ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో సంచలనాలు కొనసాగుతున్నాయి. మహిళల సింగిల్స్‌లో యువ కెరటం పదహారేళ్ల మిరా ఆంద్రీవా పెను సంచలనం సృష్టించింది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ రెండో రౌండ్లో ఆరో సీడ్‌ జాబెర్‌కు షాకిచ్చింది. మాజీ నంబర్‌వన్‌ వోజ్నియాకి, ఎనిమిదో సీడ్‌ సక్కారిల కథ కూడా ముగిసింది.  ఓన్స్‌ జెబ్యూర్‌, మరియా సక్కారి, మాజీ ఛాంపియన్‌ కరోలిన్‌ వోజ్నియాలు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నుంచి నిష్క్రమించారు. రెండో రౌండ్‌లో ఆరో సీడ్‌ ఆన్స్‌ జాబెర్‌, మాజీ నంబర్‌వన్‌ కరోలిన్‌ వోజ్నియాకి  ఇద్దరూ రష్యా అమ్మాయిల చేతిలో పరాజయంపాలయ్యారు. 16 ఏళ్ల మిరా ఆంద్రీవా రెండో రౌండ్లో 6-0, 6-2తో ఆరో సీడ్‌ ఆన్స్‌ జాబెర్‌ను చిత్తు చేసింది. ఆంద్రీవా పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించగా.. ట్యునిషియాకు చెందిన జాబెర్‌ 24 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. టాప్‌-10 క్రీడాకారిణిపై గెలవడం ఆంద్రీవాకు ఇదే తొలిసారి. 

 

నిరుడు ఇదే టోర్నీ జూనియర్‌ విభాగంలో రన్నర్‌పగా నిలిచిన ఆంద్రీవా.. ఈ వేదికపై సీనియర్‌ కేటగిరిలో ఆడుతున్న రెండోమ్యాచ్‌లోనే టాప్‌టెన్‌ ప్లేయర్‌పై గెలుపొంది  సత్తాచాటింది. మరో మ్యాచ్‌లో టిమొఫీవా (రష్యా) 1-6, 6-4, 6-1తో వోజ్నియాకి (డెన్మార్క్‌)పై విజయం సాధించింది. ఎనిమిదో సీడ్‌ సక్కారి (గ్రీస్‌) కూడా షాక్‌ తగలింది. ఆమె 4-6, 4-6తో రష్యా ప్లేయర్‌ అవనేస్యన్‌ చేతిలో ఓడిపోయింది.

 

కోకో గాఫ్‌ ముందంజ

టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌లో అమెరికా యువ సంచలనం.. కోకో గాఫ్‌ మూడో రౌండ్‌కు చేరింది. నాలుగో సీడ్‌గా బరిలోకి దిగిన గాఫ్‌ వరుస సెట్లలో ప్రత్యర్థిని మట్టికరిపించింది. గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో సంచలన ప్రదర్శనతో టెన్నిస్‌ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంటున్న అమెరికా యంగ్‌గన్‌ కోకో గాఫ్‌.. ఆస్ట్రేలియా ఓపెన్‌లో అదే జోరు కొనసాగిస్తోంది. మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో నాలుగో సీడ్‌ గాఫ్‌ 7-6 (7/2), 6-2తో అమెరికాకే చెందిన డాల్హిడ్‌పై విజయం సాధించి మూడో రౌండ్‌లోకి ప్రవేశించింది. రెండో రౌండ్లో సబలెంక (బెలారస్‌) 6-3, 6-2తో చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన ఫ్రువిర్తోవాను చిత్తు చేసి మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లింది. మార్తా కొస్చుక్‌ 5-7, 6-1, 7-6(6)తో 25వ సీడ్‌ మెర్టెన్స్‌కు, మాగ్ధలీనా 6-4, 7-6(2)తో 16వ సీడ్‌ గార్సియాకు, అలీసియా7-5, 6-4తో 32వ సీడ్‌ లైలా ఫెర్నాండెజ్‌లపై గెలుపొంది తదుపరి రౌండ్‌కు వెళ్లారు. 

 

కొనసాగుతున్న జోకో జోరు...

పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ చాంప్‌ జొకోవిచ్‌ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ కష్టపడ్డాడు. రెండోరౌండ్లోనూ ఓ సెట్‌ కోల్పోయి గట్టెక్కాడు. మూడు గంటలా 11 నిమిషాల పాటు సాగిన పోరులో 36 ఏళ్ల జొకోవిచ్‌ 6-3, 4-6, 7-6(4), 6-3తో అలెక్సీ పాపిరిన్‌పై గెలిచాడు.  ఆరంభంలో ఆధిపత్యాన్ని ప్రదర్శించిన జకోవిచ్‌ సునాయాసంగానే తొలి సెట్‌ను గెలుచుకున్నాడు. కానీ అనవర తప్పిదాలు ఎక్కువగా చేసి రెండో సెట్‌ను కోల్పోయాడు. జోరు కొనసాగించిన పొపిరిన్‌ మూడో సెట్‌నూ గెలుచుకునేలా కనిపించాడు. కానీ కీలక సమయంలో జకోవిచ్‌ పుంజుకున్నాడు. 4-5 వద్ద నాలుగు సెట్‌ పాయింట్లు కాచుకున్నాడు. టైబ్రేక్‌లో ఆ సెట్‌ను చేజిక్కించుకున్న జకోవిచ్‌. నాలుగో సెట్లోనూ పైచేయి సాధించి మ్యాచ్‌లో విజేతగా నిలిచాడు. సీడెడ్‌ ఆటగాళ్లలో సిన్నర్‌, రుబ్లెవ్‌, సిట్సిపాస్‌, కచనోవ్‌ మూడోరౌండ్లో అడుగుపెట్టారు.