తన భార్య అయేషా ముఖర్జీతో విడాకులపై టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ మొదటిసారి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందించాడు. ధావన్, అయేషా ముఖర్జీ జంట విడిపోయారు. ఈ విషయాన్ని అయేషా ముఖర్జీ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టు ద్వారా వెల్లడించడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్‌కు గురయ్యారు.  ఎక్కడికి వెళ్లినా భార్య, పిల్లలతో వెళుతూ సరదాగా గడిపే ధావన్... భార్యతో ఎందుకు విడిపోయాడా అంటూ శోధించడం మొదలుపెట్టారు. కానీ, ఎక్కడా వీరిద్దరూ ఇప్పటి వరకు విడిపోవడానికి గల కారణాలను వెల్లడించలేదు. 






‘రెండో సారి విడాకులు తీసుకునే వరకు విడాకులు అనే పదం తనకు చెత్త పదంగా అనిపించేదని’అయేషా తన ఇన్‌స్టాగ్రామ్‌‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ధావన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో అయేషా ముఖర్జీని ఉద్దేశిస్తూ  ‘ఏదైనా లక్ష్యాన్ని సాధించడానికి  జీవితంపై అవగాహన, హృదయం అవసరం. లక్ష్యంపై ప్రేమ ఉండాలి. అప్పుడే ఫలితాన్ని ఆస్వాదించొచ్చు. కలలను సాకారం చేసుకోవడానికి కృషి చేయ్యి’అని పోస్టు చేశాడు. 






అయేషా ముఖర్జీకి ధావన్‌తో పరిచయం కావడానికి కారణం హర్భజన్ సింగ్. 2012లో ధావన్ - అయేషా వివాహం చేసుకున్నారు. అప్పటికే అయేషా ముఖర్జీకి పెళ్లై ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. శిఖర్‌ ధావన్‌తో వివాహం జరిగాక 2014లో వీరు జొరావర్‌కి జన్మనిచ్చారు. అయేషా... ధావన్ కంటే 10 సంవత్సరాలు పెద్దది. ఆస్ట్రేలియాకు చెందిన అయేషా బాక్సర్. 9 ఏళ్ల అనంతరం శిఖర్‌ - అయేషా జంట తమ వైవాహిక బంధానికి వీడ్కోలు పలికారు.