Australian Open 2023: భారత యువ సంచలనం, భావి బ్యాడ్మింటన్ స్టార్‌గా ఎదుగుతున్న  ప్రియాన్షు రజావత్‌కు సీనియర్ షట్లర్  హెచ్‌ఎస్ ప్రణయ్ షాకిచ్చాడు.  సిడ్నీ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియా ఓపెన్  2023లో  ప్రణయ్.. 21-18, 21-12 తేడాతో  రజావత్‌కు షాకిచ్చాడు.  ఈ విజయంతో  ప్రణయ్.. ఫైనల్‌కు అర్హత సాధించాడు. తుది పోరులో ప్రణయ్.. చైనాకు చెందిన వెంగ్ ఆంగ్ యాంగ్‌ను ఢీకొనబోతున్నాడు. 


తన కెరీర్‌‌లో తొలిసారి సూపర్ 500 టోర్నమెంట్ సెమీస్ చేరిన ప్రియాన్షు.. సెమీస్‌లో  బలమైన ప్రత్యర్థి  అయిన  ప్రణయ్ ధాటికి తడబడ్డాడు.  క్వార్టర్స్‌‌లో  మరో స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్‌ను  ఓడించిన ప్రియాన్షు..  ప్రణయ్   ముందు మాత్రం తేలిపోయాడు.  రెండు  సెట్లలోనూ   ప్రణయ్.. రజావత్‌కు కోలుకునే అవకాశమే ఇవ్వలేదు. 


 






భారత కాలమానం  మధ్యాహ్నం 12.30 గంటలకు మొదలైన  ఈ మ్యాచ్‌లో ప్రణయ్ ఆది నుంచీ ఆధిపత్యాన్ని కొనసాగించాడు.  మ్యాచ్ ఆసాంతం ఎక్కడా ఆధిక్యం తగ్గకుండా  తొలి గేమ్‌ను  21-18 తేడాతో  గెలుచుకున్నాడు. తొలి  గేమ్  కోల్పోయాక డీలాపడ్డ   ప్రియాన్షు.. తిరిగి కోలుకోలేదు. రెండో గేమ్‌లో ప్రణయ్ దూకుడు పెంచడంతో  రజావత్ కోలుకోలేకపోయాడు. వరుసగా రెండు గేమ్స్‌లోనూ ఓడటంతో  మ్యాచ్ ప్రణయ్ వశమైంది.  క్వార్టర్స్ పోరులో  టాప్ సీడ్ అంథోని గింటింగ్‌ను ఓడించిన ప్రణయ్.. ఆదివారం ఫైనల్ పోరులో వెంగ్ ఆంగ్ యాంగ్‌‌తో తలపడబోతున్నాడు. ప్రణయ్‌కు ఈ ఏడాది ఇది రెండో సూపర్ 500 ఓపెన్ ఫైనల్ కావడం గమనార్హం.










కాగా  శుక్రవారం ముగిసిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్‌లో రజావత్.. కిదాంబి శ్రీకాంత్‌ను ఓడించాడు. రజావత్..  21-13, 21-8 తేడాతో శ్రీకాంత్‌ను చిత్తుగా ఓడించాడు. తొలి రౌండ్‌లో కాస్త  పోటీనిచ్చిన శ్రీకాంత్ రెండో రౌండ్‌లో పూర్తిగా డీలాపడిపోయాడు. మహిళల సింగిల్స్‌లో సింధు పోరాటం కూడా  క్వార్టర్స్‌లోనే ముగిసింది.  సిడ్నీ వేదికగా జరిగిన మహిళల  సింగిల్స్ క్వార్టర్స్‌లో సింధు మరోసారి నిరాశపరిచింది. గత నాలుగు మేజర్ టోర్నీలలో క్వార్టర్స్‌కే పరిమితమైన సింధు.. ఆస్ట్రేలియా ఓపెన్‌లో కూడా దానినే కొనసాగించింది. గతేడాది కామన్వెల్త్ గేమ్స్ (బర్మింగ్‌హామ్)  తర్వాత  ఆరు నెలలు రెస్ట్ తీసుకుని  ఈ ఏడిది జనవరి నుంచి బరిలోకి దిగుతున్న సింధు.. తన వైఫల్య ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.  బీవెన్ జాంగ్‌తో 39 నిమిషాలలో ముగిసిన  క్వార్టర్స్ పోరులో రెండు రౌండ్లలోనూ సింధు  ఏమాత్రం ప్రతిఘటన లేకుండానే ఓడింది.  సింధు ఓటమితో మహిళల సింగిల్స్‌లో భారత్‌కు నిరాశ తప్పలేదు.




ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial