Ind vs WI Gill Records | ఒక బ్యాటర్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పుడు, అతనికి పెద్ద రికార్డులు కూడా చిన్నవిగా కనిపిస్తాయి. టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనతో టెస్ట్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన గిల్ రికార్డుల జోరు కొనసాగిస్తున్నాడు. అలవోకగా సెంచరీలు చేస్తూ పాత రికార్డులను బద్దలుకొడుతూ, సరికొత్త చరిత్ర తన పేరిట లిఖించుకుంటున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 129 పరుగులు చేసి గిల్ పలు రికార్డులను బద్దలు కొట్టాడు. కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ చివరి 12 టెస్ట్ ఇన్నింగ్స్‌లలో ఇది ఐదవ సెంచరీ. గిల్ తాజా సెంచరీతో టీమ్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 518 పరుగులకు ఇన్నింగ్స్ ముగించింది. భారత్ 518 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. కెప్టెన్ గిల్ 129 పరుగుల ఇన్నింగ్స్‌లో సాధించిన 5 పెద్ద రికార్డుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

Continues below advertisement

5 రికార్డులు బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్

ఒక ఏడాదిలో భారత టెస్ట్ కెప్టెన్ అత్యధిక సెంచరీలు- శుభ్‌మన్ గిల్ ఈ సంవత్సరం కెప్టెన్ అయిన తర్వాత 5 సెంచరీలు చేశాడు. ఒక భారత టెస్ట్ కెప్టెన్ ఒక సంవత్సరంలో అత్యధిక సెంచరీలు సాధించిన విషయంలో విరాట్ కోహ్లీ రికార్డును గిల్ సమం చేశాడు. విరాట్ కోహ్లీ 2017, 2018లో కెప్టెన్‌గా ఆ సంవత్సరాల్లో ఐదు సెంచరీలు సాధించాడు. సచిన్ టెండూల్కర్ కెప్టెన్‌గా 4 సెంచరీలు సాధించాడు.

భారత్‌లో టెస్ట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు- ఇది స్వదేశంలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లలో శుభ్‌మన్ గిల్ టెస్ట్ కెరీర్‌లో అత్యధిక స్కోరు. ఇంతకుముందు, అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 128 పరుగులు, ఇది 2023లో ఆస్ట్రేలియాపై చేశాడు. తాజా భారత్2లో తన వ్యక్తిగత స్కోరును మెరుగుపరుస్తూ 129 పరుగులు చేశాడు.

Continues below advertisement

WTCలో భారత్ తరపున అత్యధిక పరుగులు- ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్ అయ్యాడు శుభ్‌మన్ గిల్. అతని పేరు మీద ఇప్పుడు 2826 పరుగులు ఉన్నాయి. రిషబ్ పంత్‌ను గిల్ అధిగమించాడు. పంత్ ఇప్పటివరకు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో 2731 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 2716 పరుగులు, విరాట్ కోహ్లీ 2617 పరుగులతో ఈ జాబితాలో ఆ తరువాత స్థానాల్లో ఉన్నారు. రోహిత్, కోహ్లీలు రిటైర్ కావడంతో ఇక రేసు గిల్, పంత్ మధ్య కొనసాగనుంది.

బాబర్ ఆజమ్‌ను అధిగమించిన గిల్- ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చరిత్రలో కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు సాధించడంలో శుభ్‌మన్ గిల్ పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మలను కూడా అధిగమించాడు. ఇప్పుడు WTCలో గిల్ 5 సెంచరీలు సాధించాడు, అయితే రోహిత్ శర్మ, బాబర్ ఆజమ్ కెప్టెన్‌గా నాలుగు సెంచరీలు సాధించారు. అత్యధిక సెంచరీల రికార్డు ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ పేరిట ఉంది, అతను కెప్టెన్‌గా WTCలో 8 శతకాలు చేశాడు.

ఒక సంవత్సరంలో అత్యధిక టెస్ట్ సెంచరీలు- ఒక సంవత్సరంలో అత్యధిక టెస్ట్ సెంచరీలు సాధించిన విషయంలో సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లీతో శుభ్‌మన్ గిల్ సమానమయ్యాడు. గిల్ ఒక సంవత్సరంలో 5 టెస్ట్ సెంచరీలు సాధించాడు. అయితే, ఒక ఏడాదిలో అత్యధిక టెస్ట్ సెంచరీలు సాధించిన భారత రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ 2010లో 7 సెంచరీలు సాధించాడు.