Significance Of Yogini Ekadashi 2024: సంవత్సర కాలంలో వచ్చే 24 ఏకాదశిలలో యోగిని ఏకాదశి ఒకటి. శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన ఈ రోజు ఉపవాసం, ధ్యానం, విష్ణుసహస్రనామ పారాయణం అత్యంత పుణ్యఫలం. శరీరం, మనసుపై అదుపుల సాధించి భగవంతుడి సన్నిధికి చేరుకునేందుకు చేసే ప్రయత్నమే ఏకాదశి వ్రతం ఆచరించడం వెనుకున్న పరమార్థం. ప్రతి ఏకాదశికి విశిష్టత ఉన్నట్టే యోగిని ఏకాదశికి కూడా ప్రత్యేకత ఉంది. ఈ ఏకాదశి విశిష్టత గురించి శ్రీ కృష్ణుడు ధర్మరాజుకి వివరించినట్టు పురణాల్లో ఉంది. 


Also Read: మహాభారత యుద్ధం జరిగిన కురుక్షేత్ర ఎక్కడుంది..ఎలా వెళ్లాలి..అక్కడ చూసేందుకు ఏమున్నాయ్?


యోగిని ఏకాదశి కథ


అలకాపురి అనేది కుబేరుడి నివాసం. ఈయన యక్షుల రాజు. సంపద మొత్తానికి అధిపతి. విశ్వంలో ఉన్నమొత్తం సంపదను కాపాడే బాధ్యత కుబేరుడికి అప్పగించాడు పరమేశ్వరుడు. రాజ్య పాలన మొత్తం ఇంద్రుడు అయితే...సంపద మొత్తం కుబేరుడి అధీనంలో ఉంటుంది (సలక సంపదలకు ఈ నిలయం అని కాళిదాసు రచించిన మేఘదూతలో ఉంది). అందుకే తన సేవకులైన యక్షులను ఆ సంపదకు కాపలాగా ఉంచుతాడు కుబేరుడు. తమ విధులను ఆచరించే క్రమంలో ఎవరు ఎలాంటి పొరపాటు చేసినా కుబేరుడి ఆగ్రహానికి గురికాకతప్పదు. నిత్యం పరమేశ్వర ఆరాధనలో ఉండే కుబేరుడికి..పూజకోసం పూలు సమకూర్చే బాధ్యత హేమాలి అనే యక్షుడికి అప్పగించాడు. తన బాధ్యతను అత్యంత నిష్టతో ఆచరించే హేమాలికి అత్యంత రూపవతి అయిన స్వరూపవతి అనే యక్షిణితో వివాహం జరిగింది. ఆమె సౌందర్యారాధనలో మునిగితేలిన హేమాలి...శివపూజకోసం కుబేరుడికి పూలు ఇవ్వడం మర్చిపోయాడు. పూల కోసం ఎదురుచూసి చూసి ఆగ్రహించిన కుబేరుడు వెంటనే హేమాలిని తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. శరీరంపై మోహంతో, మనసు మలినం చేసుకుని దైవపూజను మర్చిపోయావు..అందుకు ప్రతిఫలంగా నీ భార్యకు దూరంగా కుష్టువ్యాధితో భూలోకంలో జీవించు అని శపించాడు. తన అపరాధం మన్నించమని హేమాలి...కుబేరుడిని వేడుకున్నాడు. అయితే ఇన్నేళ్లుగా శివారాధనలో భాగం అయిన హేమాలికి ఆ పుణ్యఫలం  వల్ల మార్కండేయ రుషి ఆశ్రమానికి చేరుకున్నాడు. తన పరిస్థితి, శాపం గురించి వివరించి శాపవిమోచనం ఏంటని అడిగాడు.అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుకి ఉపదేశించిన యోగిని ఏకాదశి వ్రతం గురించి మార్కండేయుడు హేమాలికి చెప్పాడు. అలా జ్యేష్ఠమాసంలో అమావాస్య ముందు వచ్చే ఏకాదశినాడు వచ్చే యోగిని ఏకాదశి వ్రతమాచరించి శాపవిమోచనం పొందాడు యక్షుడు.


Also Read: మహాభారత విషాద వీరుడు సూర్య పుత్ర కర్ణుడిని ముంచేసిన మూడు శాపాలు ఇవే!


యోగిని ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాస నియమాలు పాటించి భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువును పూజిస్తారో వారు సకలపాపాల నుంచి విముక్తి పొందుతారు. యక్షుడు హేమాలి కథ కేవలం పురాణాల్లో చెప్పుకునే కథ మాత్రమే కాదు...ప్రతి ఒక్కరు తమ శరీరంపై ఉన్న వ్యామోహం వీడాలి అని చెప్పేందుకు హెచ్చరిక కూడా. అందుకే శరీరం, మనసు అదుపులో ఉండాలంటే ప్రతి 15 రోజులకు ఓసారి ఉపవాసం ఉండాలంటారు పండితులు. ఏ ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలన్నా దశమి రోజు రాత్రి నుంచి నియమాలు పాటించాలి. ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి రోజు కూడా సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానమాచరించి..శ్రీ మహావిష్ణువును పూజించి...దాన ధర్మాలు చేసి భోజనం చేయాలి. యోగిని ఏకాదశి వ్రతం ఆచరిస్తే ఆరోగ్యం, సకలసంపదలు సమకూరుతాయంటారు పండితులు.  


Also Read: కర్ణుడు - అర్జునుడు ఇద్దరిలో ఎవరు బలవంతులు? కల్కి 2898 AD సినిమాలో ఏం చూపించారు - పురాణాల్లో ఏముంది?


గమనిక : పురాణాలు, శాస్త్ర గ్రంధాల్లో పేర్కొన్న విషయాలతో పాటూ పండితులు చెప్పిన వివరాల ఆధారంగా రాసిన కథనం ఇది. దీనిని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.