వికీపీడియాపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. భారత బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ వికీపీడియా పేజీని ఆగంతుకులు ఎడిట్ చేశారు. తను ఖలిస్తాన్‌కు చెందిన బౌలర్ అని ఎడిట్ చేశారు. ప్రత్యేక ఖలిస్తాన్ ఉద్యమానికి అతన్ని ముడిపెడుతూ నకిలీ సమాచారాన్ని పబ్లిష్ చేసినట్లు తెలుస్తోంది. ఇది వర్గపరమైన విద్వేషాలకు దారి తీస్తుందని, తద్వారా అర్ష్‌దీప్ సింగ్ కుటుంభ సభ్యులకు శాంతి భద్రతల సమస్య ఎదురయ్యే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది.


వికీపీడియా అధికారులను దేశంలోనే అత్యుత్తమ అధికారుల ప్యానెల్ ప్రశ్నించనుందని, అలాగే షోకాజ్ నోటీస్ కూడా జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కేంద్ర ఐటీ శాఖ మంత్రి వికీపీడియా అధికారులకు ఇప్పటికే సమన్లు జారీ చేశారు. ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్‌లో కీలకమైన క్యాచ్‌ను వదిలేసినప్పటి నుంచి అర్ష్‌దీప్ సింగ్‌ను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.


అర్ష్‌దీప్ సింగ్ వికీపీడియా పేజ్ ఎడిట్ హిస్టరీని చూస్తే... రిజిస్టర్ చేసుకోని ఒక యూజర్ "India" అని ఉన్న చోట "Khalistan" అని మార్పులు చేశారు. తన ప్రొఫైల్‌లో పలు చోట్ల ఖలిస్తాన్ అనే పదం కనిపించింది. అయితే ఈ మార్పులు జరిగిన 15 నిమిషాల్లోనే వికీపీడియా ఎడిటర్స్ తప్పును సరిచేశారు.


18వ ఓవర్లో ఆసిఫ్ అలీ ఇచ్చిన సింపుల్ క్యాచ్‌ను అర్ష్‌దీప్ సింగ్ వదిలేయడం మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా మారింది. ఆ తర్వాతి ఓవర్లో ఆసిఫ్ అలీ రెండు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టడంతో పాకిస్తాన్ మ్యాచ్‌లో దూసుకువచ్చింది. అనంతరం మ్యాచ్‌లో ఐదు వికెట్లతో విజయం సాధించింది.


భారత బ్యాట్స్‌మన్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ విషయంలో అర్ష్‌దీప్ సింగ్‌కు సపోర్ట్‌గా నిలిచాడు. ఎక్కువ ఒత్తిడి ఉంటే మ్యాచ్‌ల్లో తప్పులు జరగడం సహజం అని, వాటి నుంచి నేర్చుకుని ముందుకెళ్లడం ముఖ్యమని తెలిపాడు. ఎంతో మంది మాజీ క్రికెటర్లు, కొందరు ఫ్యాన్స్ కూడా అర్ష్‌దీప్‌కు సపోర్ట్‌గా నిలిచారు.


రవి బిష్ణోయ్ వేసిన 18వ ఓవర్లో మూడో బంతికి పాక్ బ్యాటర్ ఆసిఫ్ అలీ స్వీప్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచింది. చూడటానికి అర్ష్‌దీప్‌కు ఎంతో సులువైన క్యాచ్‌లా అనిపించింది. కానీ బంతి అర్ష్‌దీప్ చేతిలో పడి వెంటనే జారిపోయింది.


ఆదివారం జరిగిన ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్‌లో టీమిండియాపై పాకిస్తాన్ ఐదు వికెట్లతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. అనంతరం పాకిస్తాన్ 19.5 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (60: 44 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మరో వైపు పాకిస్తాన్ తరఫున మహ్మద్ రిజ్వాన్ (71: 51 బంతుల్లో, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు) అత్యధిక స్కోరు సాధించాడు. మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో పాటు బంతితో కూడా రాణించిన మహ్మద్ నవాజ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.