విరాట్ కోహ్లీ... ఈ పేరు వింటేనే ఒక వైబ్రేషన్. అంతర్జాతీయ క్రికెట్లో ప్రత్యర్థి జట్లకు టీమిండియాలో కోహ్లీ ఉంటే అదో భయం. కోహ్లీని ఔట్ చేస్తే చాలు మ్యాచ్ గెలిచినట్లే అని భావిస్తారు. అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో అవార్డులు, రివార్డులు కోహ్లీ సొంతం. భారతీయులు ముద్దుగా అతడ్ని పరుగుల యంత్రం అని పిలుస్తుంటారు.
ఇప్పుడు ఇదంతా ఎందుకు? కోహ్లీ గురించి ఎందుకా అని అనుకుంటున్నారా? సరిగ్గా 13 ఏళ్ల క్రితం విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. 2008 ఆగస్టు 18లో కోహ్లీ భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. నేటికి 13 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా కోహ్లీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. విరాట్ కోహ్లీ 2008లో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చాడు. అయితే తొలి వన్డేలో 12 పరుగులు మాత్రమే చేసి నిరాశ పరిచిన కోహ్లీ 14 మ్యాచ్‌ల తర్వాత తొలి శతకాన్ని సాధించాడు.
అప్పటి నుంచి కోహ్లీ శకం మొదలైంది. అప్పటి నుంచి పరుగుల ప్రవాహం సాగుతూనే ఉంది. అందుకే కోహ్లీని పరుగుల యంత్రం అని ముద్దుగా పిలుస్తుంటారు. టీమిండియా తరపున 254 వన్డేల్లో 12,169 పరుగులు, 94 టెస్టుల్లో 7,609 పరుగులు, 90 టీ20ల్లో 3,159 పరుగులు చేశాడు. వీటిలో వన్డేల్లో 43 సెంచరీలు, టెస్టుల్లో 27 సెంచరీలు ఉన్నాయి. భారత్ తరఫున టెస్టు, వన్డే, T20 మూడు ఫార్మాట్లకు కోహ్లీ సారథ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. 13 ఏళ్లు పూర్తియిన సందర్భంగా కోహ్లీ గురించి 13 విషయాలు తెలుసుకుందాం.
► 2012లో 23 ఏళ్ల వయసులో తొలిసారి ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు.
► 2008లో అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లీ 2011 వన్డే వరల్డ్ కప్ సాధించిన టీమిండియాలో సభ్యుడు.
► వన్డేల్లో 1000, 4000, 5000, 6000, 7000, 8000, 9000,10000 పరుగులు అత్యంత వేగంగా పూర్తి చేసిన భారత ఆటగాడు.
► కోహ్లీ కెప్టెన్సీలో 2008 అండర్ - 19 ప్రపంచకప్ గెలుచుకుంది భారత జట్టు.
► ఆడిన తొలి ప్రపంచ కప్‌లోనే సెంచరీ సాధించిన తొలి భారత ఆటగాడు కోహ్లీ.
► 2013లో విరాట్ కోహ్లి తొలిసారి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం దక్కించుకున్నాడు.
► ఒక టీ20 మ్యాచ్‌లో వేసిన తొలి బంతికే ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ కెవిన్ పీటర్సన్ ఔట్ చేయడం ద్వారా కోహ్లి తొలి అంతర్జాతీయ వికెట్ సాధించాడు.
► 2016లో తండ్రి చనిపోయిన రోజునే ఆయన గుర్తుగా రంజీ మ్యాచ్ ఆడిన కోహ్లి బ్యాటింగ్‌లో 90 పరుగులు చేశాడు.
► 2012లో 10 ఉత్తమ దుస్తులు ధరించిన అంతర్జాతీయ పురుషులలో విరాట్ కోహ్లి తొలి స్థానంలో నిలిచి ఏకంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రశంసలు అందుకున్నాడు.
► టీ20ల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసిన తొలి భారత ఆటగాడు.
► వన్డేల్లో 10వేల పరుగుల మైలురాయిని అత్యంత వేగంగా అందుకున్న కోహ్లి దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు.
► ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న కోహ్లి లీగ్‌లో జీతం కింద రూ.17కోట్లు అందుకుంటున్నాడు.
► టెస్టు క్రికెట్‌లో 63 మ్యాచ్‌ల్లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లి 37 విజయాలు సాధించి అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు.