రంజీ ట్రోఫీ 2023-24 సీజన్‌లో ముంబై-బిహార్‌ మ్యాచ్‌ సందర్భంగా ఆసక్తికర ఘటన జరిగింది. ముంబైతో టెస్టులో తలపడేందుకు.. రెండు బిహార్‌ జట్లు వచ్చాయి. దీంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ గందరగోళంతో తొలి రోజు ఆట కూడా ఆలస్యంగా మొదలైంది. బిహార్‌ – ముంబై మధ్య పాట్నాలోని మోయిన్‌ ఉల్‌ హక్‌ స్టేడియం వేదికగా మ్యాచ్‌ జరిగింది. 

ఇంతకీ ఏం జరిగిందంటే...?!

బిహార్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రాకేశ్‌ తివారి- కార్యదర్శి అమిత్‌ కుమార్‌ మధ్య కొద్దిరోజులుగా విభేదాలు నడుస్తున్నాయి. ఈ విభేదాలతో ఇద్దరు...వేర్వేరుగా రెండు జట్లు ప్రకటించారు. రాకేశ్‌ తివారి, సెకట్రరీ అమిత్‌ కుమార్‌లు పోటాపోటీగా జట్లను ప్రకటించడంతో అసలు ముంబై జట్టుతో ఆడబోయే టీమ్ ఏదంటూ అందరూ గందరగోళంలో పడిపోయారు. తాము సెలక్ట్‌ చేసిన జట్టే మైదానంలో దిగుతుందని రాకేశ్‌ తివారి, అమిత్‌ కుమార్‌ ఆటగాళ్లకు చెప్పారు. వీరిద్దరి అత్యుత్సాహం కారణంగా రెండు జట్లలోని సభ్యులంతా ముంబైతో మ్యాచ్‌ కోసం మోయిన్‌ ఉల్‌ హక్‌ స్టేడియానికి తరలివచ్చారు. చివరికి పోలీసుల రాకతో చేసి సెక్రటరీ అమిత్‌ కుమార్‌ వర్గం సభ్యులను అక్కడ నుంచి పంపించేయడం వల్ల ముంబయి జట్టు రాకేశ్‌ తివారి ప్రకటించిన బిహార్‌ జట్టుతో ప్రస్తుతం మ్యాచ్ ఆడింది.

 

వివాదంపై ఏమన్నారంటే...

ఇప్పటికే సెక్రటరినీ సస్పెండ్ చేశామని, అందుకే ఆయన జట్టును ఎంపిక చేయడం చెల్లదని బీసిఏ అధ్యక్షుడు తివారీ అన్నారు. ఆటగాళ్ల ప్రతిభాపాటవాలను చూసి తుది జట్టును ఎంపిక చేశానంటూ చెప్పుకున్నారు. సెక్రటరీ అమిత్ కుమార్ కూడా ఈ విషయంపై స్పందించారు. తనను సస్పెండ్ చేసే అధికారాలు అధ్యక్షుడికి లేదని పేర్కొన్నారు. తుది జట్టును సెక్రట్రీనే ఎంపిక చేస్తారని, అధ్యక్షుడికి ఆ హక్కు లేదంటూ అమిత్ కుమార్ మండిపడ్డారు. బోర్డు ప్రెసిడెంట్‌ ఎప్పుడైనా జట్టు ఎంపికలో జోక్యం చేసుకుంటారా... బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ భారత జట్టును ప్రకటించడం చూశారా అని కౌంటర్‌ ఇచ్చాడు. మ్యాచ్‌ విషయానికొస్తే మొదటిరోజు ఆటలో టాస్‌ గెలిచిన బిహార్‌ ముంబైని తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ముంబై జట్టు 76.2 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌట్‌ కాగా..  తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బిహార్‌ 26 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది.

హైదరాబాద్‌ ఘన విజయం

రంజీ ట్రోఫీ 2023-2024 సీజన్‌ను హైదరాబాద్‌ ఘనంగా ప్రారంభించింది.

రెండు రోజుల్లోనే నాగాలాండ్‌ను మట్టికరిపించింది. ఇన్నింగ్స్‌ 194 పరుగుల తేడాతో నాగాలాండ్‌పై హైదరాబాద్‌ ఘన విజయం సాధించింది. తొలుత రాహుల్‌ సింగ్‌ గహ్లోత్‌ డబుల్‌ సెంచరీ... కెప్టెన్‌ తిలక్‌ వర్మ శతకంతో భారీ స్కోరు చేసిన హైదరాబాద్‌... తర్వాత నాగాలాండ్‌ను రెండు ఇన్నింగ్సుల్లోనూ తక్కువ పరుగులకే ఆలౌట్‌ చేసింది. హైదరాబాద్‌ బౌలర్ల ధాటికి నాగాలాండ్‌ బ్యాటర్ల వద్ద సమాధానమే లేకపోయింది. హైదరాబాద్‌ బ్యాటర్ రాహుల్‌ సింగ్‌ గహ్లోత్‌ 143 బంతుల్లో డబుల్‌ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో రవిశాస్త్రి తర్వాత రంజీ ట్రోఫీలో వేగవంతమైన డబుల్‌ సెంచరీ చేసిన రెండో ప్లేయర్‌గా రాహుల్‌ గుర్తింపు పొందాడు.