Virat Kohli interview with Rohit Sharma: తాను నిర్దేశించుకున్న ప్రమాణాల ప్రకారం తిరిగి పరుగులు చేస్తున్నానని టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ విరాట్‌ కోహ్లీ (Virat Kohli) అన్నాడు. మళ్లీ పాత టెంప్లేట్‌ ప్రకారం ఆడుతున్నానని పేర్కొన్నాడు. టీ20 ఫార్మాట్లో సెంచరీ చేస్తానని అస్సలు అనుకోలేదని చెప్పాడు. అఫ్గాన్‌పై సెంచరీ తర్వాత అతడు మాట్లాడాడు. బీసీసీఐ ఇంటర్వ్యూలో రోహిత్‌ శర్మ అడిగిన ప్రశ్నలకు జవాబు ఇచ్చాడు.


'మ్యాచ్‌ పరిస్థితులకు తగినట్టుగా బాధ్యతలు తీసుకోవడమే నాకిచ్చిన బాధ్యత. ఎక్కువ స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేయాలన్న డిమాండ్‌ వస్తే అదీ చేయాల్సిందే. నా జోన్‌లో ఉంటే కచ్చితంగా నేనా పనిచేస్తాను. ఆ తర్వాత రిలాక్స్‌ అవుతాను. ఎందుకంటే 10-15 బంతులాడితే నేను ఎక్కువ వేగం పెంచగలను' అని విరాట్‌ కోహ్లీ అన్నాడు.


'జట్టు కోణంలో చూస్తే నేనెంతో సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే కొన్నాళ్లేగా నేను సృష్టించుకున్న టెంప్లేట్‌ ప్రకారం తిరిగి ఆడుతున్నాను. నిరంతరం మ్యాచులు ఆడటం, ఎడతెరపి లేకుండా శ్రమించడం, నాది కాని మ్యాచులోనూ పరుగుల కోసం ఫేక్‌ ఇంటెన్సిటీ చూపించాను. విశ్రాంతి తీసుకోవడం మునుపటి శైలిలో రన్స్‌ చేస్తున్నాను' అని విరాట్‌ వివరించాడు.




అఫ్గాన్‌ పోరులో సిక్సర్‌తో సెంచరీ అందుకున్న విరాట్‌ టీ20ల్లో 3500 పరుగుల మైలురాయి చేరుకున్నాడు. రోహిత్‌ తర్వాత ఈ రికార్డును సాధించాడు. తొలుత బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు 6-15 ఓవర్ల మధ్య ఎక్కువ స్కోరు చేయలేకపోవడం టీమ్‌ఇండియాకు ఇబ్బంది మారినట్టు ద్రవిడ్‌ తనతో చెప్పారని కోహ్లీ వివరించాడు. తనను ఆ బాధ్యత తీసుకోవాలని కోరినట్టు వెల్లడించాడు.


సిక్సర్లు కొట్టడం తన బలం కాకపోవడంతో ఫీల్డర్ల మధ్య గ్యాప్‌ను రాబట్టి పరుగులు చేస్తానని విరాట్‌ తెలిపాడు. 'భారీ సిక్సర్లు బాదడం నా బలం కాదనుకుంటూనే ప్రతి టోర్నీ, సిరీసుకు వస్తాను. పరిస్థితులు డిమాండ్‌ చేసినప్పుడు సిక్సర్లు కొడుతుంటాను కానీ ఫీల్డర్ల మధ్య గ్యాప్‌లో మరింత మెరుగ్గా బౌండరీలు సాధిస్తాను. ఎన్ని ఎక్కువ బౌండరీలు కొడితే జట్టుకు అంత ఉపయోగం ఉంటుందని తెలుసు. స్ట్రైక్‌రేట్ పెంచుకొనేందుకు సిక్సర్ల కన్నా గ్యాపుల్లో బౌండరీలు ఎక్కువగా కొడతానని నేనెప్పుడూ కోచులు, ఆటగాళ్లకు చెబుతుంటాను' అని పేర్కొన్నాడు.


టీమ్‌ఇండియా వాతావరణం చాలా బాగుందని కోహ్లీ పేర్కొన్నాడు. ఛేంజింగ్‌ రూమ్‌ ఎంతో ప్రత్యేకంగా, పవిత్రంగా ఉంటుందని వెల్లడించాడు. ఒక జట్టుగా అందరం ఎంత బాగుంటామో తమకు తెలుసన్నాడు. అఫ్గాన్‌ మ్యాచులో కేఎల్‌ రాహుల్‌ ఇన్నింగ్స్‌ను మర్చిపోవద్దని సూచించాడు. తమ లక్ష్యమైన ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ తీసుకురావాలంటే అతడు ఫామ్‌లోకి రావడం అత్యంత కీలకమని వివరించాడు.