BWF World Championships 2022: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు దుమ్మురేపారు. అన్ని విభాగాల్లో కలిసి ఐదు పతకాలు సొంతం చేసుకున్నారు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు స్వర్ణం గెలిస్తే పురుషుల సింగిల్స్‌లో కుర్రాడు లక్ష్యసేన్‌ పసిడి ముద్దాడాడు. పురుషుల డబుల్స్‌లోనూ సాత్విక్‌ సాయిరాజ్‌, చిరాగ్‌ శెట్టి జోడీ బంగారు పతకం అందుకుంది. ఇప్పుడు వీరంతా మరో ప్రతిష్ఠాత్మక టోర్నీపై దృష్టి సారించారు.


భారత షట్లర్లు ఇప్పుడు బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌పై కన్నేశారు. జపాన్‌ రాజధాని టోక్యో వేదికగా జరిగే మెగా టోర్నీలో పతకాల పంట పండించేందుకు సిద్ధమయ్యారు. కనీసం మూడు పతకాలైనా సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు. మరి ఈ టోర్నీ ఎప్పుడు మొదలవుతుంది? ఎవరి సీడింగ్‌ ఏంటి? ఎవరు ఎవరితో తలపడుతున్నారు? ఏ రౌండు ఎప్పుడు జరుగుతుందో మీకోసం!


ఆగస్టు 22న మొదలు


బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఆగస్టు 22 నుంచి 28 వరకు జరుగుతుంది. జపాన్‌ రాజధాని టోక్యో ఇందుకు వేదిక. అన్ని విభాగాల్లో ఆరు రౌండ్ల వరకు పోటీలు ఉంటాయి. స్వర్ణం లేదా రజతం అందుకోవాలంటే తొలి రౌండు, రెండో రౌండు, ప్రి క్వార్టర్స్‌, క్వార్టర్‌ ఫైనల్‌, సెమీ ఫైనల్‌, ఫైనల్‌ ఆడాల్సి ఉంటుంది. 385 ఆటగాళ్లు పేర్లు నమోదు చేసుకున్నారు. 271 ఎంట్రీలు ఉన్నాయి. ఆగస్టు 22, 23న తొలి రౌండు, 24న రెండో రౌండు, 25న మూడో రౌండు పోటీలు ఉంటాయి. 26న క్వార్టర్‌ ఫైనళ్లు, 27న సెమీ ఫైనళ్లు, 28న ఫైనల్‌ మ్యాచులు జరుగుతాయి.


లక్ష్యసేన్‌పై ఆశలు


పురుషుల సింగిల్స్‌లో విక్టర్‌ అక్సెల్‌సెన్‌ టాప్‌ సీడ్‌గా బరిలోకి దిగుతున్నాడు. కెంటో మొమొటో, ఆండర్స్‌ ఆంటోన్‌సెన్‌, చౌ టీన్‌ చెన్‌, లీ జీ జియా వరుసగా 2, 3, 4, 5 సీడ్‌గా ఉన్నారు. భారత యువ కెరటం లక్ష్య సేన్‌ తొమ్మిదో సీడ్‌, కిదాంబి శ్రీకాంత్‌ 12వ సీడ్‌గా దిగుతున్నారు. మహిళల సింగిల్స్‌లో అకానె యమగూచి టాప్‌ సీడ్‌. తైజు ఇంగ్‌, ఆన్‌ సె యంగ్‌, చెన్‌ యూఫీ, కరోలినా మారిన్‌ వరుసగా టాప్‌ 5లో ఉన్నారు.


గత విజేతలు


సింగపూర్‌ షట్లర్‌ లో కీన్‌ యూ పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్నాడు. మహిళల సింగిల్స్‌లో జపాన్‌ అమ్మాయి అకానె యమగూచి గతేడాది విజేతగా నిలిచింది. పురుషుల డబుల్స్‌లో టకురో హోకి, ఉగో కబయాచి, మహిళల డబుల్స్‌లో చెన్‌ క్వింగ్‌చెన్‌, జియా యిఫాన్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో డెచాపొల్‌ , సప్సిరీ డిఫెండింగ్‌ ఛాంపియన్లు.