Paytm Home Series: ఆసియా కప్‌ తర్వాత టీమ్‌ఇండియా వరుసగా క్రికెట్‌ సిరీసులు ఆడనుంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు ఉపఖండంలో పర్యటించనున్నాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూలును బీసీసీఐ విడుదల చేసింది. సెప్టెంబర్లో చివర్లో ఆస్ట్రేలియా, అక్టోబర్‌ ఆరంభంలో దక్షిణాఫ్రికాతో హిట్‌మ్యాన్‌ సేన తలపడనుంది.


ఆస్ట్రేలియాతో టీమ్‌ఇండియా మూడు టీ20లు ఆడనుంది. సెప్టెంబర్‌ 20న మొహాలి, 23న నాగ్‌పుర్‌, 25న హైదరాబాద్‌లో వరుసగా మ్యాచులు ఆడుతుంది. మరో రెండు రోజులకే దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌ మొదలవుతుంది. 28న తిరువనంతపురం, అక్టోబర్‌ 2న గువాహటి, 4న ఇండోర్‌లో టీ20లు ఉంటాయి. అక్టోబర్‌ 6 నుంచి వన్డే సిరీసు మొదలవుతుంది. 6న లక్నో, 9న రాంచీ, 11న దిల్లీలో మూడు వన్డేలు నిర్వహిస్తారు.


ఇంతకు ముందే ఆసియాకప్‌-2022 షెడ్యూలు వచ్చేసింది. బీసీసీఐ అధ్యక్షుడు జే షా వివరాలను ట్వీట్‌ చేశారు. ఆగస్టు 27న టోర్నీ మొదలవుతుందని తెలిపారు. సెప్టెంబర్‌ 11న జరిగే ఫైనల్‌తో ఆసియా ఆధిపత్యం ఎవరితో తెలిసిపోతుందని వెల్లడించారు.




'ఎదురు చూపులు ముగిశాయి. ఆగస్టు 27న ఆసియా ఆధిపత్యం మొదలవుతుంది. సెప్టెంబర్‌ 11న కీలకమైన ఫైనల్‌ ఉర్రూతలూగించనుంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌నకు ఆసియాకప్‌ 15వ ఎడిషన్‌ సన్నాహకంగా ఉపయోగపడుతుంది' అని జే షా ట్వీట్‌ చేశారు. దాంతో పాటు ఆసియా కప్‌ షెడ్యూలు చిత్రాన్ని జత చేశారు.


భారత్‌, శ్రీలంక, పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌తో పాటు ఒక క్వాలిఫయర్‌ జట్టు ఈ టోర్నీ ఆడతాయి. వీటిని ఏ, బీ గ్రూపులుగా విభజించారు. వీటిలో నాలుగు జట్లు సూపర్‌-4 ఆడతాయి. ఆగస్టు 28న భారత్‌, పాకిస్థాన్‌ మొదట తలపడతాయి. పాక్‌ సూపర్‌-4కు ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువే కాబట్టి దాయాదులు రెండోసారీ తలపడటం దాదాపుగా ఖాయమే! దుబాయ్‌, షార్జాను వేదికలు ఎంపిక చేశారు. సూపర్‌ 4 మ్యాచులన్నీ దుబాయ్‌లోనే జరుగుతాయి.