The 4 Yugas Time and Yugantham : యుగాలు 4
1. సత్యయుగం


2. త్రేతాయుగం


3. ద్వాపరయుగం


4. కలియుగం


పురాణాల ప్రకారం... సత్య యుగం నుంచి కలియుగానికి చేరుకునే సరికి  మానవుల సగటు ఎత్తు, ఆయు:ప్రమాణం, తెలివితేటలు తగ్గుతూ వచ్చాయి. సత్యయుగంలో లక్ష సంవత్సరాలు జీవిస్తే త్రేతాయుగానికి పదివేలకు చేరుకుంది. వాల్మీకి రామాయణం ప్రకారం రాముడు 11,000 సంవత్సరాలు జీవించాడు. ద్వాపర యుగంలో కృష్ణుడు 125 ఏళ్లు జీవించాడు. కృష్ణుడు మరణంతోనే ద్వాపరయుగం ముగిసి...కలియుగం ప్రారంభమైంది.  మొదటి యుగంలో ధర్మం నాలుగుపాదాలపై నడిస్తే..రెండో యుగంలో మూడు పాదాలపై..మూడో యుగంలో రెండు పాదాలపై నడిచింది. ఇక ప్రస్తుతం నడుస్తోన్న కలియుగంలో ధర్మం, మంచి అంటే భూతద్ధం పెట్టుకుని వెతుక్కోవాల్సిందే. 


Also Read: ఆత్మలు మాత్రమే ప్రవేశించే ఆలయం - పొరపాటున కూడా ఎవ్వరూ లోపల అడుగుపెట్టరు!


సత్యయుగం (కృతయుగం)


నాలుగు యుగాల్లో మొదటిది సత్యయుగం . దీన్నే కృతయుగం అని కూడా అంటారు.  ఈ యుగంలో భగవంతుడు నారాయణుడు, లక్ష్మీ సమేతంగా భూమిని పరిపాలించాడు. దీని కాల పరిమాణం 17 లక్షల 28 వేల సంవత్సరాలు. ఈ యుగంలో ధర్మం నాలుగుపాదాల మీద నడిచిందని శివపురాణం చెబుతోంది.  అందుకే ప్రజలు ఎలాంటి బాధలు లేకుండా సుఖసంతోషాలతో ఉన్నారు. అకాల మరణాలు లేవు. కృత యుగానికి రాజు సూర్యుడు, మంత్రి గురువు. గురువు బంగారానికి అధిపతి కాబట్టి ఎటు చూసినా బంగారు మయం.  ప్రభువు-ప్రజల మధ్య ఎలాంటి విభేదం లేకుండా కాలం చక్కగా నడిచింది.  


త్రేతాయుగం


త్రేతాయుగంలో భగవంతుడు శ్రీ రామచంద్రుడుగా అవతరించి రావణాసురుణ్ణి సంహరించి ధర్మ సంస్థాపన చేసాడు. ఈ యుగం పరిమితి 12 లక్షల96 వేల సంవత్సరాలు. ఈ యుగంలో ధర్మం మూడు పాదాలపై నడిచింది. త్రేతాయుగంలో రాజుగా కుజుడు, మంత్రిగా శుక్రుడు ఉన్నారు. కుజుడు యువకుడు, యుద్ధప్రియుడు, సుక్షిత్రుయుడు,  రాజుగా ఆచారాలకు కట్టుబడి ఉండకుండా తిరిగేవాడు. రాక్షస గురువైన శుక్రాచార్యుడు స్త్రీ కారకుడు మాయ మంత్ర తంత్రవాది, కుజుడుకి పరమ శత్రువు. రాజుమాటకి మంత్రి మాటకి పడకపోవడం వల్ల మంత్రులు క్రూర స్వభావులై రాజ్యపాలనను బ్రష్టు పట్టించారు. స్త్రీ వ్యామోహంతో కలహాలు పెంచి దైవకార్యాలు నిర్వహించే వంశాలను అంతరరించేలా చేశారు. ఇలా రాక్షసులు, దుర్మార్గుల వలన త్రేతాయుగంలో ధర్మం ఒకభాగం దెబ్బతిని మూడుపాదాలపై నడిచింది.


Also Read: భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు - మీకేం అర్థమైంది!


ద్వాపరయుగం


మూడోది ద్వాపర యుగం. శ్రీ మహావిష్ణువు శ్రీ కృష్ణుడుగా అవతరించాడు. దీని కాల పరిమాణం 8 లక్షల 64 వేల సంవత్సరాలు.  ద్వాపర యుగంలో రాజుగా చంద్రుడు, మంత్రిగా బుధుడు ఉన్నారు. చంద్రుడిది గురు వర్గం, బుధుడిది శనివర్గం. అందుకే వీరిద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు.  బుధుడు చెడు విద్యలను రాక్షసులకు , దుర్మార్గులకు ఇచ్చి సాధువులకు, సజ్జనులకు, స్త్రీలకు అపకారం చేయమని పురికొల్పుతాడు. దేవతా కార్యాలు జరగకుండా అడ్డుపడతాడు. చంద్రుడు సకలవిద్యా పారంగతుడు. రాజులకు సకల విద్యలు నేర్పించి దుష్టులను-మాయావులను నాశనం చేయడానికి సహకరిస్తాడు. ఈ విధంగా ద్వాపర యుగంలో ధర్మం రెండు భాగాలు నశించి కలియుగం ప్రారంభమైంది. 


Also Read: సుఖానికి ఆధారం ఏది - సిగ్గు అంటే ఏంటి, యక్ష ప్రశ్నలు ఇవే!


కలియుగం


నాలుగోది కలియుగం. దీని కాలపరిమితి 4 లక్షల 32 వేల సంవత్సరాలు. అందులో సుమారుగా ఐదు వేల సంవత్సరాలు గడిచిపోయాయి. సూర్య సిద్ధాంతం ప్రకారం పూర్వ శఖము 3102 ఫిబ్రవరి 18 అర్ధరాత్రి కలియుగం ప్రారంభమైంది.  కలియుగానికి రాజు శని. మంత్రులు రాహు-కేతువులు. మంత్రులిద్దరికీ ఒకరకంటే ఒకరికి పడదు. రాహువు శనికి మిత్రుడు. కలియుగం ఆరంభంలో నాలుగు ధర్మ శాస్త్రాలు వాటిని రక్షించే బ్రాహ్మణులను, అగ్రహారాలను , రాజులను నశింపచేస్తూ వచ్చారు. అప్పటి నుంచి క్రూరత్వం, అసత్యం, అప్రమాణం, అధర్మం, అన్యాయం తలెత్తాయి.  వావి-వరుసలు తప్పి, వర్ణ సంకరాలు మొదలై దొరలే దొంగలవుతారు. దైవభక్తి తగ్గి హింసా సిద్ధాంతాలు పెరుగుతాయి.  స్త్రీని, ధనాన్ని పొందినవాడే గొప్పవాడని అనుకునే రోజులొస్తాయి. అధర్మం, వర్ణద్వేషాలు, మత విద్వేషాలు పెరుగుతాయి. ఈ యుగంలో మానవుడి సగటు ఆయుష్షు వందేళ్ల కన్నా తక్కువే. యుగాంతానికి ఈ వయసు 12 ఏళ్లకు తగ్గిపోతుందని భగవద్గీతలో ఉంది. 


కలియుగాంతంలో కల్కి రూపంలో భగవంతుడు అవతరించి తిరిగి సత్య యుగ స్థాపనకు మార్గం సుగమం చేస్తాడని శివపురాణం చెబుతోంది. సత్యయుగం ప్రారంభమైనప్పటి నుంచీ మళ్లీ అంతా మంచే జరుగుతుంది..