2036 ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి గుజరాత్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే అహ్మదాబాద్‌కు మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం ప్రారంభించింది. అయితే అంతకంటే ముందుగా 2026 కామన్వెల్త్ క్రీడలను నిర్వహించేందుకు వేలంలో పాల్గొనాలని నిర్ణయించింది. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన విక్టోరియా 2026 కామన్వెల్త్ క్రీడల ఆతిథ్యం నుంచి వైదొలగడంతో గుజరాత్ ప్రభుత్వం కామన్వెల్త్ క్రీడలు నిర్వహించేందుకు ఆసక్తి చూపుతోంది. 2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించేందుకు సహకరించాలని గుజరాత్ ప్రభుత్వం గతంలో కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు 2028 నాటికి అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు సిద్ధమని పేర్కొంది. అయితే 2026 కామన్వెల్త్ నుంచి విక్టోరియా తప్పుకోవడంతో గుజరాత్ రేస్ లోకి వచ్చింది. ఇందుకు కేంద్రం సహకరిస్తుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. 


2026 నాటికి ఒలింపిక్ బిడ్ ప్రాజెక్ట్ పనులు పూర్తి
ఒలింపిక్స్ బిడ్‌కు సంబంధించిన వివిధ ప్రాజెక్టుల పనుల పురోగతిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారని, ఈ మేరకు పనులను ఏకకాలంలో ప్రారంభించాలని బీజేపీ అధిష్ఠానం గుజరాత్ ప్రభుత్వానికి సూచించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఒలింపిక్ క్రీడల బిడ్ కోసం అన్ని మౌలిక సదుపాయాల పనులను గుజరాత్ ప్రభుత్వం 2026 లోపు పూర్తి చేయగలదని ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత వర్గాలు మంగళవారం పేర్కొన్నాయి. 2036 ఒలింపిక్స్ కోసం అహ్మదాబాద్ చేపట్టిన బిడ్ ప్రాజెక్టు పనులు 2026 నాటికి పూర్తవుతాయని, 2026 కామన్వెల్త్ క్రీడల ఆతిథ్యం నుంచి ఆస్ట్రేలియా వైదొలిగిన తరువాత, గుజరాత్ క్రీడల నిర్వహణకు బిడ్ వేస్తుందని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తుందనే నమ్మకం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.


ఆస్ట్రేలియాకు చెందిన కన్సల్టన్సీతో ఒప్పందం
ఇందులో భాగంగా ఇటీవల ఆస్ట్రేలియాకు చెందిన బిజినెస్ ప్లానింగ్ కన్సల్టెన్సీ పాపులస్‌ని ఒలింపిక్స్ బిడ్ కోసం మాస్టర్-ప్లాన్ సిద్ధం చేయడానికి గుజరాత్ ప్రభుత్వం నియమించింది. నరేంద్ర మోడీ స్టేడియం చుట్టూ సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ స్పోర్ట్స్ ఎన్‌క్లేవ్, నారన్‌పురా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లను ఒలింపిక్స్ క్రీడలకు అనుగుణంగా అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేయనుంది.  ఈ రెండు వేదికలు చాలావరకు ఒలింపిక్స్ క్రీడలు, ఈవెంట్‌లకు ఆతిథ్యం ఇస్తాయని వర్గాలు తెలిపాయి. మోతేరా వద్ద 236 ఎకరాల విస్తీర్ణంలో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ స్పోర్ట్స్ ఎన్‌క్లేవ్ అభివృద్ధికి రూ. 4,600 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 93 లక్షల చదరపు అడుగుల బిల్ట్-అప్ ఏరియాలో 20 క్రీడా విభాగాలకు ఆతిథ్యం ఇచ్చేలా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామన్నారు. ఈ ప్రాజెక్ట్‌లో క్రీడాకారులు, సహాయక సిబ్బంది, క్రీడా అధికారులు, ఇతరులకు ఆతిధ్యం కోసం 3,000 అపార్ట్‌మెంట్లను ఏర్పాటు చేయనున్నారు.  


ఏర్పాట్ల పర్యవేక్షణకు రెండు కమిటీలు
2036 ఒలింపిక్స్‌ బిడ్‌కు సంబంధించి ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షించడానికి ఈ సంవత్సరం ప్రారంభంలో గుజరాత్ ప్రభుత్వం రెండు కమిటీలను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా, కేంద్ర క్రీడా మంత్రి కో-ఛైర్‌పర్సన్‌గా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కేంద్ర క్రీడా కార్యదర్శి, ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ (IOA) ప్రతినిధి సభ్యులుగా సలహా కమిటీ ఏర్పాటైంది. ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటుంది. ఇందులో పట్టణాభివృద్ధి మరియు క్రీడా శాఖల ప్రధాన కార్యదర్శులు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్, AMC కమిషనర్, GMC కమిషనర్, AUDA CEO మరియు GUDA CEO ఉంటారు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial