CGW 2022: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత ఆటగాళ్లు దుమ్మురేపుతున్నారు. తమ తమ విభాగాల్లో దూసుకుపోతున్నారు. వెయిట్‌ లిఫ్టింగ్‌ అథ్లెట్లు ఇచ్చిన స్ఫూర్తితో రెచ్చిపోతున్నారు. టేబుల్‌ టెన్నిస్‌లో చాలామంది క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకున్నారు. బ్యాడ్మింటన్‌, రెజ్లింగ్‌లోనూ హవా మొదలైంది.




రిలేలో ఫైనల్


4x400 మీటర్ల రిలేలో భారత పురుషుల జట్టు ఫైనల్‌ చేరుకుంది. మహ్మద్‌ అనాస్‌ యాహియా, నోహా నిర్మల్‌ టామ్‌, మహ్మద్‌ అజ్మల్‌, అమోజ్‌ జాకబ్‌తో కూడిన జట్టు 3:06:97 నిమిషాల్లో రిలే హీట్‌ పూర్తి చేసింది. సరికొత్త ఆసియా రికార్డు సృష్టించింది.




క్వార్టర్స్ చేరిన శ్రీకాంత్


బ్యాడ్మింటన్‌లో మాజీ ప్రపంచ నంబర్‌ వన్‌ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌ (Kidambi Srikant) క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకున్నాడు. పురుషుల ప్రి క్వార్టర్స్‌ సింగిల్స్‌ పోరులో శ్రీలంక ఆటగాడు డుమిందు అబేవిక్రమను 21-9, 21-12 తేడాతో వరుస గేముల్లో చిత్తు చేశాడు.




టేబుల్ టెన్నిసులో దూకుడు 


టేబుల్‌ టెన్నిస్‌లో భారతీయులు హవా కొనసాగిస్తున్నారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో సాథియన్‌ జ్ఞానశేఖరన్‌, మనికా బాత్రా జోడీ క్వార్టర్స్‌ చేరుకుంది. నైజీరియా ద్వయం ఒజోము అజోక్‌, ఒమాటయో ఒలజిడెను ఓడించింది. ఇదే విభాగంలో ఆచంట శరత్‌ కమల్‌, ఆకుల శ్రీజ జంట 3-1 తేడాతో మలేసియా జోడీని చిత్తు చేసింది. లీయాన్‌ చీ ఫెంగ్‌, యింగ్‌ హోపై గెలిచి క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది.


సోనాల్ సిల్వర్ గ్యారంటీ


పారా టేబుల్‌ టెన్నిస్‌లో భావినా పటేల్‌ ఫైనల్‌కు చేరుకుంది. కనీసం రజతం ఖాయం చేసింది. ఇంగ్లాండ్‌ ప్యాడ్లర్‌ సూ బెయిలీపై 11-6, 11-6, 11-6 తేడాతో విజయం సాధించింది. ఇదే విభాగంలో సోనాల్‌ బెన్‌ పటేల్‌ సెమీస్‌లో ఓటమి పాలైంది. రజతం కోసం పోరాడనుంది. టేబుల్‌ టెన్నిస్‌ మహిళల సింగిల్స్‌లో ఆకుల శ్రీజ క్వార్టర్స్‌ చేరుకుంది. 8-11, 11-7, 12-14, 9-211, 11-4, 15-13, 12-10 తేడాతో వేల్స్‌ అమ్మాయి చార్లెట్‌ కేరీపై గెలిచింది. 




సెమీస్ చేరిన సాక్షి


కుస్తీ పోటీల్లో ఛాంపియన్లు బరిలోకి దిగారు. పురుషుల 65 కిలోల విభాగంలో బజరంగ్‌ పునియా క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. ఓపెనింగ్‌ బౌట్లో లోవ్‌ బింఘామ్‌ను చిత్తు చేశాడు. కామన్వెల్త్ క్రీడల్లో బజరంగ్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా కావడం గమనార్హం. దీపక్‌ పునియా సైతం క్వార్టర్స్‌కు చేరాడు. 86 కిలోల విభాగంలో న్యూజిలాండ్ రెజ్లర్‌ మాథ్యూ ఆక్సెన్‌హమ్‌ను 10-0తో చిత్తు చేశాడు. మహిళల 62 కిలోల విభాగంలో సాక్షి మలిక్‌ సెమీస్‌ చేరింది. కెస్లీ బార్నెస్‌ను టెక్నికల్‌ సుపీరియారిటీతో ఓడించింది.