ఆసియా క్రీడలను నిరవధికంగా వాయిదా వేస్తున్నామని చైనా ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్లో జరగాల్సిన క్రీడలను అనివార్య కారణాల వల్ల వాయిదా వేయక తప్పడం లేదని పేర్కొంది. ప్రస్తుతం అక్కడ కరోనా వైరస్ వీర విహారం చేస్తోంది. మహమ్మారిని నియంత్రించేందుకు వారాల కొద్దీ కఠినంగా లాక్‌డౌన్లు అమలు చేస్తున్నారు.
'2022, సెప్టెంబర్ 10-25 మధ్య జరగాల్సిన ఆసియా క్రీడలను వాయిదా వేస్తున్నామని ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ ప్రకటించింది. చైనాలోని హాంగ్జౌలో ఈ క్రీడలు నిర్వహించాల్సి ఉంది' అని చైనా అధికార మీడియా తెలిపింది.
చైనాలోని అతిపెద్ద నగరం షాంగై. దానికి 200 కిలోమీటర్ల దూరంలోనే హాంగ్జౌ నగరం ఉంది. ప్రస్తుతం డ్రాగన్ దేశంలోనే కరోనా వైరస్ బీభత్సంగా విజృంభిస్తోంది. అక్కడి కమ్యూనిస్టు పార్టీ జీరో టోలెరెన్స్ విధానాన్ని పాటిస్తోంది. ఒక్క కేసు సైతం రాకూడదని కఠినంగా వారాల కొద్దీ లాక్‌డౌన్లను అమలు చేస్తోంది. ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రానివ్వడం లేదు.
ఆసియా క్రీడలు, ఆసియా పారా క్రీడలకు ఆతిథ్యం ఇస్తున్న హాంగ్జౌలో దాదాపుగా 56 వేదికలను సిద్ధం చేసినట్టుగా నిర్వాహకులు గత నెల్లోనే ప్రకటించారు. బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ తరహాలోనే వైరస్ నియంత్రణ ప్రణాళికను అమలు చేస్తూ క్రీడలను నిర్వహిస్తామని తెలిపారు. బయో రక్షణ బుడగను ఏర్పాటు చేస్తామని అన్నారు. వైరస్ విపరీతంగా విజృంభిస్తుండటంతో ఆ సాహసం చేసేందుకు భయపడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు చైనాలో రెండు సార్లు ఆసియా క్రీడలు నిర్వహించారు. 1990లో బీజింగ్, 2010లో గ్వాంగ్జౌలో నిర్వహించారు.