స్పెయిన్ దిగ్గజ టెన్నిస్ ఆటగాడు రఫెల్ నాదల్ ప్రపంచ రెండో ర్యాంకర్ మెద్వెదేవ్‌పై 6-2, 7-6, 6-4, 6-4, 7-6తో విజయం సాధించి ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను గెలుచుకున్నాడు. ఇది నాదల్ కెరీర్‌లో 21వ గ్రాండ్ స్లామ్. దీంతో చెరో 20 గ్రాండ్ స్లామ్‌లు సాధించిన రోజర్ ఫెదెరర్, నోవాక్ జొకోవిచ్‌లను వెనక్కి నెట్టి అత్యధిక గ్రాండ్ స్లామ్‌లు గెలిచిన పురుష టెన్నిస్ ఆటగాడిగా రఫెల్ నాదల్ నిలిచాడు. ఇది మాత్రమే కాకుండా నాదల్ కొన్ని ప్రత్యేకమైన రికార్డులు కూడా సాధించాడు.
ఇప్పటి వరకు అత్యధిక ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లు సాధించిన ఆటగాడు రఫెల్ నాదలే. ఏకంగా 13 ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లను అతను సాధించడం విశేషం. 2005 నుంచి 2008 వరకు, 2010 నుంచి 2014 వరకు, 2017 నుంచి 2020 వరకు ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లను అతను గెలుచుకున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో తనను ఓడించిన ఆటగాళ్లు రాబిన్ సోదర్లింగ్, నోవాక్ జొకొవిచ్ మాత్రమే.
13 ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లతో పాటు, రెండు వింబుల్డన్ గ్రాండ్ స్లామ్‌లు (2008, 2010), నాలుగు యూఎస్ ఓపెన్ టైటిళ్లు (2010, 2013, 2017, 2019), రెండు ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిళ్లు (2009, 2022) కూడా అతను సాధించాడు. 2005 నుంచి తను కేవలం మూడు సంవత్సరాల్లో మాత్రమే గ్రాండ్ స్లామ్ సాధించలేదు. 2015, 2016, 2021 సంవత్సరాల్లో తప్ప మిగతా అన్ని సంవత్సరాల్లో కనీసం ఒక్క సంవత్సరం అయినా నాదల్ గ్రాండ్ స్లామ్ కొట్టాడు.
నాదల్ కేవలం 24 సంవత్సరాల వయసులోనే కెరీర్ గ్రాండ్ స్లామ్ సాధించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్.. నాలుగు గ్రాండ్ స్లామ్‌లూ గెలిస్తే కెరీర్ స్లామ్ సాధించినట్లు. ఈ ఫీట్ సాధించిన అత్యంత చిన్న వయస్కుడు నాదలే.
కెరీర్ గోల్డెన్ స్లామ్ సాధించిన రెండో పురుష ఆటగాడు నాదలే. నాదల్‌కు ముందు ఆండ్రీ అగస్సీ ఈ ఫీట్ సాధించగా.. నాదల్ తర్వాత ఎవ్వరూ దాన్ని సాధించలేకపోయారు. నాలుగు గ్రాండ్ స్లామ్‌లతో పాటు ఒలంపిక్స్‌లో బంగారు పతకం కూడా గెలిస్తే దాన్ని గోల్డెన్ స్లామ్‌గా పరిగణిస్తారు. 2008 ఒలంపిక్స్‌లో నాదల్ బంగారు పతకం సాధించాడు.
ఏటీపీ ర్యాంకింగ్స్‌లో టీనేజ్‌లోనే రెండో ర్యాంకు సాధించిన ఘనత నాదల్ సొంతం. క్లేకోర్టుపై వరుసగా 81 విజయాలను నాదల్ సాధించాడు. ఓపెన్ ఎరాలో ఏ కోర్టు మీద అయినా ఇదే అత్యధికం కావడం విశేషం. పురుషుల సింగిల్స్‌తో పాటు, డబుల్స్ విభాగంలో కూడా నాదల్ ఒలంపిక్ స్వర్ణం సాధించాడు.