ఒలింపిక్స్ మహా సంగ్రామంలో భారత్ నుంచి 119 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అయితే, ఏ రాష్ట్రం నుంచి ఎంత మంది క్రీడాకారులు టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నారో చూద్దాం.
హర్యానా నుంచి అత్యధికంగా 31 మంది అథ్లెట్లు ఒలింపిక్స్‌లో పోటీ పడుతున్నారు. ఆ తర్వాతి స్థానంలో పంజాబ్ నుంచి 14, కేరళ నుంచి 9, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర ఒక్కో రాష్ట్రం నుంచి 8 మంది, మణిపూర్ 5, రాజస్థాన్ 4, ఒడిశా 4, పశ్చిమ బెంగాల్ 3, జార్ఖండ్ 3, కర్ణాటక 3, దిల్లీ 3, గుజరాత్ 2, మధ్య ప్రదేశ్ 2, తెలంగాణ 2, ఆంధ్రప్రదేశ్ 2, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, అస్సాం, మిజోరం, ఉత్తరఖండ్ నుంచి ఒక్కొక్కరు చొప్పున బరిలోకి దిగుతున్నారు. అందులో 67 మంది పురుషులు, 52 మంది మహిళా క్రీడాకారులు ఉన్నారు. మొత్తం 18 విభాగాల్లో మన క్రీడాకారులు తమ అద ష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
క్రీడాకారులు, వారి వ్యక్తిగత సిబ్బంది, అధికారులు మొత్తం 228 మంది భారత్ నుంచి టోక్యో ఒలింపిక్స్‌కి వెళ్లారు. 2020లో జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ కరోనా కారణంగా ఈ ఏడాదికి వాయిదాపడిన సంగతి తెలిసిందే. ఈ నెల 23న ప్రారంభమైన ఈ మహా క్రీడా సంగ్రామం ఆగస్టు 8 వరకు జరగనుంది. 33 క్రీడాంశాల్లో జరిగే పోటీలకు 205 దేశాల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారు. కరోనా పరిస్థితుల కారణంగా ఒలింపిక్స్‌కి ప్రేక్షకులెవరినీ జపాన్ ప్రభుత్వం అనుమతించడంలేదు.
పతాకధారులుగా మేరీ కోమ్, మన్‌ప్రీత్
టోక్యో ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో భారత బృందానికి పతాకధారులుగా (ఫ్లాగ్ బేరర్స్) బాక్సర్ మేరీ కోమ్, హాకీ ప్లేయర్ మన్‌ప్రీత్ వ్యవహరించనున్నారు. అలాగే ముగింపు వేడుక(ఆగస్టు 8న) సమయంలో రెజ్లర్ బజరంగ్ ఫ్లాగ్ బేరర్‌గా ఉంటాడని ఐఓఏ తెలిపింది.
ఎవరూ చూపని ఆసక్తి:
నాలుగేళ్లకోసారి జరిగే ఈ ఆటల పండుగ కోసం ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. కానీ ఈసారి మాత్రం పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. కరోనా మహమ్మారితోపాటు పేరొందిన పలువురు అథ్లెట్లు ఈసారి టోర్నీకి దూరంగా ఉండటంతో.. టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్‌పై ఎవరూ ఆసక్తి చూపడం లేదని ఓ సర్వేలో తేలింది. ఇప్సోస్ అనే సంస్థ 28 దేశాల్లో ఈ సర్వే నిర్వహించింది. కేవలం 46 శాతం మంది మాత్రమే ఈ గేమ్స్‌పై ఆసక్తిగా ఉన్నట్లు సర్వే తేల్చింది.
తప్పుకున్న స్టార్లు
ఈసారి కరోనా కారణంగా పలువురు స్టార్ అథ్లెట్లు ఒలింపిక్స్ నుంచి తప్పుకున్నారు. టెన్నిస్ స్టార్లు రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్, సెరెనా విలియమ్స్, గోల్ఫ్ మాజీ నంబర్ వన్ ఆడమ్ స్కాట్, ఫుట్‌బాల్ స్టార్ నెయ్‌మార్ జూనియర్‌లాంటి వాళ్లు ఈ గేమ్స్ నుంచి తప్పుకున్నారు.