ఇండియన్ ప్రీమియర్‌ వేలం వస్తోందంటే ఆటగాళ్లలో ఉత్కంఠ పెరిగిపోతుంది. తమకు ఎవరు కొంటారో? ఎంతకు కొంటారో? అని ఎదురు చూస్తుంటారు. కోరుకున్నంత డబ్బు రావాలని భావిస్తారు. తమ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడాలని కోరుకుంటారు. క్రికెటర్లలోనే కాకుండా ఇలాంటి ఉత్కంఠ మరొకరికీ ఉంటుంది! అతడే ఐపీఎల్‌ ఆక్షనీర్‌!


2008లో భారతీయులు ఐపీఎల్‌ తొలి వేలం పాటను చూశారు. ఎంతో థ్రిల్లయ్యారు. తొలి వేలం నిర్వహించిన ఆక్షనీర్‌ రిచర్డ్‌ మ్యాడ్లీ కూడా అంతే! టీమ్‌ఇండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ కోసం ఫ్రాంచైజీలు పోటీపడిన తీరు చూసి అవాక్కయ్యారట. ప్రతి జట్టు అతడిని దక్కించుకొనేందుకు సాధ్యమైనంత శ్రమించాయని వెల్లడించాడు.


2007లో ఎంఎస్‌ ధోనీ భారత్‌కు తొలి టీ20 ప్రపంచకప్‌ అందించడమే ఆ పోటీకి  కారణమని రిచర్డ్‌ మ్యాడ్లీ వెల్లడించాడు. అతడిని చెన్నై దక్కించుకున్నాక టిక్‌ చేసుకున్న పేపర్‌ను ఓ మధుర జ్ఞాపకంగా దాచుకున్నాడు. క్రికెటర్‌ అశ్విన్‌ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడీ సంగతి చెప్పాడు.


Also Read: స్టార్ ఆల్ రౌండర్‌పై కన్నేసిన 3 ఐపీఎల్ ఫ్రాంచైజీలు, అతడి కోసం వేలంలో తగ్గేదే లే!


Also Read: బీసీసీఐకి, 1983 వరల్డ్ కప్ విజేతలకు లతా మంగేష్కర్ చేసిన గొప్ప సాయం ఏంటో తెలుసా!


'ఆ రోజు సంచిలోంచి తీసిన రెండో పేరు షేన్‌వార్న్‌ అని నాకు గుర్తుంది. వార్న్‌ వచ్చాడు కాబట్టి వేలం ఆసక్తికరంగా ఉంటుందనుకున్నా. అతడి కనీస ధర 400000 డాలర్లని గుర్తు. రాజస్థాన్‌ రాయల్స్‌ అతడిని అదే ధరకు దక్కించుకుంది. ఆ జట్టు చాలా తెలివిగా ప్రవర్తించిందని నాకు అనిపించింది' అని మ్యాడ్లీ అన్నాడు. ఎప్పుడైతే ఎంఎస్‌ ధోనీ పేరొచ్చిందో గదిలో  సందడి పెరిగిందని గుర్తు చేసుకున్నాడు.


'మొదటి వేలం తర్వాత పదేళ్లు రాజస్థాన్‌ రాయల్స్‌ను చూశాను. వేలంలో వారే అత్యంత ప్రశాంతంగా ఉంటారు. ఎప్పుడూ ఆత్రుత చెందరు. మనోజ్‌ బదాలే ఒక సంప్రదాయానికి తెరతీశారు. ఆ తర్వాత మహేంద్రసింగ్‌ ధోనీ పేరొచ్చింది. అంతే వేలం జరిగే ప్రదేశంలో ఒక్కసారిగా ఉత్కంఠ మొదలైంది. అతడి కోసం ఫ్రాంచైజీల మధ్య బిడ్డింగ్‌ వార్‌ జరిగింది' అని మ్యాడ్లీ అన్నాడు.


మరికొన్ని రోజుల్లో ఐపీఎల్‌-15 జరగనుంది. ఇందుకోసం ఫిబ్రవరి 12, 13న బెంగళూరులో మెగా వేలం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఫ్రాంచైజీల ప్రతినిధులు నగరంలో క్వారంటైన్‌ అయ్యారు. ఏయే ఆటగాళ్లను తీసుకోవాలో వ్యూహాలు రచిస్తున్నారు. ఒక్కో జట్టులో 2-4 ఆటగాళ్లే ఉండటంతో ఈసారి వేలంలో మజా మామూలుగా ఉండదని విశ్లేషకుల అంచనా.