హర్భజన్‌ సింగ్‌ వీడ్కోలుపై టీమ్‌ఇండియా క్రికెటర్లు స్పందించారు. అతడు సాధించిన ఘనతలు మాములువేమీ కాదని ప్రశంసించారు. అంతర్జాతీయ క్రికెట్లో 711 వికెట్లు తీయడం తనకే చెల్లిందని పేర్కొన్నారు. వీడ్కోలు తర్వాతి జీవితం బాగుండాలని, కుటుంబ సభ్యులతో కలిసి సమయం ఆస్వాదించాలని కోరుకున్నారు. భజ్జీకి రాహుల్‌ ద్రవిడ్‌, విరాట్‌ కోహ్లీ, చెతేశ్వర్‌ పుజారా అభినందనలు తెలియజేసిన వీడియోను బీసీసీఐ షేర్ చేసింది.


'కెరీర్లో భజ్జీ ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశాడు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాడు. ప్రతిసారీ నవ్వుతూనే పోరాడాడు. అతడో గొప్ప యోధుడు, పోటీదారుడు. ప్రతి కెప్టెన్‌ అతడు జట్టులో ఉండాలని కోరుకుంటాడు. అనిల్‌ కుంబ్లేతో కలిసి టీమ్‌ఇండియాకు విజయాలు అందించాడు. ఆస్ట్రేలియాలో సిరీసులో అతడి కెరీర్‌ మలుపు తిరిగింది. ఆ సిరీసులో 32 వికెట్లు తీశాడు. జట్టు నుంచి తొలగించాక అతడి పునరాగమనం అద్భుతం. భజ్జీతో కలిసి నేను మ్యాచులు ఆడాను' అని రాహుల్‌ ద్రవిడ్‌ అన్నాడు.






'భజ్జీ పా, మీ అద్భుతమైన కెరీర్‌కు అభినందనలు. అంతర్జాతీయ క్రికెట్లో 711 వికెట్లు తీయడం సామాన్యమైన ఘనత కాదు. అందుకు నువ్వు గర్వపడాలి' అని కోహ్లీ తెలిపాడు. అతడితో పాటు టీమ్‌ఇండియా నయావాల్‌ చెతేశ్వర్‌ పుజారా సైతం అభినందనలు తెలియజేశాడు. అరంగేట్రంలో అతడితో కలిసి ఆడిన అనుభవాలు వివరించాడు.






‘మంచి విషయాలన్నిటికీ ముగింపు ఉంటుంది. నా జీవితానికి అర్థం ఇచ్చిన ఆటకు ఈరోజు వీడ్కోలు చెబుతున్నాను. నా 23 సంవత్సరాల ప్రయాణాన్ని అందంగా, గుర్తుండిపోయేలా చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని భజ్జీ శుక్రవారం ఓ ట్వీట్‌ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించాడు. టీమ్‌ఇండియా తరఫున 103 టెస్టులాడిన హర్భజన్ 417 వికెట్లు తీశాడు. 236 వన్డేల్లో 269 వికెట్లు, 28 టీ20ల్లో 25 వికెట్లను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.






ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున హర్భజన్‌ ఆడాడు. హర్భజన్ టెస్టుల్లో రెండు సెంచరీలు కూడా సాధించాడు. టెస్టుల్లో ఒక మ్యాచ్‌లో 15 వికెట్లు తీసిన రికార్డు కూడా హర్భజన్‌కు సొంతం. ఒక ఇన్నింగ్స్‌లో రెండో అత్యుత్తమ స్ట్రైక్ రేట్(5.4) కూడా తనదే. కేవలం 96 మ్యాచ్‌ల్లోనే 400 టెస్టు వికెట్లు సొంతం చేసుకున్నాడు. టెస్టులు, వన్డేలు రెండు ఫార్మాట్లలోనూ 1000 పరుగులు, 100 వికెట్లు తీశాడు.