ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్‌ను ఆసీస్ పేసర్ స్కాట్ బొలాండ్ తన 'ఆట బొమ్మ'గా మార్చుకున్నాడు. యాషెస్ సిరీసులో అతడికి చుక్కలు చూపిస్తున్నారు. పదేపదే పెవిలియన్‌కు పంపించేస్తున్నాడు. అతడి ఆఖరి మూడు ఇన్నింగ్సుల్లోనూ బొలాండే ఔట్ చేయడం ప్రత్యేకం. మరో విశేషం ఏంటంటే బొలాండ్ వేసిన ఆఖరి 27 బంతుల్లో రూట్ ఒక్క పరుగైనా చేయలేదు.
నాలుగో టెస్టు రెండు ఇన్నింగ్సుల్లోనూ రూట్‌ను బొలాండ్ ఓ ఆటాడుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఏడు బంతులు ఆడిన అతడిని డకౌట్ చేశాడు. ఇక రెండో ఇన్నింగ్సులో 24 పరుగులతో కీలకంగా మారిన రూట్‌ను మళ్లీ ఔట్ చేశాడు. కీపర్ అలెక్స్ కేరీ క్యాచ్ అందుకున్నాడు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీసులో ఇంగ్లాండ్ ఘోరంగా విఫలమైంది. 3-0తో సిరీసును చేజార్చుకుంది. తొలి మూడు టెస్టుల్లో పరాజయం పాలైంది. నామ మాత్రమైన నాలుగో టెస్టును ఆఖరి ఓవర్లో డ్రాగా మలిచింది. తొలి ఇన్నింగ్స్‌ను ఆసీస్ 416/8కి డిక్లేర్ చేసింది. ఉస్మాన్ ఖవాజా (137) అద్భుత శతకం బాదేశాడు. అతడికి తోడుగా స్టీవ్ స్మిత్ (67) హాఫ్ సెంచరీ చేశాడు.
బదులుగా ఇంగ్లాండ్ 249 పరుగులే చేసింది. జానీ బెయిర్ స్టో (113) సెంచరీ చేయగా బెన్‌స్టోక్స్ (66) అర్ధశతకంతో రాణించాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఖవాజా (101) సెంచరీకి తోడుగా గ్రీన్ (74) చేయడంతో ఆసీస్ 265/6కు డిక్లేర్ చేసింది. భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్‌ను ఆసీస్ ఆలౌట్ చేయలేకపోయింది. ఐదో రోజు ఆట ముగిసే సమయానికి 270 పరుగులకు 9 వికెట్లు తీసింది. మరొక్క వికెట్ తీసుకుంటే ఫలితం వేరేలా ఉండేది.