ABP Network Ideas of India Summit 2023: ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్- 2023 పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో దేశంలోని ప్రముఖులు వివిధ అంశాలపై తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. నటులు, క్రీడాకారులు, రాజకీయవేత్తలు ఎంతో మంది ఇందులో పాల్గొంటున్నారు. ఇందులో భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ కూడా పాల్గొన్నారు.
28 ఏళ్ల వినేష్ ఫోగట్ హర్యానాలోని భివానీకి చెందిన మహిళ. మహిళల రెజ్లింగ్ లో ఆమె ఎన్నో విజయాలు, రికార్డులు సాధించారు. ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ లో కాంస్య పతకం నెగ్గారు. టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్ గా రికార్డు సృష్టించారు. రెండు ఒలింపిక్స్ లో పాల్గొన్నారు. కామన్వెల్త్ క్రీడల్లో 2 బంగారు పతకాలు సాధించారు. ఏబీపీ కార్యక్రమంలో వినేష్ పలు అంశాలపై మాట్లాడారు.
అందుకే నేను గళమెత్తాను
ఇటీవల రెజ్లింగ్ ఫెడరేషన్ పై లైంగిక ఆరోపణలు వచ్చాయి. దానిపై పోరాటం చేసిన వారిలో వినేష్ ఫోగట్ పేరు ప్రముఖంగా వినిపించింది. దీనిపై ఆమె మాట్లాడారు. 'మాకు రెజ్లింగ్ తప్ప మరేం తెలియదు. హర్యానాలో ఉన్న వాతావరణంలో ఏదో ఒక విధంగా మార్పు తీసుకురావాలనుకున్నాను. అందుకే ఎన్ని కష్టాలు ఎదురైనా రెజ్లింగ్‌లో ముందుకు సాగాను. అయితే మిగిలిన అమ్మాయిల గురించి ఎవరు ఆలోచిస్తున్నారు. అందుకే ఆ సమస్యపై నేను గళమెత్తాను. ఈ తీవ్రమైన సమస్య గురించి అందరి ముందు లేవనెత్తాను.' అని వినేష్ చెప్పారు.
కోచింగ్ తీరు మారాలి
మహిళల క్రీడల పరిపాలనలో మార్పు రావాలని వినేష్ ఫోగట్ అన్నారు. రెజ్లింగ్ సమాఖ్యకు మంచి క్రీడా నిర్వహణ ఉండాలని సూచించారు. రాష్ట్రస్థాయి కోచ్ లు బాగానే పనిచేస్తున్నారు కానీ.. అంతర్జాతీయ శిక్షకులు ఉంటే మరిన్ని మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు.
నాకు టెన్నిస్ ఇష్టం
తనకు మొదట్లో రెజ్లింగ్ అంటే ఇష్టం లేదని వినేష్ చెప్పారు. చిన్నతనంలో తాను టెన్నిస్ క్రీడాకారిణి అవ్వాలని అనుకున్నానని.. సానియా మీర్జాకు వీరాభిమానినని తెలిపారు. ఆమె ఆట చూడడం ద్వారానే క్రీడల్లోకి రావాలనే కోరిక కలిగిందన్నారు. తల్లిదండ్రుల ఒత్తిడితో రెజ్లింగ్ వైపు వచ్చానని.. ఇప్పుడు దానిపై ఇష్టం కలిగిందని అన్నారు.
ఆ క్రీడా నేపథ్యం ఉన్న సినిమా అంటే ఇష్టం
క్రీడల నేపథ్యంలో అత్యంత ఇష్టమైన సినిమా ఏది ఇష్టమని వినేష్‌ను ప్రశ్నించగా.. మేరీకోమ్ తర్వాత తనకు నచ్చిన చిత్రం చక్ దే ఇండియా అని చెప్పారు. ఆ తర్వాత వినేష్‌ను దంగల్ గురించి అడగ్గా.. అసలు మేం పడిన కష్టం ఇందులో చూపించలేదని.. అందుకే ఆ సినిమా అంటే ఇష్టం లేదని తెలిపింది.