Jasprit Bumrah Player of the Tournament award: టీమిండియా స్టార్ పేసర్ బుమ్రా(Jasprit Bumrah) నా కంటే వెయ్యి రెట్లు ఉత్తమ బౌలర్... ఇది అన్నది ఏ సామాన్య క్రికెటరో కాదు. 1983లో భారత్‌కు తొలి ప్రపంచకప్‌ను అందించి హర్యాణా హరికేన్‌గా విశ్వ ఖ్యాతి గడించిన కపిల్‌దేవ్(Kapil Dev). కపిల్ దేవ్ లాంటి దిగ్గజ బౌలర్.. తన బౌలింగ్ కంటే బుమ్రా బౌలింగ్ వెయ్యి రెట్లు బెటర్ అని పొగిడాడంటే అర్థం చేసుకోవచ్చు జస్ప్రిత్ ఎంత విలువైన బౌలరో. బుమ్రా టీమిండియాలో ఉండడం తమ అదృష్టమని జట్టు సభ్యులు కూడా భావిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఈ టీ 20 ప్రపంచకప్‌లో భారత్‌కు వికెట్ కావాల్సిన ప్రతీసారి... జట్టు కష్టాల్లో పడ్డ ప్రతీసారి... బుమ్రా వికెట్ తీశాడు. పాకిస్థాన్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాలపై కీలక సమయాల్లో బుమ్రా తీసిన వికెట్లు అతడు ఎందుకు అంత విలువైన బౌలరో క్రికెట్ ప్రపంచానికి చాటి చెప్పాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక ఫైనల్లో చివరి ఓవర్లలో బుమ్రా బౌలింగ్‌ను సగటు అభిమాని ఇప్పట్లో మర్చిపోలేడు.
ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయా..?
బుమ్రాను ఈ ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ అనడానికి ఎవరికైనా సందేహాలు ఉంటే ఈ టీ 20 ప్రపంచకప్‌లో ఏ మ్యాచ్ అయినా మళ్లీ ఒక్కసారి చూడండి. ఎందుకంటే ఈ ప్రపంచకప్‌లో బుమ్రా బౌలింగ్ నభూతో.. న భవిష్యతీ. టీ 20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు చూడని గొప్ప బౌలర్ బుమ్రా అని స్వయంగా ఐసీసీ కొనియాడిందంటే జస్ప్రీత్ ఎంత సమర్థవంతమైన బౌలరో అర్థం చేసుకోవచ్చు. ఈ మెగా టోర్నీలో 8.26 సగటుతో బుమ్రా 15 వికెట్లు తీశాడు. టోర్నమెంట్‌లో కనీసం 20 ఓవర్లు బౌలింగ్ చేసిన వారిలో బుమ్రా అతి తక్కువ ఎకానమి. బుమ్రా కేవలం 4.17 ఎకానమీతో ఈ ప్రపంచ కప్‌ను ముగించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును సగర్వంగా అందుకున్నాడు.
ఈ ప్రయాణం అనితర సాధ్యం
ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు ఓవర్లలో బుమ్రా కేవలం ఆరు పరుగులే ఇచ్చి... హ్యారీ టెక్టర్, జోష్ లిటిల్‌ల వికెట్లు నెలకూల్చి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. పాకిస్తాన్‌పై బుమ్రా ప్రదర్శన అద్భుతమనే చెప్పాలి. భారత్ కేవలం 119 పరుగులను డిఫెండ్ చేసిందంటే అది బుమ్రా బౌలింగ్ వల్లే. నాలుగు ఓవర్లలో కేవలం 14 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో మహ్మద్ రిజ్వాన్‌ను అవుట్ చేసిన బుమ్రా మ్యాచ్‌ను పూర్తిగా భారత్ వైపు తిప్పేశాడు. సూపర్ ఎయిట్‌లోనూ బుమ్రా మెరిశాడు. బార్బడోస్‌లో ఆఫ్ఘానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా కేవలం ఏడు మాత్రమే ఇచ్చాడు. బంగ్లాదేశ్‌పైనా చెలరేగాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో గెలుపు దిశగా పయనిస్తున్న సమయంలో ట్రావిస్ హెడ్‌ను అవుట్ చేసిన బుమ్రా కంగారులను దెబ్బ కొట్టాడు. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ-ఫైనల్లో 12 పరుగులే ఇచ్చిన బుమ్రా రెండు వికెట్లు తీశాడు.
ఫైనల్లోనూ హీరోలాగే...
దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌లో బుమ్రా రెండో ఓవర్‌లోనే రీజా హెండ్రిక్స్‌ను అవుట్ చేసి భారత్‌కు శుభారంభం ఇచ్చాడు. దక్షిణాఫ్రికాకు చివరి 15 బంతుల్లో 21 పరుగులు కావాల్సి ఉండగా బుమ్రా.. మార్కో జాన్సెన్‌ను బౌల్ట్ చేశాడు. ఫైనల్లో నాలుగు ఓవర్లు వేసిన బుమ్రా కేవలం 18 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు నేలకూల్చి టీమిండియా విశ్వ విజేతలుగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు.