IND vs WI: వెస్టిండీస్‌తో గురువారం ముగిసిన  తొలి టీ20లో భారత జట్టు ఓటమిలో  బ్యాటింగ్ వైఫల్యం కంటే కూడా టీమ్ కాంబినేషన్  బాగోలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   సీనియర్ ఆటగాళ్లు, మాజీలు ఇదే విషయాన్ని ఎత్తిచూపుతూ టీమిండియాపై విమర్శలు గుప్పిస్తున్నారు. ట్రినిడాడ్ వేదికగా జరిగిన  మ్యాచ్‌లో  స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు పూర్తి కోటా ఇవ్వకపోవడం.. లోయరార్డర్‌లో బ్యాటింగ్ చేయగలిగే ఆటగాడిని తీసుకోకపోవడం వంటివాటిపై మాజీలు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


యుజీకి నాలుగు ఓవర్లు ఇవ్వరా..?


ట్రినిడాడ్ వేదికగా ముగిసిన తొలి టీ20లో భారత బౌలర్లు తొలుత విండీస్‌ను 149 పరుగులకే కట్టడిచేశారు. అయితే స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు నాలుగు ఓవర్ల పూర్తి కోటా  ఇవ్వకుండా ఉండటం సరికాదని ఆకాశ్ చోప్రా వ్యాఖ్యానించాడు. తన యూట్యూబ్ ఛానెల్‌లో  చోప్రా మాట్లాడుతూ.. ‘కొత్త బంతితో భారత్ గొప్ప ఆరంభమేమీ ఇవ్వలేదు. అయితే యుజీ ఐదో ఓవర్లో రావడం రావడమే రెండు కీలక వికెట్లు తీశాడు.  కానీ తర్వాత అతడిని మళ్లీ 13వ ఓవర్ దాకా బరిలోకి దించలేదు.   మొదటి ఓవర్లోనే రెండు వికెట్లు తీసి  దూకుడు మీద ఉన్న బౌలర్‌ను  నిలిపేయడం సరికాదు.  టీమిండియా ఇక్కడే ట్రిక్ కోల్పోయింది. అదీగాక  యుజీకి  పూర్తి ఓవర్ల కోటా కూడా ఇవ్వలేదు.  అతడు 3 ఓవర్లే బౌలింగ్ చేశాడు.  ఇది నాకు నిరాశ కలిగించింది. నికోలస్ పూరన్ క్రీజులో ఉన్నప్పుడు చాహల్‌కు బంతినివ్వలేదు.  వాస్తవానికి లెఫ్ట్ హ్యాండర్లు చాహల్ ను ఎదుర్కోవడం కష్టం. కానీ హార్ధిక్ మాత్రం అతడిని మళ్లీ 13వ ఓవర్ దాకా బరిలోకి దించలేదు.   కుల్దీప్, అర్ష్‌దీప్‌లు తమ కోటాను పూర్తి చేశారు. అక్షర్ పటేల్ రెండు ఓవర్లే వేశాడు. పూరన్ ధాటిగా ఆడుతున్నప్పుడు అతడిని కట్టడి చేసేందుకు  చాహల్‌ను  బరిలోకి దింపితే బాగుండేది..’ అని  చోప్రా చెప్పాడు. 


లోయరార్డర్‌లో బ్యాటర్లే లేకుంటే ఎలా..? 


విండీస్‌ను 149 పరుగులకే కట్టడి చేసినా  వాటిని  ఛేదించడానికి భారత జట్టు నానా తంటాలు పడింది. వరుస క్రమంలో వికెట్లను కోల్పోవడంతో  నాలుగు పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. ఓపెనర్లు వైఫల్యం చెందగా  కొత్త కుర్రాడు తిలక్ వర్మ - సూర్యకుమార్ యాదవ్‌లు  భారత్‌ను ఆదుకున్నారు. ఆ తర్వాత మిడిలార్డర్ బ్యాటర్లు కూడా విఫలమయ్యారు.  చేయాల్సిన పరుగులు తక్కువే ఉన్నా  భారత లోయరార్డర్ వాటిని కూడా  ఛేదించలేకపోవడంపై   భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్  స్పందిస్తూ.. ‘టీమిండియాలో 8,9,10 వ స్థానాల్లో ఉన్న ఆటగాళ్లలో బౌండరీ కొట్టే వాళ్లే లేరు. ఈ ఫార్మాట్‌లో భారత్‌కు ఇది పెద్ద  లోటు. మీరు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్లను తీసుకుంటే వాళ్ల చివరి వరుస బ్యాటర్లు కూడా టీమ్ కోసం ఎంతోకొంత  పరుగులు కూడబెడుతారు. ఈ విషయంలో భారత జట్టు  మాత్రం  చాలా వెనుకబడి ఉంది.  ఇది టీమ్ బ్యాలెన్స్‌ను కూడా దెబ్బతీస్తుంది.  కుల్దీప్ యాదవ్‌ను 8వ స్థానంలో బ్యాటింగ్‌కు పంపడం రైట్ ఛాయిస్ కాదు’అని వ్యాఖ్యానించాడు.  తొలి మ్యాచ్‌లో ఓటమి ద్వారా  భారత జట్టులో సరిదిద్దుకోవాల్సిన లోపాలు చాలా తెలిసాయని వచ్చే మ్యాచ్‌లలో అయినా వాటి పట్ల దృష్టి సారిస్తే మంచిదని మాజీలు అభిప్రాయపడుతున్నారు. 








ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial