ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల ఫైనల్స్ మ్యాచ్ ప్రపంచ నంబర్ 2 డానిల్ మెద్వెదేవ్, స్పెయిన్ దిగ్గజం రఫెల్ నాదల్ మధ్య జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు ఒక నిరసనకారుడు అంతరాయం కలిగించాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో గ్రౌండ్‌లోకి వచ్చి ఆటగాళ్లను చేరుకునే ప్రయత్నం చేశాడు.
అయితే వెంటనే సెక్యూరిటీ సిబ్బంది ఆటగాళ్ల చుట్టూ షీల్డ్‌గా నిలబడి వారి వద్దకు రాకుండా ఆపారు. అతను 'abolish refugee detention' అనే బ్యానర్‌తో మ్యాచ్ ముందు రాడ్ లేవర్ ఎరీనాలో కనిపించాడు. శరణార్థులకు సంబంధించిన ఉద్యమానికి తను మద్దతు తెలుపుతున్నట్లు తెలుస్తోంది.
ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో ప్రస్తుతం ఐదో సెట్ జరుగుతోంది. మొదటి రెండు సెట్లను మెద్వెదేవ్ 6-2, 7-6తో గెలుచుకోగా.. తర్వాతి రెండు సెట్లలో నాదల్ పుంజుకున్నాడు. 6-4, 6-4తో మూడు, నాలుగు సెట్లను సొంతం చేసుకున్నాడు. నిర్ణయాత్మక ఐదో సెట్ హోరాహోరీగా సాగుతోంది. ప్రస్తుతానికి 3-2తో నాదల్ లీడ్‌లో ఉన్నాడు.
ఈ మ్యాచ్ గెలిస్తే ఇది నాదల్‌కు 21వ గ్రాండ్ స్లామ్ కానుంది. చెరో 20 గ్రాండ్ స్లామ్‌లు సాధించిన రోజర్ ఫెదెరర్, నోవాక్ జొకోవిచ్‌లను వెనక్కి నెట్టి అత్యధిక గ్రాండ్ స్లామ్‌లు గెలిచిన పురుష టెన్నిస్ ఆటగాడిగా నిలవనున్నాడు. నాదల్ పోరాడుతున్న తీరు చూస్తుంటే అది సాధ్యం అయ్యే లాగానే ఉంది.