ప్రముఖ ఫిల్మ్‌ మేకర్‌(Film Maker)  విధు వినోద్ చోప్రా(Vidhu Vinod Chopra) తెరకెక్కించిన 12th ఫెయిల్‌ చిత్రం విపరీతమైన ప్రేక్షకాదరణ పొందింది. గతేడాది అక్టోబర్‌ 27న బాలీవుడ్‌లో విడుదలైన ఈ చిత్రానికి మొదట్లో పెద్దగా ఆదరణ లభించలేదు. కానీ ఆ తర్వాత కేవలం మౌత్‌ టాక్‌తోనే సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఓటీటీలోనూ రిలీజైన ఈ సినిమాకు అభిమానుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇటీవలే ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (IMDB)లో అత్యధిక రేటింగ్ సాధించిన ఇండియన్ మూవీగా‌ నిలిచింది. ఒక వైపు దర్శకుడు విధు వినోద్ చోప్రా తెరకెక్కించిన 12th ఫెయిల్‌ చిత్రం ఓటీటీలో దుమ్మురేపుతుంటే... మరోవైపు విధు వినోద్‌ చోప్రా కుమారుడు రంజీ ట్రోఫీలో దుమ్మురేపుతున్నాడు. రంజీ ట్రోఫీ అరంగేట్రంలోనే భారీ శతకం బాది... టీమిండియా జట్టులో స్థానం దిశగా పయనిస్తున్నాడు.

 

అగ్ని చోప్రా అదుర్స్‌

విధు వినోద్‌ చోప్రా కుమారుడు అగ్ని చోప్రా(Agni Chopra) రంజీ ట్రోఫీలో అరంగేట్ర మ్యాచ్‌లోనే అద్భుత శతకం సాధించి తన సత్తా చాటాడు. మిజోరం తరఫున ఆడుతున్న ఈ 25 కుర్రాడు సిక్కింతో జరిగిన తొలి మ్యాచ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో179 బంతుల్లో 19 ఫోర్లు, 7 సిక్స్‌లతో 166 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ 74బంతుల్లో 92 పరుగులు చేసి అబ్బుర పరిచాడు. కానీ ఈ మ్యాచ్‌లో మిజోరం నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ప్రస్తుతం నాగాలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ అగ్ని చోప్రా అదరగొడుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 150 బంతుల్లో 21 ఫోర్లు, 3 సిక్స్‌లతో 164 పరుగులు చేసి  మరోసారి భారీ శతకం సాధించాడు. దీంతో మిజోరం 356 పరుగులకు ఆలౌటైంది. 

 

భువీ మ్యాజిక్‌

దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీలో టీమ్‌ఇండియా పేసర్‌... భువనేశ్వర్‌ కుమార్‌ చెలరేగిపోయాడు. ఆరేళ్ల విరామం తర్వాత రంజీల్లో పునరాగమనం చేసిన భువీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. కొన్నాళ్లుగా ఫామ్‌ కోల్పోయి భారత జట్టులో చోటు కోల్పోయిన రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటి సెలక్టర్ల చూపును తన వైపునకు తిప్పుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌ కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. తిరిగి జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలనే కసితో ఉన్న భువీ... ఆరేళ్ల తర్వాత ఫస్ట్ క్రికెట్‌ ఆడుతున్నాడు. రంజీ ట్రోఫీలో ఉత్తర్‌ప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న భువనేశ్వర్‌ తొలి మ్యాచ్‌లోనే  22 ఓవర్లు బౌలింగ్ చేసి 41 పరుగులిచ్చి ఏకంగా ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఐదు మెయిడిన్‌లు ఉన్నాయి. బెంగాల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి రోజు  ఐదు వికెట్లు తీసిన భువీ.. రెండో రోజు మరో ముగ్గురిని ఔట్ చేసి తన ఫస్ట్ క్లాస్ క్రికెట్‌ కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. తొలి మ్యాచ్‌లోనే ఏకంగా ఎనిమిది వికెట్లు కూల్చి సత్తా చాటాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 8/41 (22 ఓవర్లు)తో కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. దీంతో బెంగాల్‌ తొలి ఇన్నింగ్స్‌లో 188 పరుగులకు ఆలౌటైంది.