16 రోజుల పాటు ఆద్యంతం అలరించిన ఆసియా క్రీడల సంరంభానికి తెర పడింది. గతంలో ఎన్నడూలేనని పతకాలతో భారత్‌ సత్తా చాటగా.... 200 బంగారు పతకాలను కైవసం చేసుకుని చైనా తొలి స్థానంలో నిలిచింది. చైనాలోని హాంగ్జౌ నగరంలో సెప్టెంబర్‌ 23న అట్టహాసంగా ప్రారంభమైన ఆసియా క్రీడలు... అంతే వైభవంగా ముగిశాయి. బిగ్‌ లోటస్‌ స్టేడియంలో 75 నిమిషాల పాటు సాగిన ఆసియా క్రీడల ముగింపు వేడుకలు ఔరా అనిపించాయి. . చైనా ప్రధాని లి క్వియాంగ్‌, ఇతర అతిథుల సమక్షంలో ఆసియా ఒలింపిక్‌ కౌన్సిల్‌ తాత్కాలిక అధ్యక్షుడు రణధీర్‌ సింగ్‌ 19వ ఆసియా క్రీడలు ముగిసినట్టు ప్రకటించారు. “‘19వ ఆసియా క్రీడలు ముగిశాయి. మూడేళ్ల తర్వాత ఐచి నగోయా (జపాన్‌)లో 20వ ఆసియాడ్‌లో మళ్లీ కలుద్దాం" అని రణధీర్‌ చేసిన ప్రకటనతో స్టేడియం మార్మోగిపోయింది. వచ్చే ఆసియా క్రీడలనూ ఆసియా యువత సోదరభావం, మానవజాతి సౌభ్రాతృత్వం వెల్లివిరిసేలా జరుపుకొంటుందని ఆశిస్తున్నానని  రణధీర్‌ అన్నారు. 

 

భారత పతాకధారిగా శ్రీజేష్‌ ...

దేశాల జాతీయ జెండాలను చేబూనిన క్రీడాకారులు స్టేడియంలోకి ప్రవేశించారు. తర్వాత అథ్లెట్లు, అధికారులు వారిని అనుసరించారు. పురుషుల హాకీ జట్టు గోల్‌కీపర్‌ పీఆర్‌ శ్రీజేష్‌ భారత పతాకధారిగా వ్యవహరించాడు. మొత్తం 100 మంది భారత క్రీడాకారులు, అధికారులు పరేడ్‌లో భాగస్వాములయ్యారు. కాగా 45 దేశాలనుంచి 40క్రీడాంశాల్లో మొత్తం 12,407 మంది అథ్లెట్లు పోటీలలో పాల్గొన్నారు. ముగింపు వేడుకల్లో సాంకేతిక విన్యాసాలు సంభ్రమాశ్చర్యాలకు గురి చేశాయి. చైనా సాంస్కృతిక వారసత్వాన్ని చాటే సాంస్కృతి కార్యక్రమాలు అబ్బురపరిచాయి. లైట్‌, లేజర్‌, సౌండ్‌ షో వీక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్లింది. 45 దేశాల అథ్లెట్లు పాల్గొన్న ముగింపు వేడుకలు క్రీడాకారులు సహా అతిథులకు ఎంతో ఆహ్లాదాన్నిచ్చాయి.

 

పతాకల పట్టిక

19వ ఆసియా క్రీడల్లో పతకాల పట్టికలో చైనా అగ్రస్థానంలో నిలిచింది. 201 స్వర్ణాలు, 111 రజతాలు, 71 కాంస్యాలతో చైనా 383 పతకాలు సాధించింది. రెండో స్థానంలో జపాన్‌ నిలిచింది. 52 స్వర్ణాలు, 67 రజతాలు, 69 కాంస్యాలతో జపాన్‌  188 పతకాలు గెలుచుకుంది. 42 స్వర్ణాలు, 59 రజతాలు, 89 కాంస్య పతకాలతో మొత్తం 190 పతకాలతో  దక్షిణ కొరియా మూడో స్థానంలో నిలిచింది. ఈ ఆసియా క్రీడల్లో  అద్భుత ప్రదర్శన చేసిన భారత్ 107 పతకాలతో నాలుగో స్థానంలో సాధించింది. 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్య పతకాలతో భారత్‌ ఈ ఘనత సాధించింది. భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లు స్వర్ణాలతో సత్తా చాటాయి. భారత పురుషుల హాకీ జట్టు స్వర్ణం, మహిళల హాకీ జట్టు కాంస్యం గెలిచాయి. 

 

జపాన్‌లో తదుపరి ఆసియా క్రీడలు

తదుపరి 20వ ఆసియా క్రీడలు 2026లో సెప్టెటంబర్‌ 19 నుంచి అక్టోబర్‌ 4 వరకు జపాన్‌లోని ఐచి రాష్ట్ర రాజధాని నగోయా నగరంలో జరుగుతాయి. ముగింపు వేడుకల్లో  1951లో జరిగిన తొలి ఆసియా క్రీడలనాటి టార్చ్‌, ఆసియా ఒలింపిక్‌ కౌన్సిల్‌ పతాకాన్ని ఐచి రాష్ట్ర గవర్నర్‌ ఒమురా హిడెకి, నగోయా నగర డిప్యూటీ మేయర్‌ నకాటా హిడియో అందుకున్నారు. 45 దేశాలనుంచి 40క్రీడాంశాల్లో మొత్తం 12,407 మంది అథ్లెట్లు  ఈ ఆసియా క్రీడల్లో పాల్గొన్నారు. గతంలో కంటే వైభవంగా సాగిన ఈ ఆసియా క్రీడలు ఎలాంటి ఆటంకం లేకుండా ముగియడంతో నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు.