ఐదో విజయాన్ని సాధించింది. కంగారూ జట్టు సాధించిన ఈ విజయంలో స్పిన్నర్ ఆడం జంపా మూడు వికెట్లు పడగొట్టడం ద్వారా ముఖ్యమైన పాత్ర పోషించాడు. దీంతో అతను ప్రస్తుతం 19 వికెట్లతో టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. మరోవైపు న్యూజిలాండ్ యువ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర తన మూడో సెంచరీని సాధించడం ద్వారా పరుగుల జాబితాలో ముందడుగు వేశాడు.
పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రచిన్ రవీంద్ర 94 బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 108 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో రచిన్ రవీంద్ర టోర్నమెంట్‌లో ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో 74.71 సగటుతో, 107.39 స్ట్రైక్ రేట్‌తో 523 పరుగులు చేశాడు. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో ప్రస్తుతం రచిన్ రవీంద్ర రెండో స్థానంలో ఉన్నాడు.
దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డి కాక్ 545 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. డి కాక్ ఇప్పటివరకు ఏడు ఇన్నింగ్స్‌ల్లో నాలుగు సెంచరీలు సాధించాడు. ఇది ఇప్పటివరకు టోర్నమెంట్‌లో అత్యధికం. కాగా ఈ జాబితాలో 88.4 సగటుతో 442 పరుగులు చేసిన భారత దిగ్గజం విరాట్ కోహ్లీ మూడో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ 428 పరుగులతో నాలుగో స్థానంలో, భారత కెప్టెన్ రోహిత్ శర్మ 402 పరుగులతో ఐదో స్థానంలో కొనసాగుతున్నారు.
బౌలింగ్‌లో ఇదే టాప్-5
ఏడు ఇన్నింగ్స్‌ల్లో 17.15 సగటుతో 19 వికెట్లు తీసిన ఆడమ్ జంపా తర్వాత, శ్రీలంక ఫాస్ట్ బౌలర్ దిల్షాన్ మధుశంక ఏడు మ్యాచ్‌లలో 22.11 సగటుతో 18 వికెట్లు తీసి రెండో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో 16 వికెట్లు తీసిన దక్షిణాఫ్రికా పేసర్ మార్కో జాన్సెన్ మూడో స్థానంలో నిలిచాడు. పాకిస్తాన్‌కు చెందిన షహీన్ షా ఆఫ్రిది 16 వికెట్లతో నాలుగో స్థానంలో, భారత్‌కు చెందిన జస్‌ప్రీత్ బుమ్రా 15 వికెట్లతో ఐదో స్థానంలో ఉన్నారు.