FIDE World Cup Final 2023 News:


భారత టీనేజ్ చెస్‌ సంచలనం రమేష్‌బాబు ప్రజ్ఞానంద చరిత్రకు అడుగు దూరంలో ఉన్నాడు. ఫిడే చెస్ ప్రపంచ కప్ ఫైనల్లో ఫస్ట్ గేమ్ డ్రా అయింది. భారత్ కు చెందిన గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద, నార్వే దేశానికి చెందిన అంతర్జాతీయ గ్రాండ్ మాస్టర్ మాగ్నస్ కార్ల్ సన్ తొలి గేమ్ ను 35 ఎత్తుల తరువాత  డ్రా చేసుకున్నారు. వీరి మధ్య ఫైనల్ రెండో గేమ్ బుధవారం జరగనుంది. 


రేపటి గేమ్ లో వరల్డ్ నెంబర్ 1 కార్ల్ సన్ తెల్లపావులతో ఆడనున్నాడు. ఫిడే చెస్ ప్రపంచ కప్ విజేతగా నిలిచేందుకు 18 ఏళ్ల భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందకు అవకాశం ఉందని అంతర్జాతీయ చెస్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ప్రజ్ఞానందతో పాటు కార్ల్ సన్ సైతం తొలి చెస్ వరల్డ్ కప్ టైటిల్ నెగ్గాలని ఆశగా ఎదురుచూస్తున్నాడు. వీరిద్దరూ 20సార్లు ముఖాముఖీ తలపడగా కార్ల్ సన్ ఎక్కువ మ్యాచ్ లు నెగ్గాడు. కానీ భారత సంచలనం ప్రజ్ఞానంద టాలెంట్, ప్రస్తుత ఫామ్ చూస్తే వరల్డ్ నెంబర్ 1కు షాకిచ్చేలా కనిపిస్తున్నాడు. 






చెస్ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత ప్రపంచకప్‌ ఫైనల్ చేరిన భారత ఆటగాడిగా నిలిచాడు ప్రజ్ఞానంద. విశ్వనాథన్ ఆనంద్ 2000, 2002లో రెండు పర్యాయాలు చెస్ వరల్డ్ కప్ విజేతగా నిలిచాడు. విషీ తరువాత 21 ఏళ్లకు ఫైనల్ చేరిన భారత చెస్ ఆటగాడిగా ప్రజ్ఞానంద రేసులోకి వచ్చాడు.


అంతకుముందు ఈ మెగా టోర్నీలో ప్రజ్ఞానంద సాధించినవి మామూలు విజయాలు కావు. ప్రపంచ 4వ రౌండ్‌లో ప్రపంచ నెంబర్ 2 హికారు నకమురాపై గెలుపొందాడు. ఈ విజయాన్ని సాధించినందుకు మాగ్నస్ కార్ల్‌సెన్ ఈ టీనేజీ సంచలనాన్ని అభినందించాడు. ఆపై వరల్డ్ నెంబర్ 3 ఫాబియానో కరువానాపై విజయం సాధించాడు. కరువానాపై గెలుపుతో ఫైనల్లోకి ప్రవేశించి ప్రపంచ నెంబర్ 1తో ఫిడె చెస్ వరల్డ్ కప్ కోసం పోటీపడ్డాడు.