సూపర్- 4 భారత్ తో మ్యాచ్ లో శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట టీమిండియా బ్యాటింగ్ చేయనుంది. పాకిస్థాన్ పై ఆడిన భారత జట్టులో ఒక మార్పు చేశారు. రవి బిష్ణోయ్ స్థానంలో అశ్విన్ జట్టులోకి వచ్చాడు. కీపర్ గా పంత్ నే కొనసాగించారు.
బ్యాటింగ్ ఓకే.. .. కానీ
పాక్ తో మ్యాచ్ లో ఓపెనర్లు ధనాధన్ బ్యాటింగ్ చేశారు. తొలి 6 ఓవర్లలో ఫీల్డింగ్ పరిమితులను ఉపయోగించుకుని వేగంగా పరుగులు రాబట్టారు. అయితే రోహిత్, రాహుల్ మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచాల్సి ఉంది. విరాట్ కోహ్లీ ఫాం అందుకోవడం భారత్ కు కలిసొచ్చే అంశం. ఆడిన 3 మ్యాచ్ ల్లోనూ కోహ్లీ మంచి పరుగులు చేశాడు. అయితే ఇంకా వేగంగా బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. పాక్ తో మ్యాచ్ లో మిడిలార్డర్ వైఫల్యం కూడా కొంపముంచింది. పంత్, పాండ్య, దీపక్ హుడా పెద్దగా పరుగులు చేయలేదు. ఈ మ్యాచ్ లో కీపర్ రిషబ్ పంత్ కు బదులు దినేశ్ కార్తీక్ ను తీసుకుంటారేమో చూడాలి.
బౌలింగ్ తీరు మారాలి
బ్యాటింగ్ లో ఫామ్ చూపిస్తున్న భారత్ ను బౌలింగ్ విభాగం కలవరపెడుతోంది. గాయాలతో బుమ్రా, హర్షల్ పటేల్ టోర్నీకి ముందే దూరమవటంతో బౌలింగ్ విభాగం బలహీనపడింది. జడేజా మధ్యలో గాయపడి అందుబాటులో లేకుండా పోయాడు. అర్హదీప్ బాగానే బౌలింగ్ చేస్తున్నా, అవేష్ ఖాన్ అంతగా రాణించట్లేదు. ప్రధాన స్పిన్నర్ చహాల్ వికెట్లు తీయలేకపోతున్నాడు. గత మ్యాచ్ లో ఆరో బౌలర్ లేనిలోటు స్పష్టంగా కనిపించింది. హుడా స్పిన్ వేయగలిగినా రోహిత్ అతన్ని ఉపయోగించుకోలేదు. జడేజా స్థానంలో ఎంపికైన అక్షర్ పటేల్ ను ఈరోజు ఆడిస్తారేమో చూడాలి. అతను టీంలోకి వస్తే రవి బిష్ణోయ్ పెవిలియన్ కే పరిమితం అవ్వాల్సి ఉంటుంది. అలాగే విఫలమవుతున్న చహాల్ స్థానంలో అశ్విన్ ను తీసుకుంటారేమో చూడాలి. ఏదేమైనా బౌలింగ్ విభాగం రాణించకపోతే గెలవడం కష్టమే.
తక్కువ అంచనా వేయొద్దు
మరోవైపు శ్రీలంకను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. సూపర్- 4 తొలి మ్యాచ్ లో అఫ్ఘనిస్థాన్ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు ఛేదించింది. టీ20ల్లో టాప్ క్లాస్ బౌలర్లు ఉన్న అఫ్ఘాన్ పై అంత లక్ష్యం ఛేదించిందంటే లంకపై భారత బౌలర్లు మరింత శ్రమించాల్సిందే. నిశాంక, కుశాల్ మెండిస్, కెప్టెన్ దసున్ శనక, గుణతిలక లాంటి సామర్థ్యమున్న బ్యాటర్లు లంకకు ఉన్నారు. అలాగే బౌలింగ్ లోనూ హసరంగ, తీక్షణలతో ఇబ్బందులు తప్పవు.
భారత్ తుది జట్టు
రోహిత్ (కెప్టెన్), రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్, పంత్, పాండ్య, దీపక్ హుడా, భువనేశ్వర్ కుమార్, అర్హదీప్ సింగ్, చహాల్, అశ్విన్.
శ్రీలంక తుది జట్టు
దసున్ శనక (కెప్టెన్), నిశాంక, కుశాల్ మెండిస్, అసలంక, గుణతిలక, రాజపక్స, హసరంగ, కరుణరత్నే, తీక్షణ, మదుశంక, ఫెర్నాండో.